పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 4న ఏర్పాటు చేస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. ఖర్గే పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు రోహిన్‌రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకల్లా రాష్ట్రంలోని పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా కమిటీల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికి మరొకరు సమాచారం చేరవేసుకొని సమన్వయంతో సభకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి మొదటి అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు ఏఐసీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.





