కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్‌రావు పిలుపు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు (Harish rao )పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి.ఆరిఫ్, మరో 25 మంది సభ్యులు బీఆరఎస్ సీనియర్ నాయకుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలంటే సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా  ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియానే నేడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర యువతను తీవ్రంగా దగా చేసిందని, ఎన్నికలకు ముందు అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ లేదు.. కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు.. వారు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా బోగస్ అని తేలిపోయింది అని విమర్శించారు. యువతతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచకుండా, కోటిమంది మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇవ్వకుండా, రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రతి వర్గాన్నీ దారుణంగా మోసం చేసిందన్నారు.

ఈ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువత ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పటాన్‌చెరు ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
—-

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *