పైడిపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల కాల్పులు
రీకౌంటింగ్ డిమాండ్‌తో రణరంగం…
బీకర బీభత్సం.. లాఠీ చార్జ్.. పోలీసు వాహనాలకు నిప్పు
(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
తెలంగాణలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తై ఫలితాలు వెలువడిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఫలితం ప్రకటించిన అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగగా, పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
పైడిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు గంగుల మంగ సర్పంచ్‌గా గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో బ్యాలెట్‌లోని ఓట్లు పూర్తిగా లెక్కించకుండానే ఫలితం ప్రకటించారని ఆమె వర్గం ఆరోపిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగింది.
ఈ క్రమంలో వందలాది మంది గ్రామస్తులు కౌంటింగ్ సెంటర్ గేట్ ముందు బైఠాయించి బ్యాలెట్ బాక్సులను అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. “న్యాయం జరిగే వరకు బ్యాలెట్ బాక్సులు బయటకు వెళ్లనివ్వం” అంటూ నినాదాలు చేశారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన కాస్తా ఘర్షణగా మారింది.
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి చల్లబడకపోవడంతో చివరకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. దీనికి ప్రతిస్పందనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వగా, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ పోలీసు సహా పలువురు గాయపడినట్లు సమాచారం.
ఘర్షణ సమయంలో కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కఠిన భద్రత మధ్య అక్కడి నుంచి తరలించారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత పూర్తిగా చల్లారలేదని తెలుస్తోంది.
మరోవైపు ఓట్ల లెక్కింపు న్యాయబద్ధంగానే జరిగిందని, అన్ని నిబంధనల ప్రకారమే ఫలితాలను ప్రకటించినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు. అయితే రీకౌంటింగ్ చేయాలన్న డిమాండ్‌పై స్పష్టత లేకపోవడంతో గ్రామస్తుల్లో అసంతృప్తి కొనసాగుతోంది.
ప్రజాస్వామ్య పండుగగా చెప్పుకునే ఎన్నికల అనంతరం పైడిపల్లి గ్రామం రణరంగాన్ని తలపించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫలితాల పారదర్శకతపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు ఎన్నికల అధికారులు ఎలా సమాధానం చెబుతారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.





