- అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తాం
- పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడి కేంద్రాలు దృష్టి సారించాలి
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వెల్లడించారు. మంగళవారం మల్హర్ మండలం, కొయ్యూరు గ్రామంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్‌ను, అంగన్వాడీ సూపర్‌వైజర్లకు ఈసిఐఎల్ సీఎస్ఆర్ నిధులతో ఎలక్ట్రిక్ స్కూటీలను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ అంబులెన్స్ అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.అనంతరం యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్‌వైజర్లకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ సిబ్బంది సేవలను మరింత మెరుగుపరచేందుకు అవకాశముందని పేర్కొన్నారు. జిల్లాలోని రెండు అంగన్వాడీ కేంద్రాల ప్రాజెక్టు పరిధిలోని సూపరవైజర్లకు స్కూటీలు అందజేస్తున్నట్లు తెలిపారు. మల్హర్ మండలానికి 5, భూపాలపల్లికి 15 స్కూటీలు అందిస్తున్నట్లు తెలిపారు. మల్హర్ మండల పరిధిలో 227 కేంద్రాలున్నాయని అన్ని కేంద్రాలను కవర్ చేయాలని సూచించారు.అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడి కేంద్రాల ప్రాధాన్యతను ఆయన వివరించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కాటారం మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కాటారం మండల కేంద్రంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు, అదేవిధంగా శ్రీపాద కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు, శ్రీ హర్షిత డిగ్రీ కళాశాల నుంచి సినిమా హాల్ వరకు రూ.10 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు, వివేకానంద పాఠశాల నుంచి అయ్యప్ప గుడి వరకు రూ. 5లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ పనులకు మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య, జిల్లా వైద్యశాఖ అధికారి మధుసూదన్ అధికారులు పాల్గొన్నారు.





