దాడి లక్ష్యం రాజకీయ మార్పు కాదు: హెగ్‌సెత్ స్పష్టీకరణ
అతి ప్రమాదకర దాడులగా ఇరాన్ ఖండన
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఇరాన్‌పై చేసిన దాడులు రాజకీయపరమైన మార్పు కోసం కాదని, ఇరాన్ అణు కార్యక్రమం నుంచి ఉద్భవిస్తున్న ముప్పును ఎదుర్కొనే ఉద్దేశంతోనే జరిపినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ పేర్కొన్నారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ 22వ ఛైర్మన్, దేశంలో అత్యున్నత స్థాయి సైనిక అధికారి, అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శి, జాతీయ భద్రతా మండలికి ప్రధాన సైనిక సలహాదారు జనరల్ డాన్ కెయిన్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్ఇ, స్ఫహాన్‌లో ఉన్న అణు సౌకర్యాలు శనివారం రాత్రి జరిగిన విస్తృతమైన దాడిలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే నష్టం స్థాయిని పూర్తిగా అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ఈ మిషన్ రాజ్యాన్ని మార్చాలన్న ఉద్దేశంతో కాదు.. ఇరాన్ అణు కార్యక్రమం వల్ల వచ్చే ముప్పును ఎదుర్కొనే ఉద్దేశంతోనే జరిగిందని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకారం తీయవద్దని టెహ్రాన్‌ను హెచ్చరించిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్‌చీ స్పందించారు. “అమెరికా ఇరాన్ ప్రజలపై ఒక ప్రమాదకరమైన సైనిక దాడిని, దౌర్జన్యాన్ని ఎంచుకుంది.. ఇరాన్ తనను తాను రక్షించుకోవడానికి అన్ని విధాలైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంద”ని తెలిపారు.