– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. మహిళా సంఘాల ద్వారా ఎన్నో రకాల వ్యాపారాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. మహిళా ప్రగతి సమాజ ప్రగతి అన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ ఆశయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నామన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించడం అభినందనీయమన్నారు. అవి కేవలం చారిత్రక ప్రదేశాలే కావు.. కష్టానికి, తెగింపునకు, పోరాటానికి కేంద్రాలని గుర్తుచేశారు.మిస్ వరల్డ్ పోటీలను 72 ఏళ్ల తర్వాత తెలంగాణ వేదికవ్వడం మార్పుకు సంకేతమన్నారు. అందమంటే టే బాహ్య సౌందర్యం కాదు. అందమంటే అంతర్గత శక్తి సామర్థ్యాలు, మేధస్సు, స్వేచ్ఛ భావన, స్థితప్రజ్ఞత అన్నారు. మహిళలు కోల్పోయిన ఆర్థిక స్వాత్రంత్యాన్ని, సాధికారతను తిరిగి సాధించేందుకు తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.సాధికారత అంటే విద్యకు, ఉపాధికి, ఆర్థిక శక్తికి, సమాన హక్కులకు అవకాశాలు కల్పించడమని వివరించారు. ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళల కలలు, నైపుణ్యం, కష్టపడే తత్వానికి కలబోతగా నిలుస్తోందన్నారు. ఇక్కడ లభించేది కేవలం వస్తువులే కాదు
మహిళా విజయాలకు, పరివర్తన గాధలకు చిరునామా అన్నారు. సుందరీమణులు, గ్రామీణ శ్రామిక మహిళలు సమానమే అని చాటి చెప్పేందుకు మిస్ వరల్డ్ పోటీకి దారులను ఇక్కడికి ఆహ్వానించామన్నారు. లోకల్ టు గ్లోబల్ అనే జీవన మంత్రాన్ని మీకు ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నామన్నారు. ఇది కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు. సామాజిక మార్పుకు ఇది ఒక సంకేతమన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, విద్యుత్ ప్లాంట్లు, పౌల్ట్రీ వ్యాపారము, బస్సు ఓనర్లు, మేనేజర్లు.. ఇలా 20 కి పైగా వ్యాపారాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. 46 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని వేల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా సమకూరుస్తున్నామన్నారు. మహిళలు తీసుకున్న లోన్లు పూర్తిస్థాయిలో తిరిగి చెల్లిస్తున్నారని గుర్తుచేశారు.ఇందిరా మహిళా శక్తి సాధికారతకు, సమ్మిళిత అభివృద్ధికి, సమానత్వానికి దిక్సూచిగా నిలుస్తోందన్నారు. సంపాదన, సాధికారత, సామాజిక మార్పు మాకు దారి దీపాలన్నారు. తెలంగాణ మహిళల స్ఫూర్తిని శక్తిని మీలో నింపుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాన్నారు.





