విజయవంతంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు

– లబ్దిదారులే నిర్మాణకర్తలు : మంత్రి పొంగులేటి
– ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పొంగులేటి పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతంగా అమలవుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచాం, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై బెంగుళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, చెల్లింపులు, లబ్దిదారుల ఎంపిక విధానం, ఒక్కో ఇంటికి యూనిట్‌ కాస్ట్‌ తదితర అంశాలపై ఖర్గే పొంగులేటిని అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల పథకాలలో కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాయని, కానీ తెలంగాణలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.5 లక్షలతో 400 చదరపు అడుగులు తగ్గకుండా ఇండ్లను లబ్దిదారుడే నిర్మించుకునేలా పధకాన్ని రూపొందించామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో గత పదేళ్లలో పేదలు ఆశించిన మేరకు ఇండ్ల నిర్మాణాలు జరగకపోవడంతో ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్‌ అధికంగా ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో ఈ ఏడాది రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4.50 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, లబ్దిదారుల ఎంపిక పూర్తికాగా 3.05 లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని పొంగులేటి తెలిపారు. రాజకీయాలకతీతంగా లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, పేదరికమే అర్హతగా ఇండ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అడవులను నమ్ముకొని జీవించే చెంచులకు సైతం తొలిసారిగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను ఇటీవల ఏర్పాటు చేశామని, వచ్చే ఫిర్యాదులపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు బాగుందని, ఇదేవిధంగా ముందుకు సాగాలని మంత్రి పొంగులేటిని ఖర్గే అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *