- ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు..
- ఎన్ని శక్తులు అడ్డుపడినా పూర్తి చేస్తాం
- హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకువెళతాం : ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్21: మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని.. ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. నదులను కబళిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజా ఆరోగ్యం పటిష్ఠ ఆర్ధికం పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి.
కానీ, శాపంగా మిగిలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం. ఈ తరానికే కాదు.. తరతరాలకు మేలు చేసే నిర్ణయం. ఈ నిర్ణయానికి అండగా నిలవాలి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం రేవంత్ ఓ పోస్ట్ చేశారు. కాగా.. మూసీ పరీవాహక ప్రాంతం మురికి కూపంగా మారి.. హైదరాబాదీలకు విష వాయువులు అందిస్తుందని, దుర్భరంగా మారిన వారి జీవన విధానం మార్చేందుకు మూసీని ప్రక్షాళన చేసి, పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మూసీ వెంట నరకం అనుభవిస్తోన్న పేదవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతాం..
రాబోయే రోజుల్లో యాదవులకు అత్యధికంగా సీట్లు ఇస్తామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు పెంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు. మూసీ కాలుష్యం వల్ల ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు అణుబాంబుతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరంగా ఉండాల్సిన మూసీ.. శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మూసీ పునరుజ్జీవంతోనే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా, సబర్మతి నదులను రూ.40 వేల కోట్లతో సుందరీకరణ చేసుకుంటే, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మూసీ పునరుజ్జీవం చేయొద్దా? అని ప్రశ్నించారు. ప్రధాని చేసిన పనిని మెచ్చుకుంటూ.. మూసీ ప్రక్షాళనపై నకిలీ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్‌ఎస్ అంటోందని, ఈ మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టి.. రూ.25 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.