పారా అథ్లెట్‌ అర్చనకు కేటీఆర్‌ అండ

– శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ఆర్థిక సాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పారా-అథ్లెట్‌ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. కుట్టు పని ద్వారా తన జీవనోపాధిని గడుపుతున్న అర్చనను డిసెంబర్‌ 8 నుండి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పారా త్రోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంపిక చేసింది. అయితే ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అర్చన ఆవేదన గురించి తెలుసుకున్న కేటీఆర్‌ ఆమెను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని కూడా ఆమెకు అందజేశారు. కేటీఆర్‌ నుంచి సకాలంలో లభించిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే అర్చన కల సాకారం కానుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అర్చన జీవితం ధైర్యం, పట్టుదలకు నిదర్శనం. చంద్రంపేటలోని ఒక కుట్టు మిషన్‌ నుండి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం. రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు ఆమెకు అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *