– చోద్యం చూస్తున్న పోలీసులు.. పట్టించుకోని ప్రభుత్వం
– మజ్లిస్‌కు అంటకాగుతున్న కాంగ్రెస్
– ఓట్ల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా?
– పోలీసులను బెదిరించి అరెస్టయిన వారిని విడిపిస్తున్న ఎంఐఎం
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ప్రభుత్వం చేయాల్సిన పనులను గోరక్షకులు చేపడుతుంటే వారిని కాపాడాల్సిన పోలీసులు, పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు మిన్నకుండి పోవడమేంటని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాపై అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదన్నారు. ఈ చట్టాలను కాపాడాల్సిన పోలీసులు, ప్రభుత్వం వారితోనే అంటకాగుతూ.. వారిని కాపాడుతున్నారన్నారు. మాఫియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమ వధశాలల్లో పనిచేస్తున్నారు. పశువుల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి మజ్లిస్ పార్టీ నాయకులు అండదండలు ఇస్తున్నారన్నారు. ఇబ్రహీం ఖురేషీ అనే వ్యక్తి ఇలాంటి నేరాల్లో రాటు దేలాడు. అతనిపై అనేక ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఎంఐఎంతో, పార్టీ నేతలతో, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి పనిచేస్తున్నాడు. వారి ఫొటోలు ఎంఐఎం మద్దతుదారులే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గోవుల అక్రమ రవాణా చేస్తూ పట్టుపడితే పోలీసులు ఆ వాహనాలను ఆపితే పోలీసులతో గొడవ పెట్టుకుని అరెస్టు చేసిన వ్యక్తులను విడిపించే విషయంలో ఎంఐఎం సెల్ ఏర్పాటు చేసింది. బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, రమ్నాస్‌పురా కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్ పోలీసులను బెదిరిస్తూ, వాహనాలను, అరెస్టయిన వారిని విడిపిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు పశువుల అక్రమ రవాణా చేస్తున్నారు. తెలంగాణలో పోలీసుల సహాయ సహకారాలు, ఎంఐఎం కార్యకర్తలకు భయపడుతూ పశువుల అక్రమ రవాణా వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. పశువులకు మత్తు మందు ఇచ్చి తీవ్రంగా హింసిస్తూ తెలంగాణకు తరలిస్తున్నారన్నారు. నిర్మల్, భైంసాలో స్థానిక ప్రజల ఒత్తిడి మేరకు పోలీసులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారు. ఏపీ నుంచి కూడా రాత్రికి రాత్రి పశువులను సరిహద్దులు దాటించి తెలంగాణకు తీసుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు చర్యలు తీసుకుంటే పై అధికారులు ఒత్తిడి చేసి వారిని విడిపిస్తున్నారు. ఇలా జరగడం వల్లే ఘట్ కేసర్ లో ఈ ముఠా సభ్యులు గో సంరక్షకులపై కాల్పులు జరిపే వరకు బరి తెగించారన్నారు. ఖురేషీని గతంలో అరెస్టు చేస్తే.. ఇక్కడి పోలీసులు, ఎంఐఎం నేతల ఒత్తిడితో విడుదల చేస్తే.. బయటకు వచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు ఊరేగింపుగా ఇంటికి వచ్చిన సంగతిని గుర్తుచేశారు. మజ్లిస్, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా వీరితో అంటకాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ సలీమ్ కూడా పశువుల అక్రమ రవాణాలో కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. ఈ సలీమ్ కు ఖురేషీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ఆయన బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కారణంగా వేలాది గోవులు హత్యకు గురవుతున్నాయి. తెలంగాణకు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ నుంచి అక్రమంగా గోవులు, పశువులను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఖురేషీ వాడిన తుపాకీ కూడా చత్తీస్ గఢ్ నుంచి కొనుగోలు చేసిందేనన్నారు. పోలీసుల దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ మాఫియాలు ఇళ్లు, అటీ ప్రదేశాల్లో గో వధశాలలను నడుపుతున్నాయి. గోల్నాక, న్యూ బోయిగూడలోని వధశాలల్లో గోవుల వధను నిలిపేయాలి. ఇక్కడి నుంచి తీవ్రంగా కాలుష్యం జరుగుతోంది. గతంలో 39 అక్రమ వధ శాలలను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు. పశువుల అక్రమ వ్యాపారం చేస్తున్న ఇబ్రహీం ఖురేషీ లాంటి వారిని కాపాడుతూ ఎంఐఎంకు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఎంత వరకు సబబు? గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రస్ ప్రభుత్వాలు.. మజ్లిస్ పార్టీ చెప్పినట్టు ఆడుతున్నాయి. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న ఎంఐఎం రాజ్యాంగేతర శక్తిగా హైదరాబాద్ లో ఎదుగుతోంది. ఒకప్పుడు పాత బస్తీకే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు తెలంగాణ, దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. గతంలో మజ్లిస్ ను కేసీఆర్ పెంచి పోషించారు. అసదుద్దీన్ ఒవైసీతో కలిసి దేశమంతా తిరుగుతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించిన భూమిని ఖబ్రస్తాన్ కు కేటాయించారు. ఎర్రగడ్డలో కూడా ఇళ్ల మధ్య ఖబ్రస్థాన్‌కు అక్రమంగా ఇచ్చారు. బీఆర్ఎస్ గద్దె దిగగానే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పంచన చేరింది. ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మజ్లిస్ పార్టీకి అంటకాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరుతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. గతంలో ఓడిపోయిన వ్యక్తిని మంత్రిగా చేస్తున్నారు. ఎవరిని మెప్పించేందుకు ఇప్పుడు ఎన్నికల ముందు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. రెండేళ్లుగా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తురాలేదా అని ప్రశ్నించారు. ఒవైసీ, మజ్లిస్ పార్టీ నేతలు కనబడితే రెండు పార్టీలు వంగి వంగి దండాలు పెడుతున్నాయి. మజ్లిస్ పార్టీ అండ ఉంటే చాలు రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని చూస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జూబ్లీహిల్స్ ఓటరు అయిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వబోతున్నరనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో పాత బస్తీ ప్రజలకు చెప్పాలి. ఎవరి సూట్ కేసులకు ఆ పార్టీని అద్దెకు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ లో ప్రత్యర్థి పార్టీ నాయకులను పోలీసులు బెదిరించి అరెస్టులు చేస్తున్నారు. ఒక్కొక్క డివిజన్ కు మంత్రులను ఇన్ చార్జులుగా పెట్టి పరిపాలనను గాలికొదిలేసరన్నారు. సీబీఐ విచారణ జరుగుతున్న వ్యక్తిని, తీవ్రమైన కేసులున్న, దేశ గౌరవాన్ని మంటకలిపేలా వ్యవహరించిన వ్యక్తిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని గవర్నర్ కు సిఫారసు ఎలా చేస్తారు. సొంత పార్టీకి చెందిన నేతలు దొరక్క.. మజ్లిస్ పార్టీకి చెందిన డమ్మీ అభ్యర్థిని పోటీకి పెట్టిందే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థిపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా వుందని ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





