- మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి వెంటనే డిశ్చార్జ్
- శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో నూతన పరికరం, ఇద్దరికి విజయవంతంగా చికిత్స
- ప్రముఖ యూరాలజిస్ట్ రాంప్రసాద్ రెడ్డి వెల్లడి
హన్మకొండ, ప్రజాతంత్ర,మార్చి 22 : పురుషులు ప్రోస్ట్రేట్ గ్రంధి (Prostate Gland) పెరిగి మూత్ర సంబంద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడితే తాత్కాలిక ఉప శమనమే . చివరకు గ్రంధికి ఆపరేషన్ చేసి ఇప్పటి వరకు చికిత్స చేస్తున్నారు. దీని వల్ల పురుషులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఆపరేషన్ విధానానికి ఇక తెర పడింది. ప్రోస్ట్రేట్ గ్రంధి చికిత్స కు ఆధునిక పరికరం, చికిత్స విధానం వరంగల్ లో అందుబాటులో కి వచ్చింది. కేవలం మూడు నిమిషాల్లో ప్రోస్ట్రేట్ గ్రంధి శస్త్ర చికిత్స చేసి రోగులను డిశ్చార్జ్ చేసే విధానం అందుబాటులోకి వచ్చింది.
హన్మకొండ(Hanmakonda) లోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ (Srinivasa Kidney Center )లో కోటి రూపాయల విలువ చేసే నూతన పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరికరంతో ప్రోస్ట్రేట్ గ్రంధి వాపుతో వచ్చిన ఇద్దరు వృద్ధ రోగులకు అత్యాధునిక పద్ధతిలో చికిత్స ను విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీనివాస కిడ్నీ సెంటర్ డైరెక్టర్, సీనియర్ యూరాలజిస్ట్ ఎ.రాంప్రసాద్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ నెల 21న వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాసు, ఖమ్మం జిల్లాకు చెందిన మోతిలాల్ ఇద్దరూ 70 సంవత్సరాల వయసు గల వృద్ధులు తమ ఆసుపత్రికి వచ్చారన్నారు. వారికి పరీక్షలు నిర్వహించి ప్రోస్ట్రేట్ గ్రంధి వాపు ఉందని నిర్ధారించడం జరిగిందన్నారు. ఈ వ్యాధి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులలో అత్యధికంగా వస్తుందన్నారు. ప్రోస్టేట్ గ్రంధి వ్యాధి వలన మూత్రపిండాలలో మూత్రము రాక నిల్వ ఉండడంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారన్నారు. వీరికి వెంటనే పరీక్షలు నిర్వహించి ప్రోస్టేట్ గ్రంధి వాపు వచ్చినట్లు గ్రహించి అదే రోజు “రెసుమ్ అనే విధానంతో రోస్ట్ రైడ్” కు శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు.
అధునాతనమైన పరికరాలతో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. రోగుల స్థితిగతులను గ్రహించి అదే రోజు డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులోని రెండు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ తరహా శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారని తెలిపారు. కోటి రూపాయల విలువ చేసే పరికరంతో కేవలం మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స చేసి రోగులను డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఈ చికిత్స కు ఎలాంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చికిత్స పొందిన ఇద్దరు వృద్ధ పేషెంట్లు మేము ఎన్నో ఆసుపత్రులు తిరిగాము కానీ ఇక్కడికి రాగానే శాస్త్ర చికిత్స చేయడం మాకెంతో మేలు జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ శస్త్ర చికిత్సలో తనతోపాటు డాక్టర్ ప్రభు రామ్, డాక్టర్ సామ్రాట్ పాల్గొన్నట్లు డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.



