బ్లడ్ మనీకి అంగీకరించం: మృతుడి సోదరుడు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష విధించాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించేది లేదని మృతుడు తలాల్ మెహది కుటుంబం పట్టుబడుతోంది. ఆమెకు యెమెన్ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష బుధవారం అమలు కావాల్సి ఉండగా భారత ప్రభుత్వ ప్రయత్నాలతో వాయిదాపడిరది. అయినప్పటికీ ఈ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడి సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని శిక్ష అమలు వాయిదా అనంతరం కరాఖండిగా తేల్చిచెప్పారు. ‘మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు.. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడంలేదు.. అలాగని మేము ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చజాలవు‘ అని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఈ వాయిదాను తాము ఊహించలేదని, డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని, తమకు న్యాయం దక్కాల్సిందే అని అందులో పేర్కొన్నారు. దోషిని బాధితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని వ్యాఖ్యానించారు.



