అధ్యక్ష పదవిపై ఆశ‌ల ప‌ల్ల‌కీలో నేత‌లు

ఇప్పటికే స్క్రీనింగ్‌ అయిందంటున్న బిజెపి వర్గాలు
సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతలు పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తతంగం పూర్తయినప్పటి నుంచి ఈ పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సమర్ధుడైన నాయకుడికే ఈ పదవిని కట్టబెట్టాలని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోంది. దక్షిణాదిలో పార్టీని పటిష్టం చేయడంతోపాటు, రాష్ట్రంలో అధికారం చేపట్టే సంకల్పంగా చాలా కాలంగా బిజెపి పావులు కదుపుతున్నది. వాస్తవానికి గత సంవత్సరమే తెలంగాణలో అధికారంలోకి వొస్తామని కలలు కన్నప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. భవిష్యత్‌ ఎన్నికల నాటికైనా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతోపాటు, సమర్థవంతమైన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నది. గత ఎన్నిక‌కు ముందు వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్‌ని అకస్మాత్తుగా ఆ పదవి నుంచి పార్టీ త‌ప్పించింది. ఒక విధంగా రాష్ట్రంలో నిద్రాణంలో ఉన్న బిజెపిని బండి సంజయ్‌ ‌పరుగులు పెట్టించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ అధిష్టానం సరిగ్గా ఎన్నికలకు ముందే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి గతంలో అధ్యక్షుడిగా కొనసాగిన జి.కిషన్‌రెడ్డికి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించింది. ఈ సంఘటన పార్టీ శ్రేణులతోపాటు, ఇతర రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది.

పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజల్లో బిజెపిపై ఆశలు చిగురింపజేయడంలో బండి సంజయ్‌కుమార్‌ ‌శక్తిమేర కృషి చేశారు. బండి సంజయ్‌లాగా దూకుడు లేకపోయినా సౌమ్యుడిగా పేరున్న కిషన్‌రెడ్డి సారధ్యంలో బిజెపి అసెంబ్లీలో మెజార్టీ స్థానాలను సాధించుకోలేకపోయింది. శాసనసభలో ఆపార్టీ ఎంఎల్‌ఏలు ముగ్గురికే పరిమితం కాగా, లోక్‌సభలో మాత్రం అనూహ్యంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. విచిత్రమేమంటే ఈ ఎన్నికల్లో కిషన్‌రెడ్డితోపాటు, బండి సంజయ్‌కూడా పార్లమెంటుకు ఎన్నిక కాగా, వీరిద్దరిని ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్‌లోకి తీసుకోవడం. దీంతో పార్టీ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో చూసుకునే వారికోసం ఇప్పుడు అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ఈ పదవిని అలంకరించేందుకు పార్టీలోని పలువురు ఆశపడుతున్నారు. అయితే కొన్ని పేర్లు మాత్రమే బలంగా వినిపిస్తున్నాయి. వాటిల్లో రాష్ట్ర రాజకీయాల్లో తనకుంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న బండి సంజయ్‌ ‌పేరు కూడా ఒకటి కాగా, దానిపై ఆయన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి అభిప్రాయమేదీ లేదని, అనవసరంగా తనపేరున జరుగుతున్న ప్రచారం తనకు ఇబ్బందికరంగా మారుతుందని, ఇకముందు అలాంటి ప్రస్తావన తీసుకురావద్దని వినమ్రంగా వేడుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో ఫైర్‌ ‌బ్రాండ్‌గా పేరున్న ఇద్దరు ఎంపీలున్నారు. వీరిలో ఒకరు నిజామాబాద్‌ ఎం‌పి ధర్మపురి అరవింద్ కాగా, మహబూబ్‌నగర్‌ ఎం‌పి డి.కె. అరుణ. ఎలాంటి జంకు లేకుండా ఖచ్చితంగా మాట్లాడుతాడని పేరున్న అరవింద్‌, ‌గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు నిజామాబాద్‌కు పసుపు బోర్డును తీసుకువొచ్చి మాట నిలుపుకున్న వ్యక్తిగా పేరుంది. అధ్యక్ష పరుగు పందెంలో తానున్నానని చెబుతూనే, అంతా అధిష్ఠానం చూసుకుంటుందంటున్నారాయన. కాంగ్రెస్‌ ‌నుంచి బిజెపిలో చేరిన డికె అరుణ పేరు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నది. అయితే పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందరేశ్వరి కొనసాగుతున్న క్రమంలో తెలంగాణలో కూడా మరో మహిళకు ఆ బాధ్యతలను అప్పగిస్తారా అన్న చర్చకూడా జరుగుతున్నది. కానిపక్షంలో మెదక్‌ ఎం‌పి రఘునంథన్‌రావు లేదా మల్కాజిగిరి ఎంపి ఈటల  రాజేందర్‌లో ఒకరికి ఇచ్చే అవకాశాలున్నాయనుకుంటున్నారు.

వీరిద్దరు కూడా గతంలో బిఆర్‌ఎస్‌కు చెందినవారే. ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారు. కానీ, బిజెపిలో చేరిన తర్వాత వారి ప్రాబ‌ల్యం ఏమీ తగ్గలేదు. బిజెపిలో చేరిన తర్వాత రెండు సార్లు ఓటమి చవిచూసినా, మల్కాజిగిరి ఎంపి స్థానాన్ని కేటాయించడం ద్వారా ఈట‌ల రాజేందర్‌ ‌పట్ల బిజెపి ఆద‌రణ చూపించింది. ఉద్యమ కాలం నుంచి బిఆర్‌ఎస్‌లో పనిచేయడమే కాకుండా, ఆ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత మంత్రివర్గంలో ప్రముఖ స్థానాన్ని కైస‌వం చేసుకుంది.బిఆర్‌ఎస్‌లో కెసిఆర్‌ ‌తర్వాత వ్యక్తిగా, బిసి నేతగా గుర్తుంపు తెచ్చుకున్న ఈట‌లకు పార్టీ బాధ్యతలను అప్పగించవచ్చనుకుంటున్నారు. అలాగే మెదక్‌ ఎం‌పి మాధవనేని రఘునందన్‌రావు స్వతహాగా మంచి వాక్చాతుర్యం గల నేత‌గా పేరుంది. న్యాయవాదిగా ఆయన సమస్యల పట్ల పూర్తి అవగాహనతో మాట్లాడుతార‌ని చెబుతారు.

అధ్యక్ష పదవికి తానెందుకు అర్హుడినికాదని గతంలో ఆయన ప్రశ్నించిన విషయం తెలియంది కాదు. మొత్తం మీద ఈసారి అధ్యక్ష పదవి బిసి లేదా ఒసి వర్గాల్లో ఎవరిని వరిస్తుందన్నది ఇంకా డైలమాలోనే ఉంది. కాంగ్రెస్‌ ‌రాష్ట్ర అధ్యక్షపదవికి బిసి వ్యక్తిని ఎన్నుకోవడంతో బిజెపి కూడా బిసికే ప్రాధాన్యమిస్తుందా లేక కులాలతో సంబంధం లేకుండా అన్నివర్గాలను కలుపుకుపోతూ, రానున్న కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకువొచ్చే వ్యక్తి ఎవరికైనా బాధ్యలు అప్పగిస్తుందా అన్నది తేలాల్సిఉంది. ఇదిలా ఉంటే అధిష్ఠానం ఇప్పటికే ఈ విషయంలో ఒక నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తున్నది. పేర్లన్నిటినీ స్క్రూటినీ చేసి, ఇద్దరి పేర్లను మాత్రం ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. వారిలో ఆ ఒక్కరు ఎవరన్నది సంక్రాంతి తర్వాతనే అధిష్ఠానం ప్రకటించే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *