కాజీపేట ఆర్‌ఎంయూలో మే 2026 నుంచి కోచ్‌ల ఉత్పత్తి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వివరించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 26 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మంగళవారం సమావేశమ య్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది. రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్తతరం మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెము) రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. 16 నుంచి 20 కోచ్‌లు ఉండే ఈ రైళ్లను తెలంగాణలోని కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడిరచారు. ఈ రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో, మరీ ముఖ్యంగా పండగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని స్పెష్టం చేశారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ ముందుకెళ్తోంది. మే 2026 నుంచి ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి ప్రారంభం కానుంది.





