– ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
– మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది
– హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాము
– ఇందిరమ్మ ఇండ్లు, రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం
సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 18: హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధిని ప్రజాపాలన ప్రభుత్వంలో రెండేళ్లలో చేసి చూపించామన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండో విడతగా అర్హులైన 372 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయన ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన 171 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి కావస్తున్నాయన్నారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. అర్హులై ఉండి ఇంకా ఇల్లు రాని వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా 3,520మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.1.13 కోట్ల వడ్డీలేని రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా 57మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.50 వేల వరకు బ్యాంకు రుణ సదుపాయం ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కూడా కుట్టు మిషన్లు అందించేలా కార్యాచరణ చేపడతామని వెల్లడిరచారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఉపాధి అవకాశాల పెంపు కోసం సెట్విన్ ద్వారా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, యువత దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనుల జోరు
నియోజకవర్గంలో 250 పడకల ప్రభుత్వ హాస్పిటల్, పీజీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అర్బన్ ఫారెస్ట్ పార్క్, కోహెడ మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. హుస్నాబాద్‌ను ఉపాధి కేంద్రంగా మార్చేందుకు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్‌కు రింగ్ రోడ్డు మంజూరు కోసం ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పట్టణంలో నీటి పన్ను, ఇంటి పన్ను సమస్యలపై సమీక్ష నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు కేటాయిస్తామని, స్థానిక, రాష్ట్రస్థాయి సర్వేల ఆధారంగా పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వార్డుల్లో విస్తృతంగా తిరగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, డీఆర్‌డీవో జయదేవ్ ఆర్య, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





