(
Your message has been sent
జూబ్లీహిల్స్ ఎన్నికలపైన రాజకీయ పార్టీల భవిష్యత్ ఆధారపడిఉందా ? అందుకే అన్ని పార్టీలు తమ శక్తివంచన లేకుండా పోరాటం చేస్తున్యాయా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఇక్కడ ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ మూడిరటిలో బిజెపికి ఈ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా పెద్దగా ఒరిగేదిలేదు. కాని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌కు మాత్రం రాజకీయంగా పెద్ద దెబ్బే ఎదురుకానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా బిఆర్‌ఎస్ విషయానికొస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటమన్నది ఆ పార్టీకి అనివార్యమైంది. అందుకే తన శక్తి, యుక్తులను ఒడ్డుతున్నది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకోవడంతోపాటు, రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన పార్టీగా పేరుంది. ఈ పదేళ్ళ కాలంలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా, చెప్పని అనేక సంక్షేమకార్యక్రమాలను అమలుపర్చినట్లు ఆ పార్టీ చెప్పుకుంటున్నది. అయితే రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నమాట తప్పిందన్న అపవాదను పన్నెండు ఏళ్ళుగా ఎదుర్కుంటున్నది. అంతేకాదు నిరుద్యోగులకు ఇచ్చిన హామీకాని, ఉద్యమ నేతలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఆ పార్టీపైన ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుకాగా గత ఎన్నికల్లో కాళేశ్వరం కాలనాగై ఆ పార్టీని కాటేసింది. దానికి తోడు కెటిఆర్‌పైన, కవిత మీద కేసులు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవి ఇలాఉంటే పార్టీకి చెందిన పదిమంది ఎంఎల్‌ఏలు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి ఎదురైన మరో పెద్ద దెబ్బ. ఈ ఎంఎల్‌ఏలపై తీసుకునే చర్యలేంటో తేలుతేగాని మరికొందరు కాంగ్రెస్ గూటికి చేరాలా వద్దా అన్నది తేల్చుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి క్లిష్టపరిస్థితిని ఎదుర్కుంటున్న బిఆర్‌ఎస్‌కు జూబ్లీహిల్స్ ఎన్నిక నిజంగానే ఒక పరీక్షగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు పార్టీ మనుగడపై ప్రభావం చూపుతాయన్న విశ్లేషణ జరుగుతున్నది. దానికి తగినట్లుగా గత రెండేళ్ళుగా బిఆర్‌ఎస్ వెంటపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఎన్నికతో బిఆర్‌ఎస్ భూస్థాపితమవుతుందని కాంగ్రెస్ జోష్యం చెబుతున్నది. ఎట్టిపరిస్థితిలో జూబ్లీహిల్స్‌ను గెలిచి, బిఆర్‌ఎస్ చెంప చెళ్ళుమనిపించాలంటున్నారు ఆ పార్టీ నాయకులు. అయితే ప్రజలనుండి వచ్చిన స్పందనతో తాము ఎప్పుడో గెలిచేశామని, కేవలం మెజార్టీకోసమే కృషిచేయాల్సిఉందని కార్యకర్తలను కాంగ్రెస్ ఉత్సాహ పరుస్తున్నది. ఇక్కడ బిఆర్‌ఎస్‌ను ఓడిస్తే, రానున్న స్థానిక ఎన్నికల్లోకూడా విజయం తమవైపే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచన. అందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు మంత్రులు, ముఖ్యనేతలకు బాధ్యతలను అప్పగించి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడున్న సినీ కార్మికులతోపాటు, వివిధ సామాజిక వర్గాలవారితో సభలు, సమావేశాలను ఏర్పాటుచేస్తున్నది. అధికారంలోఉన్న పార్టీకావడంతో ఈ నియోజక అభివృద్ధిపైన అనేక వాగ్దానాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషిచేస్తున్నది కాంగ్రెస్. కంటోన్మెంట్‌లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడంతో ఆక్కడ కోట్లాది రూపాయల ఆభివృద్ది పనులను చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇక్కడ కూడా తమకు ఒక అవకాశమిస్తే వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలవర్షం గుమ్మరిస్తున్నాడు. బోరబండ క్రాస్‌రోడ్‌కు స్వర్గీయ పి. జనార్థన్‌రెడ్డి పేరు పెడుతామన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన సామాజిక వర్గంతోపాటు, ఎన్టీఆర్ అభిమాన ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సినీకార్మికుల వెల్‌ఫేర్ ఫండ్ ఏర్పాటుచేసి, ప్రభుత్వం తరఫున పదికోట్లు డిపాజిడట్ చేస్తామని హామీ ఇచ్చారు. సినీ కార్మికుల పిల్లలకు పన్నెండవ తరగతివరకు ప్రభుత్వమే మంచి స్కూల్‌ను ఏర్పాటుచేస్తుందన్న హామీ ఇచ్చారు. అయితే పార్టీలో మాత్రం సఖ్యతలేదన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికీ మంత్రుల మద్య, మంత్రులు ఎంఎల్‌ఏల మద్య వివాదాలు కొనసాగుతున్నాయి. కాగా, తమ నియోజకవర్గాల్లో ఏ చిన్నపని చేపట్టాలన్నా నిధులు లేకపోవడంతో స్థానిక ప్రజలకు ముఖం చూపించుకునే పరిస్థితిలోలేమని కొందరు ఎంఎల్‌ఏలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని పాలనలో పట్టు సాధించలేకపోతున్న ఈ ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం సాగుతున్నది. ఎట్టిపరిస్థితిలో తన సీటు ఎసరు రాకుండా ఉండాలంటే జూబ్లీ హిల్స్ గెలుపు సిఎం రేవంత్‌రెడ్డికి అనివార్యంగా మారింది.
దీనికి తగినట్లుగా 500 రోజుల్లో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, మళ్ళీ కెసిఆర్ సి.ఎం పగ్గాలు పట్టనున్నారంటూ బిఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికలముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని, హైడ్రాను ప్రజలముందు బూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నది బిఆర్‌ఎస్. తమ హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేప పథకాలకు కాంగ్రెస్ స్వస్థిచెప్పడాన్ని బిఆర్‌ఎస్ బాగా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే విషయంలో పేదింటి అమ్మాయిల పెండ్లికి ఇస్తామన్న తులం బంగారం, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కెసిఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్ లాంటివాటిని కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలుచేయడాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. అంతేకాదు ఆడపిల్ల పుడితే 13వేలు, మగ పిల్లవాడు అయితే 12 వేలు, రంజాన్, బతుకమ్మ చీరలు, క్రిస్టీయన్ గిఫ్ట్ లాంటి పలు పథకాలను నిలపివేయడంద్వారా కాంగ్రెస్‌ను దోషీగా నిలబెట్టే ప్రయత్నంచేస్తున్నది. కనీసం ఎన్నికలముందు తాను ఇచ్చిన వాగ్ధానాలను కూడా కాంగ్రెస్ నిలుపుకోవడంలేదంటూ, ఆ పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బకాయిపడిరది, బాకీ కార్డులద్వారా చేస్తున్న ప్రచారం ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ చేస్తున్న ప్రసంగాలపై ప్రజలనుండి మంచి రెస్పాన్స్ వస్తున్నది. తమకు ఓటు వేయకపోతే పథకాలను రద్దుచేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడంపైన కూడా ఆయన తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓట్లకోసం ప్రజలను భయపెట్టే విధానాన్ని సిఎం రేవంత్‌రెడ్డి మానుకోవాలని కెటిఆర్ హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉంటే బిఆర్‌ఎస్‌కు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారింది. పార్టీలో ఇప్పటికే చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటివరకు పార్టీ నుంచి నిష్క్రమించినవారిదంతా పార్టీ అధినేత కెసిఆర్ అందుబాటులో ఉండడన్నది ప్రధాన ఆరోపణ. తమ సాధక బాధలు చెప్పుకునేందుకు సంవత్సరాల తరబడి ఎదురుచూసి, విధిలేక పార్టీని వీడినట్లు ఆరోపించడం తెలిసిందే. సాక్షాత్తు కెసిఆర్ కూతురు కవిత తన తండ్రికి రాసిన లేఖ బహిర్ఘతం కావడం, పార్టీనుండి తాను బహిష్కరణకు గురవడానికి కారకులపై ఆమె వేలెత్తి చూపడం లాంటి పరిణామాలు బిఆర్‌ఎస్ పార్టీని ఇరుకున పెట్టేవిగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తే, మరో మూడెళ్ళపాటు ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే అంటున్నారు. అందుకే ఎట్టిపరిస్థితిలో జూబ్లీహిల్స్‌ను తిరిగి సాధించుకోవాలన్న పట్టుదలతో బిఆర్‌ఎస్ ఉంది. ఇందుకోసం కెటిఆర్ అంతటా తానే అయి ఇక్కడ విస్తృత ప్రచారం చేస్తుండగా, పార్టీ శ్రేణులంతా అక్కడే తిష్టావేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





