– తెలంగాణ విద్యావంతుల వేదిక ఆరోపణ
– సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలి
– ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్
నల్గొండ, ప్రజాతంత్ర, మే 22: సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావును ఒరిస్సాలో అరెస్ట్ చేసి ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేశారని, వెంటనే దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా బాధ్యులు సిహెచ్ సుధాకర్ రెడ్డి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నల్గొండ కేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్ లో నల్లజెండాలతో గురువారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుటకపు హత్యలు చేసి చంపిన 28 మందిలో ఆదివాసీ ప్రజలు, మావోయిస్టు పార్టీ సభ్యులు, నాయకులు ఉన్నారన్నారు. బుధవారం సాయంత్రం మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయుదుడిగా పట్టుకొని కాల్చి చంపి ఎన్‌కౌంటర్ అని కట్టుకథలు అల్లుతున్నారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరుపకుండా కేంద్ర బలగాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైనది కాదని అన్నారు. స్వదేశీ పౌరులను పట్టుకొని కాల్చి చంపమని ఏ రాజ్యాంగంలో ఉందో ఈ దేశ ప్రధానమంత్రి హోం మంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల బాధ్యులు గూడూరు జానకిరామ్ రెడ్డి, కోమటిరెడ్డి అనంతరెడ్డి గద్దపాటి సురేందర్ గోలి సైదులు అయితగోని జనార్దన్ గౌడ్ సిహెచ్ దుర్గయ్య పి వై ఎల్ జిల్లా కార్యదర్శులు , బివి చారి, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు





