మున్సిపల్ ఎన్నికల్లో మ‌న అభ్యర్థులు గెల‌వాలి

– అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
– కాంగ్రెస్ శ్రేణుల‌కు పిలుపు
– మీడియా స‌మావేశంలో భ‌ట్టి విక్ర‌మార్క‌
– దివ్యాంగుల‌ను ముందుకు న‌డిపించాలి
– వారికి ట్రైసైకిళ్లు పంపిణీ

మధిర, ప్రజాతంత్ర, జనవరి 27: పార్టీని ఉమ్మడి కుటుంబంలా భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మధిరలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రకరకాల ప్రణాళికలతో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో మహిళలకు రూ.6000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని, హైదరాబాద్ నగరానికి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీని రూపొందించామని, హైదరాబాద్ బయట మున్సిపాలిటీల పరిధిలో అనేక క్లస్టర్లుగా విభజన చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని వివరించారు. రేర్ (రూరల్ అగ్రి రీజనల్ ఎకానమీ) ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి మున్సిపాలిటీల సమీపంలోని గ్రామాల్లో ఉపాధి, ఆదాయం పొందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం చూసి అలసిపోయిన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేశామని, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా 1.03 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ వినియోగదారుల తరఫున విద్యుత్ శాఖకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, హైదరాబాద్ నగరంలోనే కాÅ£ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అడ్వాన్స్‌డ: టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి విద్యను పేద, బడుగు, బలహీన వర్గాలకు అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు.

దివ్యాంగుల కోసం 100 కోట్లు ఖర్చు చేశాం

గత ప్రభుత్వం పదేళ్లలో దివ్యాంగులకు చేయలేనటువంటి పనులను ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, వారి కోసం రూ.100 కోట్లని ప్రభుత్వం ఖర్చు చేసిందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గ కేంద్రంలో ఆయన దివ్యాంగులకు మంగళవారం ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు. చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజల గురించి ఆలోచన చేసే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో దివ్యాంగులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని, వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. దురదృష్టవశాత్తు వైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతోపాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ వారు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సమాజంలో ఇతరులకన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని, ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందని వివరించారు. అలాగే మధిరలో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *