ఏడుపు!
కంటికిమంటికి యేకధార! ఎందరు నచ్చజెప్పినా లేదు, ఎందరు వోదార్చినా లేదు! ఆ పిల్ల దుఃఖం తీరేట్టులేదు, చూస్తుంటే కడుపులో దేవేస్తోంది!
‘కన్నా మీ అమ్మని చెపుతున్నాను విను, నిన్ను యెవ్వరూ యేమీ అనడం లేదు.’ తల్లి బుజ్జగించినా లేదు! ‘నాన్నా మీ నాన్నని చెపుతున్నాను విను, యిందులో నీ తప్పేమీలేదు, కొన్నిసార్లు అలా జరిగిపోతుంది అంతే.’ తండ్రి కళ్ళనీళ్ళు తిప్పుకున్నా లేదు!‘అక్కా నువ్వేడవకే, నువ్వు యేడిస్తే నాకూ యేడుపోస్తోంది.’ తమ్ముడు వెక్కివెక్కి యేడుస్తున్నాడు! ఆ పిల్ల యేడుపుకి యింట్లోవాళ్ళే కాదు, వీధిలోవాళ్ళూ చుట్టూ చేరారు!

‘ఏమయ్యింది?’ యిరుగమ్మ పొరుగమ్మని అడిగింది! ‘పదోతరగతి రిజల్స్‌ వచ్చాయి కదా.’ చెప్పకముందే అర్థం చేసేసుకున్నారు గుమికూడినవాళ్ళు! ‘నయం సూసైడ్‌ చేసుకోలేదు,’ అని గొంతు తగ్గించి వొకరు రిలీఫ్‌ ఫీలయితే, ‘యిప్పుడు యేడిస్తే యేమొస్తుంది? ముందే బుద్ధుండాలి.’ అని గొంతు పెంచి మరొకరు విసుక్కున్నారు! ‘మా చిన్నప్పుడు మోడ్రన్‌ మార్కులు వుండేవి, మూడో అయిదో.’ యెవరో గతాన్ని తలుచుకుంటే, ‘ఔనౌను గ్రేస్‌ మార్కులు వుండేవి,’ మరెవరో మాట కలిపారు!ఆ పిల్ల మోకాళ్ళలో తలపెట్టుకొని వుంది!

‘బాగుంది, యిప్పుడు ఆ పిల్లతో కేక్‌ కట్‌ చేయించాలా వాళ్ళ అమ్మాబాబూ?’ అన్నారొకరు! ‘వాడెవడో ఆరుకి ఆరు సబ్జెక్టులూ పోతే కేక్‌ కట్‌ చేయించా రుగా?’ పేపర్లో తానూ చదివానన్నట్టు అన్నారింకొకరు! ‘పిల్లల్లో నమ్మకం కలిగించాలంటే తప్పదు,’ అన్నారు మరొకరు! బెక్కుతున్న శబ్దం వినిపిస్తూవుంది! ‘ఎంతబాగా చదివినా పెళ్ళయితే చదువు చెట్టెక్కేస్తుందిలే.’ తన అనుభవాన్ని తలపోస్తూ అందో ఆవిడ! ‘వివాహం విద్య నాశనం. శోభనం సర్వనాశనం,’ మరో పెద్దావిడ యేదో ఆలోచిస్తున్నట్టుగా నిట్టూర్పు విడిచింది! ‘యిప్పుడు మార్కులే కాదు, సర్టిఫికెట్లు యెక్కడున్నాయో కూడా తెలీదు.’ యింకో నడీడు ఆవిడ అనుభవపూర్వకంగా అంది!

అప్పుడే పిల్ల తాలూకా మావయ్య వచ్చాడు! జనాన్ని అయోమయంగా చూశాడు! గుంపులోంచి వెళ్ళి ఆ పిల్లని కంగ్రాచ్యులేట్‌ చేశాడు! చేతులు పట్టుకు వూపేసి ముందుగా పిల్ల నోట్లో స్వీట్‌ పెట్టాక అందరికీ పంచాడు! అక్కడున్న అందరూ నోళ్ళు తెరిచారు, స్వీట్‌ పెట్టుకోకుండానే! ‘ఆరొందలకి నాలుగు మార్కులు తక్కువ వచ్చాయి మావయ్యా…’ ఆ పిల్ల మళ్ళీ యేడుపందుకుంది!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *