– ఆలస్యంగా వొచ్చిన మార్కెటింగ్ శాఖ సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 22: వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) బిఆర్కె భవన్‌లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా, కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మార్కెటింగ్ డైరెక్టర్ కి ఆలస్యంగా వొచ్చిన సిబ్బంది మీద వెంటనే మెమో ఇచ్చి, సంజాయిషీ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ డైరెక్టర్ మొత్తం 53 మంది రెగ్యులర్ సిబ్బందిలో 16 మంది ఆలస్యంగా హాజరయ్యారని, 42 ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో 5గురు మాత్రమే ఆలస్యంగా హాజరయ్యారని, వారికి మెమో జారీ చేశామని తెలిపారు. దీనికి మంత్రి మార్కెటింగ్ డైరెక్టర్వెంకి టనే ఫేస్ రికగనైజేషన్ తో బయో మెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకపై ఆలస్యాన్ని వొచ్చిన అధికారులు మరియు అందుబాటులో లేని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ను ఆదేశించారు. ప్రతిరోజు సిబ్బంది హాజరు పట్టికను మంత్రి కార్యాలయానికి పంపాల్సిందిగా ఆదేశించారు.





