- కొలిక్కిరాని ఎయిర్‌పోర్టు భూసేకరణ వివాదం
- ఎకరాకు రూ 2 నుంచి 3 కోట్లు రైతుల డిమాండ్
( ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, మండువ రవీందర్‌రావు )
Warangal : మామూనూరు భూ నిర్వాసితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) అభివృద్ధి పనులకు తీవ్ర ఆలస్యం ఏర్పడుతున్నది. అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కారుచౌకగా తీసుకుంటామంటే ఎట్టిపరిస్థితిలో అంగీకరించేది లేదంటున్నారు స్థానిక రైతులు. సంవత్సరానికి మూడురకాల వాణిజ్య పంటలు పండిస్తున్న తమ భూములకు కావాలనే ప్రభుత్వం తక్కువ విలువను కడుతున్నదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూముల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ లాభం లేకుండా పోయింది. నక్కలపల్లి, గుంటూరు పల్లె మధ్య నడిరోడ్డుపై శనివారం చేపట్టిన ధర్నా తో వారు మరోసారి ఆందోళన బాట పట్టారు. విమానాశ్రయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. అలా అని తాము అప్పగిస్తున్న భూమికి న్యాయం చేయని పక్షంలో భూములను ఇచ్చే ప్రసక్తేలేదని వారు ఖరాకండీగా చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందూ తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఒకే ఒక కమర్షియల్ విమానాశ్రయముంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అరడజన్ విమానాశ్రయాలుండగా తెలంగాణలో హైదరాబాద్‌కు సుదూరంలో శంషాబాద్ ఏయిర్‌పోర్టు (Shanshabad Airport) ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చేసిన అనేక విజ్ఞప్తులమేరకు ఎట్టకేలకు ఉడాన్ (ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్) పథకం కింద 2017 ఏప్రిల్ 27న అనుమతి లభించింది. వాస్తవంగా నిజామ్ ప్రభుత్వం మామునూరు విమానాశ్రయాన్ని నిర్మించినప్పుడు దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించినట్లు తెలుస్తున్నది. స్వాతంత్య్రానంతరం ఈ ఎయిర్‌పోర్టు పెద్దగా ఉపయోగంలో లేకపోవడంతో దాని స్థలాలను వివిధ ప్రభుత్వ సంస్థలకు ధారాదత్తం చేశారు. ఫలితంగా ఇప్పుడు 696.14 ఎకరాల స్థలాన్ని మాత్రమే విమానాశ్రయం కలిగి ఉంది. ఉడాన్ పథకం కింద ఎప్పుడైతే దీన్ని అభివృద్ధి పర్చాలనుకున్నారో దానికి మళ్ళీ స్థలం కొరత ఏర్పడింది. ఇక్కడ విమానాశ్రయాన్ని పునరుద్దరించాలంటే కనీసం 950 ఎకరాల స్థలం ఉండాలని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నమాట. దీంతో కనీసం 253 ఎకరాలను సేకరించే పనిని ప్రభుత్వం చేపట్టింది.
అందుకు రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం 205 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ భూ సేకరణ విషయంలో తీవ్ర ఆలస్యం జరుగుతూనే ఉంది. మామునూరు విమానాశ్రయాన్ని అనుకుని ఉన్న మామునూరు, నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల నుండి ఈ భూమిని సేకరించే విషయంలో రైతులు, స్థానికులతో ప్రభుత్వ అధికారులు, నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే మంచి పంటలు పండే సారవంతమైన భూమికి రేటు నిర్ధారణ చేసే విషయంలోనే ప్రభుత్వానికి, రైతులకు పొంతన కుదరటం లేదు. ఆంధ్ర ప్రాంతాలనుండి దాదాపు 140 ఏళ్ళ కింద ఇక్కడికొచ్చి, భూమి కొనుగోలుచేసి కష్టపడి పంటలు పండించుకుంటున్న తామిప్పుడు భూమిని మాత్రమేకాదు, బతుకుదెరువు కూడా కోల్పోతున్న క్రమంలో తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. నాలుగు తరాలుగా ఈ భూములే జీవనోపాదిగా జీవిస్తున్నామంటున్నారు. ప్రధానంగా గుంటూరుపల్లె వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్న తమ భూమి విలువ తగ్గించడాన్ని వారు ఏమాత్రం అంగీకరించడంలేదు.
తెలంగాణలో హైదరాబాద్ (Hyderabad) తర్వాత అతిపెద్ద పట్టణంగా విస్తరిస్తున్న వరంగల్ విమానాశ్రయాన్ని ఇంటర్ నేషనల్ స్టాండర్‌గా అభివృద్ది పర్చాలనుకుంటున్నారు. అందుకు ప్రస్తుతమున్న రన్‌వేను మరింత పొడించాలనుకుంటున్నారు. అయితే రన్‌వేకు అతిసమీపంలో ఉన్న భూమి గుంటూరుపల్లెవాసులదే కావడంవల్ల వారు ధర విషయంలో మరింతగా పట్టుపడుతున్నారు. ఎప్పటికైనా ఈ ఎయిర్‌పోర్టును వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ భూములను కొనాల్సి వొస్తుందన్న దూరదృష్టితోనే ప్రభుత్వం ఇక్కడి భూముల రిజిస్ట్రేషన్ వ్యాల్యూను పెంచకుండా నిరోదిస్తూ వొచ్చిందని, ఇప్పుడు పెంచని రిజిస్ట్రేషన్ వ్యాల్యూను చూపించి తమ భూములకు పెద్దగా ధర లేదని చెప్పేప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. పలు దఫాల చర్చల అనంతరం జిల్లా యంత్రాంగం ఎకరానికి కోటి ఇరవై లక్షల చొప్పున ఇవ్వడానికి అంగీరించడంతో కొందరు తమ భూములను ఇవ్వడానికి ముందుకు వొచ్చినప్పటికీ, మరికొందరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం రెండు నుండి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనంటున్నారు. అప్పటివరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నాచేస్తామంటున్నారు. మొత్తానికి భూసేకరణ విషయంలో జరుగుతున్న ఆలస్యం , విమానాశ్రయ అభివృద్ది పనులకు ఆటంకంగా మారుతోంది. మామునూరులో విమానం ఎక్కేది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరంగల్ ప్రజలకు ఆకాశయానం దూరమే అవుతున్నది.





