దేశం వొకటే. కాని వుత్తరాది, దక్షిణాది రెండు. కాకపోతే వుత్తరాది పాదాల కింద దక్షిణాది వుండాలి, మ్యాప్‌లో వున్నట్టు! జెండా వొకటే. ఎగరేసే జెండా. ఎగరాల్సిన జెండా. ముచ్చటైన మూడు రంగులు. కలిపితే మాత్రం కాషాయం రంగు రావాలి! పార్టీ వొకటే. నువ్వు యెవరికి వోటు వేసినా అధికారంలోవున్న పార్టీయే కమలంలా విరబూయాలి, పూయకపోతే ఎలక్షన్ కమీషన్ మీద వొట్టు! దైవం వొకటే.
దేవుళ్ళందరికీ శ్రీరాముడే రక్ష! మతం వొకటే. లౌకిక రాజ్యానికి హిందూత్వమొక్కటే యెజెండా! కులం వొకటే. కాదంటే చాతుర్వర్ణమే పరమ ధర్మం! భాషా వొక్కటే. రాజ భాష హిందీయే మెహందీ! భిన్నత్వంలో యేకత్వం పోయి చాలా రోజులయింది. ఏకత్వంలోని భిన్నత్వం బతికి బట్టకట్టాలి. ఈ యేకత్వం భాషనీ వదిలిపెట్టలేదు. ద్రావిడ భాషల మీదా పెత్తనమే. గుర్తించి ఆలోచనాంశం చేసిన ప్రరవే ‘ద్రావిడ సమాజ సాహిత్యాల’ దాకా చాస్తున్న చేతులతో చేయికలుపుతూ.
బమ్మిడి జగదీశ్వరరావు




