– ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు పురస్కారం
– అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు గల్లంతు
స్వీడన్, అక్టోబర్ 10:ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు ఈ పురస్కారం లభించింది. అయితే ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా కమిటీ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు. వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ఆమె వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్ష నేతగా పనిచేశారు. వెనెజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె. శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషిచేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని అందుకున్నాయి. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ నిలువగా.. జోసెఫ్ రాట్‌బ్లాట్ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని ట్రంప్ అధ్యక్ష పీఠంపై ఎక్కిన నాటి నుంచి తహతహలాడిపోతున్నారు. ఆ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పీవోకేతోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం దాడులు చేపట్టింది. కొన్ని గంటల తర్వాత ఈ దాడులు ఆగిపోయాయి. దీంతో ఈ దాడులు తన ఆదేశాలకనుగుణంగానే ఆగిపోయాయంటూ ట్రంప్ వివిధ వేదికల మిద నుంచి పలు సందర్భాల్లో ప్రపంచానికి చాటే ప్రయత్నాన్ని చేశారు. కానీ ట్రంప్ చేసిన ఈ తరహా వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తొసిపుచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా గాజా-హమాస్ యుద్దవిరమణకు ఒత్తిడి తెచ్చారు. అయినా ఆశలు దక్కలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





