గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి
కార్మిక, కర్షకులను మరిచిన మోదీ
-సిఐటియు రాష్ట్రకమిటీ సభ్యులు కే.రాజయ్య
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 19: జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు. మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో జూలై 9న జరపతలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకొని గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక , ఉద్యోగ , వివిధ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికుల సమ్మె చేస్తున్నారని, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ బంద్ కు పిలుపునిచ్చాయని, కార్మికులు, రైతు కూలీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ ఒక్కరి సమస్యలు కూడా మోదీ ప్రభుత్వం పరిష్కరించడం లేదని, ఈ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేకి అని విమర్శించారు. మోదీ విధానాలపై కార్మికులు తిరగబడాలని అన్నారు. నాలుగు లేబర్ కోడ్ ల రద్దు కోసం పోరాడాలన్నారు. వీటిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రామికుల శ్రమను దోచుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి మోదీ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని చూస్తున్నారని, లేబర్ కోడ్ లో అమల్లోకి వస్తే 95% మంది కార్మిక వర్గం వెట్టి చాకిరిలోకి నెట్టబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ లేబర్ కోడ్స్ లో పొందుపరిచారని ఆరోపించారు.



