పల్లె సీమలే ప్రగతికి ఆలవాలం.సిరులు పొంగే గ్రామసీమలు దేశానికి జీవనాడులు.

అరమరికలు లేని కలుపుగోలుతనం గ్రామ సీమల స్వంతం. అయితే గ్రామ సీమల్లో గుభాళించిన ఒకప్పటి మాధుర్యం క్రమేపీ తగ్గుముఖం పట్టి, నాడు విరిసిన ఆత్మీయతలు ఆవిరై గత చరిత్రలా మిగిలిపోవడం బాధాకరం. ఇబ్బడి ముబ్బడిగా జనజీవితాల్లో వెల్లువెత్తుతున్న సాంకేతిక సాధనాలు, ముఖ్యంగా చరవాణి గ్రామవాసులను కట్టడి చేసి, కేవలం నాలుగు గోడల మధ్య బంధించింది. గ్రామాల్లో నివసించడం నామోషీగా భావిస్తున్న పల్లె యువత నగరాల వైపు పయనమైపోతున్నారు. ఆర్ధికంగాను,ఉద్యోగ పరంగాను విదేశాల్లో స్థిరపడ్డవారు స్వదేశానికి రావడం తగ్గించేసారు. తల్లి దండ్రులను పల్లెల్లో ఒంటరిగా వదిలేసి,విదేశాల్లో స్థిరపడడం వలన పెద్దల వృద్దాప్యం దుంఖసాగరంలో మునిగి పోతున్నది. ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడ బెట్టుకున్నా, చేసే దిక్కూ మొక్కూ లేక అవసాన దశలో అసహాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పల్లెల్లో నిర్మించుకున్న పెద్ద పెద్ద భవంతులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఒంటరిగా జీవిస్తూ, చనిపోయినా బాహ్య ప్రపంచానికి తెలియని దుర్ధినాలు దాపురిస్తున్నాయి. నగరాలకు వలస పోయి, పల్లె సీమలను నిర్లక్ష్యం చేయడం, పల్లెల్లో జీవించడం నామోషీగా భావించడం వర్తమానం లో జరుగుతున్న అపసవ్య పరివర్తనకు అద్దం పడుతున్నది.
నగరాల్లో జీవిస్తున్నా పల్లెల గొప్పదనాన్ని విస్మరించరాదు. పచ్చని పైర్లతో,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ, అలరించే ప్రకృతి పల్లెల స్వంతం.పల్లెలే ప్రగతికి సోపానాలు.సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిన తరుణంలో పల్లెలన్నీ నగరీకరణ, ప్రపంచీకరణ పేరుతో కట్టలు తెంచుకుని పరుగులు పెడుతున్న నేపథ్యంలో మానవుల మధ్య సంబంధాలు కూడా అంతే వేగంతో దిగజారిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి, స్వేచ్ఛ పేరుతో, ప్రైవసీ పేరుతో న్యూక్లియర్ కుటుంబాలు ఆవిర్భవిస్తున్నాయి.
పల్లెలన్నీ నాగరికత పేరుతో నగర వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే పల్లె వాతావరణం గతకాలపు వైభవంగా చరిత్రలో కలిసిపోయింది. పల్లె జనం తమ అస్థిత్వాన్ని విడనాడి,నగరాలవైపు వలస పోతున్నది. గ్రామాలంటే కంటగింపుగా మారాయి.కృత్రిమ వాతావరణంలో, కాంక్రీటు అరణ్యాలలో అధునాతన కట్టడాలలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న నేటి పోకడలను చూస్తుంటే భయమేస్తుంది.జనసంద్రంలా మారిన నగర వాతావరణం లో ఇమడలేని జనం కూడా ఒకప్పటి పల్లె వాతావరణాన్ని గుర్తుచేసుకునేలా శుభకార్యాలు,పర్వదినాల పేరుతోనో,మార్నింగ్ వాకింగ్ ల పేరుతోనో పార్కుల్లో నలుగురితో కలిసిపోయి ఆత్మీయంగా పలకరించుకుంటూ,చక్కని సంబంధాలను నెలకొల్పుకుంటున్నారు.విదేశాల్ లో ఉండే భారతీయులు కూడా అలనాటి భారతీయ సంస్కృతిని,కలుపుగోలు తనాన్ని గుర్తు చేసుకుంటూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం గమనార్హం. మరి పల్లెలేమో నాగరికత మోజుతో విలువలను విధ్వంసం చేసుకుంటున్నాయి. పల్లెలను వీడి,పల్లెల్లో పనిచేయడం మాని, నగరాల వైపు పరుగుతీయడం బాధాకరం.దేశంలో జనాభా పెరుగుతున్నది, పెరిగిన జనాభాతో పాటుగా,పోటాపోటీగా అవసరాలు కూడా పెరుగుతున్నాయి.
అవసరాలకు తగ్గట్టుగా వనరుల కల్పన కూడా కష్టతరమౌతున్నది.విద్యావకాశాలు మెరుగుపడ్డాయి.కాని విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి. చదువుకున్న యువతకు చదువుకు తగ్గరీతిలో ఉపాధి అవకాశాలు కలగడం లేదు.నిరుద్యోగ యువత ఉద్యోగవేటలో పడి,నగరాల్లో తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నది. మురికి వాడలు పెరిగిపోయాయి.నగర వాసులు చాలీ చాలని సంపాదనతో రేయింబవళ్లు శ్రమచేస్తూ,భారమైన బ్రతుకులతో బయటకు చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు.హాయిగా, ఉండే పల్లెల్లో పనులు చేయడం నామోషీగా భావించడం వలనే ఇలాంటి అస్థవ్యస్థ పరిస్థితులు దాపురిస్తున్నాయి.ఇంటిపని,వంట పని చేయడం అవమానంగా భావించే యువత తయారైంది. చదువులంటే సంస్కారానికి కాకుండా విలాసాలకు, అలంకారాలకు నిలయంగా భ్రమించే యువత తయారైంది. పల్లెటూర్లలో హాయిగా పనిచేసుకునే వారిని, నాగరికత పేరుతో నగరాలకు వలస పంపిస్తూ తమ పిల్లలు సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారని నలుగురిలో గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి ధోరణుల వలనే పల్లె యువత నగరాలకు పయనమై దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా నెట్టుకొస్తున్నది. కొంతమంది విదేశాల్లో అడ్డమైన చాకిరీ చేస్తూ,అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడ వంట చేయడం,అంట్లు తోమడం అప్రతిష్ఠగా భావిస్తున్న వారంతా విదేశాల్లో అలాంటి పనులే చేస్తూ, లేనిపోని డాంభికాలకు పోవడం విడ్డూరం.
గ్రామీణ ప్రాంతాల్లో బ్రతికే ప్రజలను చులకనగా చూసే పద్దతి మారాలి. నగరాల్లో జీవించే వారంతా ఒకప్పుడు పల్లెటూళ్ళలోనే బ్రతికే వారని,వారి తల్లిదండ్రులుగాని, ఇతర పూర్వీకులుగాని పల్లె వాతావరణం నుంచి వచ్చినవారనే స్ఫృహ కలగాలి. మహామహులుగా భారత చరిత్రలో సుస్థిరం స్థానం సంపాదించిన వారిలో అత్యధికులు పల్లెల నుంచే తమ ప్రస్థానం కొనసాగించారన్న సంగతి మరువరాదు.యువత ధోరణిలో కూడా మార్పు రావాలి. పెరుగుతున్న దేశ జనాభాతో పాటుగా నగరాలు పెరగవు. అందరికీ సరిపడా ఉద్యోగాలు నగరాలు కల్పించలేవు. అరకొరజీతాలతో పెరిగిన ఖర్చులతో చిన్నాభిన్నమౌతున్న యువత పల్లెల్లో బ్రతికే తల్లిదండ్రులపై ఆధారపడడం,వారి అవసరాలకు తిండిగింజలను సైతం ఇక్కడనుంచి తామే పంపించడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి దారుణ పరిస్థితుల మధ్య ఇంకా నగరాలవైపు పరుగెత్తడం మానుకోవాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో యువతకు తగిన హితబోధ చేయాలి. పల్లెల్లో జీవించడానికి నాణ్యమైన అన్ని సదుపాయాలు నెలకొల్పాలి. అన్ని వృత్తులను పునరుద్దరించాలి. ఇతోధిక ప్రోత్సాహకాలు అందించాలి. చదువుకున్న వారంతా ఇంజనీర్లు,డాక్టర్లుగా మారిపోవాలన్న ధోరణి మారాలి. నాగరికత పేరుతో విలాసాల పేరుతో, తల్లిదండ్రుల ఆస్తులను అమ్మించి, భ్రమల్లో బ్రతికే విద్యావంతుల వైఖరి మారాలి. పచ్చని ప్రకృతితో శోభిల్లుతూ, అరమరికలు లేని ఆత్మీయ బంధాలతో తులతూగే అలనాటి పల్లెవాతావరణాన్ని పునరుజ్జీవింప చేయాలి.నగర వాతావరణానికి అలవాటు పడిన యువతను పల్లెలబాట మళ్లించాలి. ఆనాడే నిజమైన దేశ ప్రగతి జరుగుతుంది. గ్రామ సీమల సౌభాగ్యమే దేశ పురోగతికి మూలం.