చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’
* చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం
* కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు
చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కొండమల్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… సాధారణంగా నవలలు రాజుల యుద్ధాల గురించి ఉంటాయి కానీ గిరిజనుల సామాజిక జీవన విధానాల నేపథ్యంలో రావడం గొప్ప విషయమన్నారు. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన మూడు పుస్తకాలను తానే ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కొండమల్లు పుస్తకం ద్వారా చెంచుల చరిత్ర, వారి సంస్కృతి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాశారని కొనియాడారు. వెంకటేశ్వర్లు రాసిన ‘మరణం అంచున’ పుస్తకం ఆవిష్కరణ కూడా తన చేతుల మీదుగానే జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు చెంచుల భూములపై హక్కులు కల్పించేలా సహకరించాలని కోరగా అప్పటి సీఎం కేసీఆర్‌ సహకారంతో ఆ ప్రాంతాంనికి చెందిన 1600 ఎకరాల చెంచుల భూములకు పోడు పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. వెంకటేశ్వర్లు తన పుస్తకాలతో చెంచుల అస్థిత్వాన్ని కాపాడేందుకు తన వంతు సహాయం, కృషి చేస్తున్నారని అభినందించారు. వెంకటేశ్వర్లు మరో పుస్తకం ‘పిట్ట వాలిన చెట్టు’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రతిబింబించేలా ఉందని అన్నారు. మిషన్‌ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా ప్రత్యేక రాష్ట్రంలో మన నీళ్లు మనకు వాపస్ వచ్చినట్లే.. పచ్చదనం పెరగడంతో పక్షులు కూడా చెట్లపైకి వాపస్ వచ్చినట్లుగా పుసక్త రచన చేయడం గొప్ప విషయమని తెలిపారు. కొండమల్లు పుస్తకానికి ముందుమాట రాసిన అట్టాడ అప్పలనాయుడు వ్యాఖ్యలు తనకు చాలా బాగా నచ్చాయని హరీష్‌ రావు అన్నారు. రచయితను పొగటమే కాకుండా పుస్తకంలో సమాజానికి ఉపయోగపడే అంశాలను ఎలా పొందుపరచాలో ఆయన చేసిన సూచనలు అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో కవి, రచయిత జూలూరి గౌరిశంకర్‌, సీనియర్‌ ఎడిటర్‌ వర్ధెల్లి మురళి, తెలంగాణ టుడే ఎడిటర్‌ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, టీయూడబ్ల్యూజే జనరల్‌ సెక్రెటరీ మారుతీసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *