– యూరియా వాడకం తగ్గించాలి
– మెట్టపంటలపై దృష్టి
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రేగులచలక, కోయచెలక గ్రామాల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్‌రెడ్డి అని అభివర్ణించారు.
దేశమంతా పాదయాత్ర చేసి కులగణనకు ఆలోచన చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ చేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఉద్ఘాటించారు. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలనలో దేశమంతా రూ. 70 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు. ఇతర జిల్లాల వారు ఖమ్మంలో నివసించాలనే ఆలోచనలు వచ్చేలా ఖమ్మం నగరాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. అధికార పార్టీ వారు సర్పంచ్‌లు, ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా ఎన్నికైతే ప్రజలకు చేరువ కావొచ్చని మంత్రి చెప్పారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల ఉద్ఘాటించారు. రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని చెప్పారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామన్నారు. రైతుల పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు.
రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది రూ.36,000 కోట్లని వెల్లడించారు. విత్తనాల విషయంలో నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విషయంలో పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల విషయంలో షిప్ రాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. యూరియా తగ్గిస్తే మన పంటలకు ప్రపంచ మార్కెట్ లో విలువ పెరుగుతుందని అన్నారు. మెట్ట పంటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు, గతంలో ఇచ్చినట్లే ఇప్పుడు కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. తోటలు వేసిన రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చే యోచనలో ఉన్నామన్నారు. పెంచిన మద్దతు మొత్తం రూ.6,000. మునుపు రూ.5,000 ఇస్తే, ఇప్పుడు పెంచాం అని తెలిపారు.
పామాయిల్ ఉత్పత్తిపై ప్రాముఖ్యత పెరుగుతోంది. కొణిజర్లలో రిఫైనరీ, సీడ్ గార్డెన్ ఏర్పాటు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేనిదన్నారు. వచ్చే సీజన్‌కు వెంసూర్, కొణిజర్ల ఫ్యాక్టరీలు సిద్ధం చేస్తాం అని వెల్లడించారు. తెలంగాణలో మినిమం గ్యారెంటీ ప్రైస్ ఉండాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ఒత్తిడి తీసుకురాగలమని భావిస్తున్నాం అని తెలిపారు. తెలంగాణ వరి ఉత్పత్తిలో టాప్ లో ఉందని గుర్తుచేశారు. కాళేశ్వరంపై ఈటల రాజేందర్ ఆరోపణలపై స్పందిస్తూ, కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు, కానీ అభివృద్ధి జరగాలని అన్నారు. అలాగే మార్కెట్ చైర్మన్ నియామకం ఎమ్మెల్యే పరిధిలో జరిగిందని పేర్కొన్నారు.





