రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత వర్గాలకొక న్యాయం! పేదోడికొక న్యాయం!

 “రాజకీయ పలుకుబడితో పాటు ధన బలమున్న ఉన్నత వర్గాల వారు ఎంతటి తీవ్ర నేరం చేసినా స్టేషన్ బెయిల్ పొంది బయట పడుతున్నారు. తుదకు కేసుల మాఫీకి కూడా తలపడుతున్నారు. పేద వాడికి ఒక న్యాయం ఉన్నత వర్గాలకు ఒక న్యాయం అమలు జరగడంతో పోలీసు వ్యవస్థపైననే సామాన్య జనం నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.ఈ విషయంలో రెండు రాష్ట్రాలు దొందుదొందే..”

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాల్లో పోలీస్ వ్యవస్థ ఇటీవల బాగా అపకీర్తి మూట గట్టు కొన్నది. ఇందులో రాష్ట్రపాలకుల వంతు లేక పోలేదు. ఒక దాని వెంబడి మరొక సంఘటన జరగడంతో గుక్క తిప్పుకోలేని విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం కింద స్థాయిలో జరిగిన తప్పులను ఉన్నతాధికారులైనా తిరిగి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలా లేదు. రాజకీయ పలుకుబడితో పాటు ధన బలమున్న ఉన్నత వర్గాల వారు ఎంతటి తీవ్ర నేరం చేసినా స్టేషన్ బెయిల్ పొంది బయట పడుతున్నారు. తుదకు కేసుల మాఫీకి కూడా తలపడుతున్నారు. పేద వాడికి ఒక న్యాయం ఉన్నత వర్గాలకు ఒక న్యాయం అమలు జరగడంతో పోలీసు వ్యవస్థపైననే సామాన్య జనం నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది.ఈ విషయంలో రెండు రాష్ట్రాలు దొందుదొందే. వాచ్ డాగ్ లా వ్యవహరించ వలసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా పోలీస్ శాఖ కన్నా కనాకష్టంగా తయారైనందున సోషల్ మీడియా కొంత మసాలా దట్టించి బహిర్గతం చేస్తున్నందున సామాన్యుడికి బలహీన వర్గాలకు కొంతలో కొంత ఊరట లభిస్తోంది.

ముందుగా తెలంగాణ గురించి మాట్లాడుకొందాం. ఫోక్సో కేసులు సందర్భంలో పోలీసులు ఎంత కఠినంగా వుండాలనో చెప్ప పని లేదు. మొన్న చెన్నై లో జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోక్సో కేసులు విషయంలో ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా చూడాలని సూచించారు. గతంలో తెలంగాణలోనే పోలీస్ అధికారులు కీలకమైన ఇలాంటి కేసులు సందర్భంగా వ్యవహరించిన తీరు ప్రశంసలు పొంది వున్నారు. అయితే కేంద్ర మంత్రి బిజెపి నేత కుమారుణి యెడల పోలీస్ వ్యవస్థ వ్యవహరించిన తీరుపై దారుణమైన విమర్శలు వెల్లు వెత్తాయి.సోషల్ మీడియానే కాకుండా కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. తుదకు ఈ విమర్శలు ప్రభుత్వ నేతలను తాకాయి. ఎంతో లబ్దప్రతిష్ఠులైన పోలీస్ అధికారులు కూడా అపకీర్తి మూట గట్టు కోవలసి వచ్చింది.

ఈ సంఘటన ప్రభావం మాసి పోతున్న దశలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జనసేన రాజ్య సభ సభ్యుని కుమారుడు కిరాతకంగా కారుతో ఒక మహిళ ఢీ కొట్టగా స్పాట్ లోనే మృతి చెందినది. ఈ సంఘటనలో పోలీసు యంత్రాంగం పరువు గంగ పాలైంది. పోలీసులు స్టేషన్ లో బెయిల్ ఇచ్చి దర్జాగా పంపేశారు.కనీసం మద్యం సేవించి వున్నారా? అనే పరీక్ష కూడా చేయ లేదని చెబుతున్నారు. అదే సాధారణ కారు లారీ డ్రైవర్ ప్రమాదం చేసి వ్యక్తి ఎవరైనా స్పాట్ లో మృతి చెందితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారా? ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు చట్టాలు ఏమైనా వున్నాయా? ఈ సంఘటనలో పై నుండి ఒత్తిడి లేనిదే క్రింది స్థాయి అధికారి స్టేషన్ బెయిల్ ఇవ్వలేరేమో! తాజాగా తెలుస్తున్న సమాచారం ఏమంటే ప్రమాదం చేసింది స్పోర్ట్స్ కారు అని పైగా 80 కిలోమీటర్ల స్పీడ్ తో నడిపారని తెలుస్తోంది. చేతి నిండా డబ్బు వుండి ఎంతైనా వ్యయం చేయ గల సత్తా వుంది కాబట్టి ఇంత దురాగతానికి పాల్పడిన ఈపతి ఇత్తు” వీడియోలు చేసి సోషల్ మీడియా నిండుగా వదలి పెట్టాడు. ఈలాటి సంఘటనలు పరిశీలించితే పెట్టుబడి దారీ వ్యవస్థలో ఉన్నత వర్గాలకు రాజకీయ నేతల సంరక్షణకే పోలీస్ వ్యవస్థతో పాటు ప్రభుత్వం యంత్రాంగం పని చేస్తుందని నక్సలైట్ భావించడం తప్పు కాదేమో.

తెలంగాణ వ్యవహార సరళి ఇలాగుంటే తాటిదన్ను వాని తల దన్నునట్లు ఇటీవల ఘోరాతి ఘోరమైన సంఘటనలు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సంభవించాయి. విజయవాడ నడి బొడ్డున పటమట లంక పోలీస్ స్టేషన్ లోనే ఒక యువకుడు అదృశ్యమయ్యాడు. అతను నేరస్తుడు. . హత్యానేరాల్లో ముద్దాయి కావచ్చు. పోలీసు అధికారి శిక్ష అమలు జరపడమే ఈ కేసులో ప్రత్యేకత. మార్కాపురం నుండి విచారణ నిమిత్తం ఈ యువకుణి పటమట పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. అంతిమంగా లాకప్ డెత్ కు బలి అయ్యాడు. ఎన్ని చట్టాలు కోర్టులు వున్నా పోలీస్ స్టేషన్ ల్లో థర్డ్ డిగ్రీ తప్పడం లేదు. కాని పటమట లంక పోలీస్ స్టేషన్ సంఘటనలో ప్రత్యేకత ఏమంటే భౌతిక కాయాన్ని కూడా కాల్చి బూడిద చేశారు. అతని తల్లికి కాలిన బూడిద కూడా దక్క లేదు. తెలంగాణకు ఆంధ్ర ప్రదేశ్ కు సామాజికంగా ఎంతో భిన్నత్వముంది. తెలంగాణలో కులాల కుంపటి అంతగా కనిపించదు. కాని ఆంధ్ర ప్రదేశ్ లో కుల గజ్జి తీసుకు వస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కదిలే సమస్య లేదు. పటమట లంక పోలీస్ స్టేషన్ లో అదృశ్యమైన వ్యక్తికి చెందిన కులస్తుల నుండి ఆందోళన బయలు దేరిన తర్వాతనే ప్రభుత్వం కదిలింది.

కుల గజ్జి గురించి ఎందుకు నొక్కి చెబుతున్నానంటే ఈ సంఘటన జరిగిన తర్వాత హైదరాబాద్ కారు ప్రమాదాన్ని తలదన్నే విధంగా రాజమండ్రిలో పిజి చేస్తున్న ఒక మహిళా డాక్టర్ సినిమాకు వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా స్థానికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందిన యువకులు ఒకటి రెండు మార్లు కారుతో ఢికొట్టి ఆమెపై కారు నడుపుకుంటూ వెళ్లాడు. ఆమె తల ఛిద్రమైనది. చావు బతుకులు మధ్య హాస్పిటల్  పాలై అంతిమంగా హైదరాబాద్ హాస్పిటల్  లోనే ప్రాణాలు విడిచింది. కాని రాజమండ్రి పోలీసులు తొలుత నిందితులను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు . ఈ సంఘటనపై సోషల్ మీడియాతో పాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు కొందరు డాక్టర్లు రచ్చ కెక్కిన తర్వాత గాని పోలీసులు సెక్షన్లు మార్పు చేయ లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణాకు మించి రాజకీయ జాఢ్యం కూడా వ్యాపించి వుంది.

ఈ సంఘటన జరిగిన సమయంలోనే మరొక జిల్లాలో పోలీస్ అధికారిపై దురుసుగా వ్యవహరించిన నేరానికి పోలీసులు అరెస్టు చేసిన నేతను వీధిలో నడిపించుకొంటూ కోర్టుకు తీసుకెళ్లారు. ఊహించడానికే భయం కలిగించే నేరానికి పాల్పడిన రాజమండ్రి సంఘటన నిందితులను మూడవ కంటికి తెలియకుండా అరెస్టు చేశారు. వాస్తవంలో ఈ లాంటి నేరాలకు పాల్పడే వారిని వీధుల్లో నడిపించాలి. అప్పుడే నేరస్తులకు భయం ఏర్పడుతుంది. ఇప్పుడేమైంది?నేరస్తులకు ఏం సంకేతం వెళ్లింది? రాజమండ్రి యువకులు ఉన్నత వర్గాలకు చెందటమే కాకుండా రాజకీయంగా బల వంతులు కూడా. గమనార్హమైన అంశమేమంటే మృతి చెందిన మహిళ డాక్టర్ రాజమండ్రి స్థానికురాలు కాదు. పైగా కులస్తుల అండ లేదు.

ఇవి రెండూ లేవు కాబట్టి నిందితులకు అనుకూలంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను బదలీ చేస్తే తప్ప కేసు బతికి బట్ట కట్టడనే ఆందోళన జన సామాన్యంలోమొదలైంది. అందుకే కేసు రాష్ట్ర పోలీసులు కేసు నీరు గార్చుతారని తలిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు గాని లేక రాష్ట్ర ప్రభుత్వం గాని తొలుత ఈ కేసును డీల్ చేసిన అధికారులను రాజమండ్రి నుండి బదలీ చేసి వుంటే ఆమె తలిదండ్రులు ఆందోళన చెందేందుకు ఆస్కారం వుండేది కాదు. దురదృష్టమేమంటే మృతురాలకు స్థానికత లేక పోవడం పైగా నిందితులు స్థానికులే కాకుండా రాజకీయంగా ఆర్థికంగా బలవంతులని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులనైనా నమ్మకం లేదని మధనపడుతున్నారు. 20 లక్షలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపు కొన్నది. రెండు రాష్ట్రాలలోనే కాదు ఈ దేశంలో ఎక్కడికెళ్లినా పేదోడికి రాజకీయ అండ లేని వారికి మతం కులం అండ లేని వారికి న్యాయం దక్కడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *