“ప్రేమ మనిషి హృదయాన్ని శాశ్వతగీతంగా మలుస్తుంది”, “ప్రేమ అనేది గాలిలాంటిది కనిపించదు కానీ నిలబెడుతుంది”, “ప్రేమలో మాటలకన్నా మౌనం ఎక్కువ చెబుతుంది” ఇలాంటి ఎన్నో ప్రేమభావనల్ని ఆలోచనల్ని తన ‘Ode to Love’ లో ప్రసిద్ధకవి కె. శివారెడ్డి మనముందు పరుస్తారు. “Ode to Love” లేదా “ప్రేమగీతం” అనేది ఆయన తన కవిత్వంలో చేసిన అత్యంత లోతైన అన్వేషణలలో ప్రధానమయినది. ఈ కవితలో ప్రేమను కేవలం రొమాంటిక్ భావనగా కాకుండా మానవతా, తాత్విక, విశ్వవ్యాప్తశక్తిగా చిత్రించారు. నిజమే కొన్ని ప్రేమలు మన జీవితంలోకి ఉత్సవంలా రావు. అందులో బాణసంచా శబ్దాలూ ఉండవు. పూలదండలూ ఉండవు. అవి మెల్లగా మాటల మధ్య ఖాళీల్లా, గుండెల్లో మిగిలిపోయిన మౌనంలా మనతోపాటు నడుస్తుంటాయి.
తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ఆధునిక కవిత్వంలో కె. శివారెడ్డి ది అత్యంత ప్రభావవంతమయిన స్వరం. 1943 లో గుంటూరు జిల్లా, కర్మూరివారిపాలెం గ్రామంలో జన్మించిన ఆయన రైతు కుటుంబంలో పెరిగి బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. హైదరాబాద్ వివేకవర్ధిని కాలేజీలో 35 సంవత్సరాలు ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పనిచేసి ప్రిన్సిపల్‌గా పదవీవిరమణ చేశారు. 1973లో శివారెడ్డి తన మొదటి కవితాసంపుటి ‘రక్తసూర్యుడు’తో కవితా ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటికి 23కి పైగా కవితా సంపుటాలను వెలువరించారు. సమగ్ర కవితా సంపుటాలూ వెలువడ్డాయి. ‘మోహనా! ఓ మోహనా’కు సాహిత్య అకాడమీ అవార్డు, ‘పక్కకి ఒత్తిగిలితే’కి సరస్వతి సమ్మాన్, కబీర్ సమ్మాన్ వంటి అనేక గౌరవాలు అందుకున్నారు. ఆయన కవిత్వం, విప్లవదృక్పథంతో లోతైన మానవీయతను కలిగి, ఒకతరం తెలుగు కవుల్ని ప్రభావితం చేసారు. శివారెడ్డి కవిత్వం, సాధారణభాషలో శాస్త్రీయదృక్పథాన్ని కలిపి, భావోద్వేగాలను ఊపందుకునేలా ధ్వనిస్తుంది. ఆయన కవిత్వం- గ్రామీణజీవితం, ప్రకృతి, బాల్యం, స్త్రీలు, మానవ విశ్వాసం, శోషణ, విప్లవం వంటి అనేక అంశాలను స్పృశిస్తుంది.
“ప్రేమ మనిషి హృదయాన్ని శాశ్వతగీతంగా మలుస్తుంది”, “ప్రేమ అనేది గాలిలాంటిది కనిపించదు కానీ నిలబెడుతుంది”, “ప్రేమలో మాటలకన్నా మౌనం ఎక్కువ చెబుతుంది” ఇలాంటి ఎన్నో ప్రేమభావనల్ని ఆలోచనల్ని తన ‘Ode to Love’ లో ప్రసిద్ధకవి కె. శివారెడ్డి మనముందు పరుస్తారు. “Ode to Love” లేదా “ప్రేమగీతం” అనేది ఆయన తన కవిత్వంలో చేసిన అత్యంత లోతైన అన్వేషణలలో ప్రధానమయినది. ఈ కవితలో ప్రేమను కేవలం రొమాంటిక్ భావనగా కాకుండా మానవతా, తాత్విక, విశ్వవ్యాప్తశక్తిగా చిత్రించారు. నిజమే కొన్ని ప్రేమలు మన జీవితంలోకి ఉత్సవంలా రావు. అందులో బాణసంచా శబ్దాలూ ఉండవు. పూలదండలూ ఉండవు. అవి మెల్లగా మాటల మధ్య ఖాళీల్లా, గుండెల్లో మిగిలిపోయిన మౌనంలా మనతోపాటు నడుస్తుంటాయి. ‘Ode to Love’ అలాంటి ప్రేమ గురించే. ఈ ‘ప్రేమగీతం’ ప్రేమను కేవలం గొప్పగా పాడే కవిత కాదు. ప్రేమతో కలిసి మిగిలిన అనుభూతిని, ఆ అనుభూతి తెచ్చే బాధ్యతను మెల్లగా మన ముందుంచుతుంది. ఈ కవిత జ్ఞాపకాల ఊరేగింపు. ఒక్కొక్క జ్ఞాపకం ఒక్కొక్కప్రశ్నగా మారుతుంది.
‘ప్రేమ అంటే ఏమిటి, దాన్ని పొందడమా, దాన్ని మోసుకెళ్లడమా?’ శివారెడ్డి కవిత్వంలో ప్రేమ పూలతోట కాదు అది ఎప్పుడూ సాగుతున్న పాదయాత్ర. అందులో అలసట ఉంది, అందులో ఆగిపోవాలనే కోరికా ఉంది, కానీ వెనుదిరగడం అంటూ లేదు. ఒకరిని స్వంతం చేసుకోవాలనే ఆత్రత కనిపించదు. ఇద్దరిమధ్య అంతరం ఉన్నప్పటికీ ఆ అంతరాన్ని గౌరవించే ధైర్యం కనిపిస్తుంది. ప్రేమ గతాన్ని మోస్తుంది. కానీ ఆ గతం మూసివేసిన గాయం మాత్రంకాదు ఎప్పటికీ మనల్ని మానవులుగా నిలబెట్టే జ్ఞాపకం. ‘Ode to Love’ లో ప్రేమ కేవలం శరీరపు పరిమితుల్లో ఇరుక్కుపోదు. అది శరీరాన్ని దాటి గొప్ప ఆలోచనగా మారుతుంది నైతికతగా మారుతుంది, మౌన నిరసనగా మారుతుంది. ప్రేమపై అధికారం చూపే ప్రపంచానికి ప్రేమను శివారెడ్డి బాధ్యతగా నిలబెడతాడు. నువ్వు నాది అని చెప్పడంలో కాదు నువ్వు వేరే అయినా నిన్ను నొప్పించకుండా ఉండడంలోనే ప్రేమ ఉందని చెబుతాడు. ఈ కవిత చదివిన తర్వాత మన ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ ఊరేగింపుగా వస్తాయి. వచ్చి గుండెల్ని చిన్నగా తడుముతాయి. అవి ఆనందం ఇవ్వకపోయినా ఓ బాధ్యతను మిగులుస్తాయి. ప్రేమ ఒక్కటే మన జీవితాన్ని సంపూర్ణం చేయదు. కానీ మనల్ని మరింత నిజాయితీగా జీవించడం నేర్పుతుంది అదే కవిగా శివారెడ్డి ‘Ode to Love’ ద్వారా మనకిచ్చిన నిశ్శబ్దమైన బహుమతి.
ఇప్పటివరకూ ప్రేమ గురించి రాసిన కవితలు సాధారణంగా ఉత్సవ స్వరంతో మొదలవుతాయి. ఆకాంక్ష, ఆవేశం, అనుభూతి ఇవే ప్రేమకవితల సహజ లక్షణాలుగా అలవాటు పడిపోయాం. అయితే ఆధునిక తెలుగు కవిత్వంలో శివారెడ్డి ప్రేమను సాంప్రదాయ దృక్పథానికి భిన్నంగా చూస్తాడు. ఆయన ‘Ode to Love’ ప్రేమపై రాసిన పొగడ్తకాదు, ప్రేమనే భావానికి సంబంధించిన బాధ్యతను, నైతికతను ప్రశ్నించే కవిత. ఇందులో ప్రేమ వ్యక్తిగత అనుభూతిగా మాత్రమే నిలవదు. అది ఒకస్థితిగా, మానసిక అవగాహనగా, చివరకు సామాజిక విలువగా మారుతుంది. శివారెడ్డి ప్రేమను స్వార్థంతో పొందాల్సిన వస్తువుగా కాకుండా, ఆర్తిగా అనుభూతిగా ఆవిష్కరిస్తాడు. “నాది–నీది” అనేభావన ప్రేమను వికృతం చేస్తుందని ఈ కవిత చెబుతుంది. ‘Ode to Love’ లో ప్రేమ- బద్దలయ్యే శబ్దాలమధ్య కాకుండా మౌనాలమధ్య వ్యక్తమవుతుంది. ప్రేమలో ఉత్సాహం తగ్గిపోయిన తర్వాత మనుషులకు మిగిలేది ఏమిటి? అన్నప్రశ్నను ఈ కవిత మంద్రంగా మన ముందుంచుతుంది. ఆ ప్రశ్నకు శివారెడ్డి ప్రేమనేది కలయిక మాత్రమే కాదు వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకరినొకరు గౌరవించుకోగల సామర్థ్యం అంటూ స్పష్టమయిన సమాధానం చెప్పారు.
ఈ కవితలో ప్రేమ కేవలం శరీరానికకే పరిమితం కాదు. శరీరానుభూతుల్ని దాటి ప్రేమ నైతికస్థానాన్ని ఆక్రమిస్తుంది. అందుకే ఈ ప్రేమలో అధికారం లేదు, ఆదేశం లేదు, స్వాధీనపరచుకునే ప్రయత్నం లేదు. ప్రేమను ఆధిపత్యంగా మార్చే సామాజిక ధోరణికి నిశ్శబ్ద ప్రతిఘటనగా కనిపిస్తుంది. శివారెడ్డి కవిత్వంలో ప్రేమ రాజకీయంగా కూడా వ్యక్తమవుతుంది. అది కేవలం వ్యక్తులమధ్య సంబంధాల గురించే కాక, సమాజంలో ఉన్న అసమానతల గురించి కూడా మాట్లాడుతుంది. ప్రేమను బాధ్యతగా చూడడమంటే ఇతరుల స్వేచ్ఛను కాపాడటమని చెబుతారు. ప్రేమను భావోద్వేగాల ఉప్పెనగా మాత్రమే చూసే ధోరణికి భిన్నంగా చైతన్యంగా, నైతిక అవగాహనగా నిలబెట్టే ప్రయత్నమే ఈ కవిత. అంతిమంగా ‘Ode to Love’ మనకు చెప్పేది ఒక్కటే ప్రేమ మన జీవితాన్ని సంపూర్ణం చేయకపోవచ్చు. కానీ అది మనల్ని నిజాయితీగా, మరింత మానవీయంగా జీవించేందుకు దారి చూపుతుంది. శివారెడ్డి ‘Ode to Love’ ఆధునిక తెలుగు కవిత్వంలో ప్రేమను కొత్తగా ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన కవితగా నిలుస్తుంది. “ప్రజలు వెళ్ళిపోతారు, కానీ కవిత్వం ఉంటుంది” అని ఆయన చెప్పినట్టు, కవిత్వం సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయుధంగా పనిచేస్తుంది. శివారెడ్డి ఈ ‘ప్రేమగీతం’ సాధారణ ప్రేమకవిత కాదు. అది ప్రేమని జీవితానికి ఆధారం చేసుకుని పాడిన గీతం. శివారెడ్డి దృష్టిలో ప్రేమే మానవాళిని నిలబెట్టే ఏకైకగీతం. ఇది వ్యక్తిగతం మాత్రమే కాకుండా, ప్రపంచమంతటినీ తాకే మానవగీతం.
వారాల ఆనంద్





