పిఎఎసి ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ
స్పీకర్ నిర్ణయంపై మండిపడ్డ ఎంఎల్‌ఏ హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎసి చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్యని నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ శాసన సభ మొత్తంగా 3 ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది.
అన్ని కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పున సభ్యులు ఉండనున్నారు. కాగా ప్రతిపక్ష పార్టీ నేతకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వొస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీకి ఆ పదవి కట్టబెట్టడం హాస్యాస్పదమన్నారు. అయితే.. పీఏసీ పదవి కోసం బీఆర్‌ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికార పార్టీ నేతను పీఏసీ చైర్మన్‌గా నియమించిందని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం దారుణమని, పీఏసీ చైర్మన్ విషయంలో ప్రభుత్వ చర్య అప్రజాస్వామికమని, నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకునే రాహుల్ గాంధీ దీనిపై సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రంలో పీఏసీ చైర్మన్ పదవి ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలని హరీష్ రావు అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి వేముల, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామ్ రావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ నియామకం అయ్యారు.
సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్ల అభివృద్ధి
రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణ
సహకరించాలంటూ సిఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.. పదేళ్లుగా ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్‌లో పూర్తవుతుందన్నారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్‌తో పాటు లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయని లేఖలో వివరించారు.
ముందస్తు బెయిల్‌కు అధికారుల ప్రయత్నాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : అక్రమ నిర్మాణాల అనుమతులకు సంబంధించి పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఈ అక్రమ అనుమతుల వ్యవహారం వెలుగులోకి వొచ్చిన విషయం తెలిసిందే. హైడ్రా ఫిర్యాదు మేరకు అధికారులపై సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు కేసులు నమోదు చేశారు.





