– కేంద్ర ప్రభుత్వ వాటా పథకాల పునరుద్ధరణ
– సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం
– మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలయ్యే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ, గరిష్ట స్థాయిలో రైతుల ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సెక్రటేరియట్ లో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ ఆహార భద్రతా పథకం కింద నాణ్యమైన పప్పుదినుసుల వంగడాలను, పొద్దుతిరుగుడు, కుసుమ వంగడాలను సబ్సిడీ మీద రైతులకుఅందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం గత పదేళ్లలో దాదాపు రూ.3వేల కోట్ల మేర నష్టపోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, దానికి తగ్గ రాష్ట్రవాటా నిధులు విడుదల చేసి రాష్ట్ర రైతుల ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని కృతనిశ్ఛయంతో వున్నారన్నారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పుదినుసులు, నూనె గింజల సాగును కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఈ యాసంగిలో రూ.2.68 కోట్ల సబ్సిడీతో 49,397 ఎకరాలకు సరిపడా 5825 క్వింటాళ్ల శనగ విత్తనాలు 14 జిల్లాలలో పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. గత వారం పంపిణీ చేసిన వేరుశనగతో పాటు, పొద్దుతిరుగుడు (83.78 క్వింటాళ్లు ) హైబ్రిడ్ విత్తనాలను 74 క్వింటాళ్ల కుసుమ విత్తనాలకు రూ.45.41 లక్షల వ్యయంతో సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2025-26 లో రూ.48.54 కోట్లతో జాతీయ ఆహార భద్రత పథకాన్ని అమలు చేస్తున్నామని, విత్తనాలతో పాటు ప్రదర్శన క్షేత్రాలు, విత్తనోత్పత్తి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. రైతువేదికల వద్ద రైతులని సమీకరించి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు, మరియు రైతులకు లబ్ది కలిగించే పూర్తి సమాచారాన్ని పక్కాగా అందించాల్సిన బాధ్యత డీఏఓ, ఏఓ, ఏఈఓలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన శాస్త్రవేతలను, వ్యవసాయ నిపుణలను ఆహ్వానించి రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు,మార్కెటింగ్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతునేస్తం కార్యక్రమానికి సంబంధించిన ముందస్తూ సమాచారం రైతులకు అందివ్వాలి అన్నారు. తదుపరి రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదిక లలో రైతులను పూర్తి స్థాయి లో హాజరయ్యే విదంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం అయినట్టు మంత్రి తెలిపారు. మొత్తం 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ వారు నోటిఫై చేశారని అన్నారు. సీసీఐ వారు తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని, దీంతో వారు అనుకూలమైన సమయం చూసుకొని వారి పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779 కు ఫోన్ చేసి తమ సందేహాలు లేదా ఫిర్యాదులను నివృత్తి చేసుకోవచ్చన్నారు. 24 గంటలలో వారి ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఉ: 07.00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఏఈఓ, సెక్రటరీ, సీసీఐ ప్రతినిధి, పోలీస్ అధికారి, రైతు ప్రతినిధితో కూడిన ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు, ఈ బృందాలు జిల్లా కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పర్యవేక్షిస్తాయన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ పంటను నిర్దిష్ట తేమ శాతం మరియు ఎఫ్ ఏ క్యూ ప్రమాణాలతో తెచ్చే విధంగా రైతులకు సూచించాలని అలాగే వర్షాల నేపథ్యంలో రైతులు తాము తెచ్చిన పంటలు తడవకుండా తగు చర్యలు తీసుకోవాలని, కావలసిన మోతాదులో టార్పాలిన్స్ అందుబాటులో ఉంచాలని ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మద్ధతు ధర ప్రకటించి మొక్కజొన్న పంటను కేంద్రం కొనకుండా వదిలేసిందని మంత్రిగారు కేంద్ర ప్రభుత్వన్ని విమర్శించారు. కాని రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను ఇప్పటికే కొనుగోలు చేస్తున్నదని మంత్రిగారు పేర్కొన్నారు. రాష్ట్రంలో 6,24,000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగయినట్టు, ఎకరానికి 18.50 క్వింటాళ్ల చొప్పున మొత్తం 11,55,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేశామన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 204 సెంటర్లు ప్రతిపాదించగా, ఇందులో 100 సెంటర్లు ప్రారంభమయినట్టు, ఇందులో 30 సెంటర్ల ద్వారా 220 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేశామన్నారు. మిగతా సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





