దోపిడీలో బీఆర్ఎస్ ని మించిన కాంగ్రెస్

  • 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే… అంతా డొల్ల అని తేలిపోయిందని కేంద హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) విమర్శించారు.  ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని తెలుస్తోంది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్ ను సాధనంగా ఉపయోగించుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆచరణకు ఏమాత్రం పొంతన లేని బడ్జెట్ ఇది. 6 గ్యారంటీలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పేర్కొన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వొచ్చాక చిత్తు కాగితంగా మార్చినట్లు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడైంది. మొత్తంగా బడ్జెట్ తీరును విశ్లేషిస్తే… అబద్దాలు…అంకెల గారడీ…6 గ్యారంటీలకు పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఓం భూం బుస్ అంటూ మాయ చేసేందుకే యత్నిస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు బడ్జెట్ లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం… అప్పుల వివరాలను కూడా బడ్జెట్ లో పొందుపరిచి ఒక్కో తెలంగాణ పౌరుడిపైనా, చివరకు పుట్టబోయే బిడ్డపైనా ఎంత అప్పు భారం ఉందో వాస్తవాలను వివరిస్తే బాగుండేది.మహిళలకు నెలనెలా రూ.2,500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ గత బడ్జెట్ లోనూ నయాపైసా కేటాయించలేదు. ఈ బడ్జెట్ లోనూ ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం దుర్మార్గం. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలనెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇచ్చే అంశంపై బడ్జెట్ లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు. ఇక విద్యా భరోసా ప్రస్తావనే లేదు. పెన్షన్ పెంపును ప్రస్తావించలేదని బండి సంజయ్ విమర్శించారు.

బడ్జెట్ కేటాయింపులకు, ఆచరణకు అసలు పొంతనే లేదు. గత(2024-25) ఆర్ధిక సంవత్సరంలో 2 లక్షల 91 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆచరణలోకి వొచ్చేసరికి రూ.2 లక్షల కోట్లు కూడా ఖర్చయిన దాఖలాల్లేవు. కోతలు కోయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ను మించిపోయింది. గతంలో దళిత బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం 2023లో రూ.17 వేల కోట్లకు పైగా కేటాయించినా….ఆచరణలో మాత్రం నయాపైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే దారిన నడుస్తోంది. గత బడ్జెట్ లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున నిర్మిస్తామని పేర్కొంటూ ఇందిరమ్మ ఇండ్ల కోసమే రూ.7,500 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చే సరికి నయా పైసా ఖర్చు చేయలేదన్నారు.

గత ఆర్ధిక సంవత్సరంలో వైద్య రంగం అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రుల్లో మందులిచ్చే పరిస్థితి లేదు. నేతన్నలను పూర్తిగా మరిచారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఊసు లేదు. ఉద్యోగుల డీఏలు, పెండింగ్ సమ్యలు, పీఆర్సీ ప్రస్తావనే లేదు.
కులగణన పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత విధించిన పార్టీ బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీ కులాల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. అంబేడ్కర్ అభయ హస్తం పేరుతో దళితులకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ… బడ్జెట్ లో కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేటు. బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బిల్స్ సహా మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ అన్నీ ఇగ ఎగవేసినట్లే కన్పిస్తోంది. తెలంగాణలో వైద్య, విద్యా రంగాల దుస్థితి దారుణంగా ఉంది. సర్కారీ దవాఖానల్లో సూది, మందులు, కాటన్ కూడా లేక అల్లాడుతుంటే నిధులు పెంచలేదు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారు. 20 లక్షల మందికి పైగా రైతులకు నేటికీ రుణమాఫీ కాలేదు. కోటి మంది రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్ధిక సాయం కోసం కేటాయింపులు లేవు. బడ్జెట్ తీరు తెన్నులను విశ్లేషిస్తే కాంగ్రెస పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పినట్లు కన్పిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.67 వేల కోట్ల అప్పు చేస్తే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల్లోనే రూ.1.58లక్షల కోట్లు అప్పు తీసుకువచ్చిందని బండి సంజయ్ ఆరోపించారు. అప్పులు చేయడంలో, ఆస్తుల అమ్మడంలో, రాష్ట్రాన్ని దివాలా తీయడంలో, ప్రజలపై భారం మోపడంలో, అబద్దాలను ప్రచారం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయినట్లు కన్పిస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *