ప్రధాని మోదీ ‘మిషన్–విజన్’ పత్రం లోగో, ముఖచిత్రాల ఆవిష్కరణ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరిపాలనా దక్షత, నాయకత్వ మైలురాళ్లను వివరిస్తూ రూపొందిస్తున్న ‘ నరేంద్ర మోదీ మిషన్–విజన్’ త్రిభాషా గ్రంథాల లోగో కవర్ పేజీలను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు (Vakulabharanam KrishnaMohan Rao) రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. సమకాలీన నాయకత్వం, పరిపాలనా సంస్కరణలను సమగ్రంగా పత్రరూపంలో భద్రపరచడం అభినందనీయమన్నారు. ఇలాంటి గ్రంథాలు విద్యార్థులకు, విశ్లేషకులకు, సామాన్య ప్రజలకు ప్రధాని మోదీ విధానాలపై అవగాహన కల్పించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

మూడు భాషల్లో.. మూడు సంపుటాలు:

డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు గత ఐదు నెలలుగా ఈ గ్రంథాల రూపకల్పనపై నిరంతరం పని చేస్తున్నారు. ప్రధాని మోదీ జీవన ప్రయాణం, ఆయన చేపట్టిన జాతీయ స్థాయి సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల సమాహారంగా ఈ మూడు సంపుటాల సూచిక గ్రంథం సిద్ధమవుతోంది. ఇది తెలుగు, హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వెలువడనుంది.
ప్రస్తుతం ఆవిష్కరించిన లోగో, ముఖచిత్రాలు ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అధికారికంగా వినియోగంలో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మార్చి నెల చివరి వారంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ త్రిభాషా గ్రంథాల పూర్తిస్థాయి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ రూపకర్త వకుళాభరణం కృష్ణమోహన్ రావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *