లంచం తీసుకునేంత దారిద్య్రం లేదు

కర్నాటక మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌

బెంగళూరు, జూన్‌ 25: పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు లేదంటూ కర్నాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల నుంచి తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానన్నారు. తన శాఖలో అవినీతికి తావు లేదన్నారు. ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ ఆరోపణలపై విచారణ జరుపుతామని, ఎమ్మెల్యేతోనూ మాట్లాడతానని అన్నారు. మంత్రి లంచం తీసుకున్నారని పాటిల్‌ ఎక్కడా ఆరోపించలేదన్నారు. ఏ పంచాయతీలోనైనా అలాంటి సంఘటన జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ తన రాజీనామా కోరారని, అయితే లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే తానే పదవి వదులుకుంటాని స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *