“కేసిఆర్ జీవితం ఒక పోరాటం. అనేక మహా మహులు, రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉద్యమాన్ని నడిపించే క్రమంలో నిష్క్రమించారు. కొందరు స్వప్రయోజనాల దృష్ట, మరికొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు అనేకం. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజికవర్గాలు. నాడు ఈ రెండు పార్టీలకు ధన బలంతో పాటు, ప్రసార మాధ్యమాలు తోడు ఉండడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షకు పూర్తిగా వాస్తవ విరుద్ధం.”
పిన్నింటి విజయ్ కుమార్,
కె యు బిఆర్ఎస్వి నేత, 9052039109.
శిఖరం ఒక ఉన్నతమైన స్థానాన్ని, స్థాయిని సూచిస్తుంది. తెలంగాణ ప్రాంత, ప్రాంతేతరుల చేత దగాపడిన ప్రాంతమని మనందరికీ విదితమే. అట్లాంటి మన ప్రాంతానికి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఎందరినో ఒప్పించి, మెప్పించి అసాధ్యం అనే భావనను చెరిపేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన మహాముని కేసిఆర్. ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రయాణంలో ఆ తర్వాత సుస్థిరాభివృద్ధి సాధనలో కేసిఆర్ నడవడిక, వ్యవహారిక మన ప్రజల దృష్టిలో ఎప్పటికీ శిఖరాగ్రంలోనే నిలబెడుతుంది. ఆయన మదిలో ఆలోచనల పరంపర మొదలైన కాడినుండి నేడు ఏడు పదుల వయసులోకి కూడా అనునిత్యం తెలంగాణ వాదం, మన పౌరుషం చాలా బలంగా కనపడుతది.
ఒకానొక స్థాయిలో తన ఆకలి, ఆలోచన, ఆవేదన, ఆక్రోశం, ఆశయం అన్నీ తెలంగాణగా బతికి… ఆఖరికి తన శ్వాసనే రాష్ట్రానికి అర్పించడానికి సిద్దపడ్డ ఓ పోరాట స్ఫూర్తి పతాక కేసీఆర్. తన అర్ధశతాబ్ద రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు పేరును తెచ్చిపెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది. కేసిఆర్ ఆలోచనల్లో ఎల్లప్పుడూ తెలంగాణ ఒక శిఖరమే. ఊహ తెలిసిన నాటి నుండే కేసిఆర్ అనే మూడక్షరాల పేరు, ఆయన రూపాన్ని తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా భావించి ఆయన వేసిన, చూపిన బాటలో నడుస్తూ గౌరవంతో వారి జన్మదినం సందర్భంగా నేనొక కరుడుగట్టిన కౌమార తెలంగాణవాదిగా అక్షర రూపాన్ని ఆవిష్కరిస్తున్నాను..
కేసిఆర్ జీవితం ఒక పోరాటం. అనేక మహా మహులు, రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉద్యమాన్ని నడిపించే క్రమంలో నిష్క్రమించారు. కొందరు స్వప్రయోజనాల దృష్ట, మరికొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు అనేకం. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజికవర్గాలు. నాడు ఈ రెండు పార్టీలకు ధన బలంతో పాటు, ప్రసార మాధ్యమాలు తోడు ఉండడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్షకు పూర్తిగా వాస్తవ విరుద్ధం. అంతే కాదు ఆ సమయంలో కేసిఆర్ అనుకుంటే కావాల్సిన పదవులు వచ్చేవి… కానీ ఆనాడు ఆయన ఆ ఒక్క సాహసోపేత నిర్ణయం చేయకపోతే నేడు “ మన రాష్ట్రం తెలంగాణ ” అని చెప్పుకునే అవకాశం ఉండకపోయేది. ఒక్క అంశం కూడా అనుకూలంగా లేని చోట, గాఢాంధకారం అలుముకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసం ఒక్క కేసిఆర్ కే చెల్లు..
సుదీర్ఘమైన విస్తృత స్థాయి చర్చలు – సంతృప్తికరమైన వివరణలు, నాటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అధ్యయనం, కేసిఆర్ పార్టీ పెట్టాలనుకున్న విషయం తెలుసుకుని రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న అనేక ప్రజా సంఘాలు కేసిఆర్ తో చర్చలు.. ప్రముఖులు వివరాలను సేకరించి సందర్భానుసారంగా వారితోనూ కేసిఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇలా అందరితో చర్చలు సాగిస్తూనే పలు సందేహాలతో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నింటికీ సవివర, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి అపనమ్మకంతో ఉన్న వారికి సంపూర్ణ విశ్వాసం కల్పించి పార్టీలో పనిచేయడానికి సంసిద్ధులను చేసినారు. పార్టీని పెట్టడాని కంటే మునుపే ఇలా అనేక సందర్భాల ద్వారా లోతుగా తెలంగాణను అణువణువునా అర్థం చేసుకునే అధ్యయ కసరత్తు చేశారు.
తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఎన్నో అవహేళనల నడుమ ఒక ఉద్యమ రాజకీయ పార్టీ కేసిఆర్ నాయకత్వంలో 2001 లో ఏర్పడింది.ఇదే మలిదశ ఉద్యమ ఘట్టానికి, కేసిఆర్ నాయకత్వానికి శిఖరం లాంటి గొప్ప పేరును తెచ్చిన ఘటన.. రాష్ట్రం కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీకి రాజకీయంగా ప్రజల నుండి అప్పుడే వోట్ల రూపేణ బలమైన మద్దతు లభించింది. పార్టీ పెట్టిన తొలినాళ్ళలోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం వోటు బ్యాంకును సాధించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ఏర్పాటు హామీతో వారితో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యతను కేసిఆర్ తెచ్చారు. 42 అసెంబ్లీ స్థానాలకు, 06 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయగా అనుకున్నట్టుగానే ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చింది.
24 అసెంబ్లీ స్థానాల్లో, 05 పార్లమెంట్ స్థానాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించి ఆనాడే తెలంగాణ రాష్ట్ర మా బలమైన నినాదం అంటూ ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చే వేదికగా 2004 ఎన్నికలకు కేసిఆర్ వ్యూహరచన చేయడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనంగా నిలిచింది. పొత్తులో భాగంగా నాడు కేసిఆర్ కు కేంద్ర మంత్రి పదవిని ఇచ్చి ఏ శాఖ కేటాయించాలని అడగ్గా.. “ నా లక్ష్యం మీకు తెలుసు.. తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం కావాలి. అందుకు ఏ శాఖ ఇచ్చిన అంగీకారమేనంటూ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన స్పష్టమైన వైఖరితో ప్రజల్లో విశ్వాసం పెంచడం కోసం ఆయన వ్యవహరించిన తీరు అద్వితీయం. ఈ అంశానికి ఆనాడు సజీవ సాక్ష్యంగా ఉన్న నాటి రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ “ ది కొలియేషన్ ఇయర్స్ “ పుస్తకంలో వ్యక్తిగత అవసరాల కంటే తెలంగాణ సాధనకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడంటూ కేసిఆర్ పోరాట పటిమను గుర్తు చేసుకోవడం తెలంగాణ పట్ల కేసిఆర్ నిబద్ధతను చెప్పకనే చెబుతోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కాలం ఏళ్లదీస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికలను ఆసరాగా, అలుసుగా తీసుకుని మన రాష్ట్ర ఏర్పాటు ఎమోషన్ ను వాడుకుని నాడు రెండు రాజకీయ పార్టీల కుట్రలను ఛేదించడానికి తమ అంతిమ గమ్యం తెలంగాణ రాష్ట్రమే అని మూకుమ్మడిగా ప్రకటించడానికి రాజీనామాలను – ఉపఎన్నికలను అస్త్రంగా వాడిన నేత దేశ చరిత్రలో బహుశా కేసిఆర్ ఒక్కరేనేమో..కేంద్ర మంత్రి పదవికి కేసిఆర్, రాష్ట్ర మంత్రి పదవులకు, తమ శాసన సభ సభ్యత్వానికి పలుమార్లు పలువురు కరుడుగట్టిన తెలంగాణ వాదులు రాజీనామాలు చేసి ఇది మా తెగువ అంటూ దేశ రాజకీయాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే న్యాయమైన విధానం వైపు బలంగా చూసేందుకు ఉపయోగపడింది. భావజాల వ్యాప్తికి ఉపఎన్నికల ఆయుధం 2008 లో ఒక్కసారి విఫలమైనా 2010 లో మాత్రం తెలంగాణ రాజకీయాల మీద కేసిఆర్ పట్టును పెంచాయి. 2012 లో ఉద్యమ ఆకాంక్ష బలంగా ఉన్న సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లడం కేంద్రానికి రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన అనివార్యతను సృష్టించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోగా, కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాల్లో డిపాజిట్ రాకపోవడం మొత్తం రాష్ట్ర ఆకాంక్షకు బలమైన నిదర్శనం అని చెప్పవచ్చు.
ఇకపోతే 2009 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ పట్ల వ్యతిరేకంగా ఉన్న టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి వ్యూహాత్మక మహాకూటమి ఏర్పాటు చేసి ఒక రకంగా వారిని సైతం తెలంగాణకు అనుకూలంగా మార్చడంలో సఫలం అయిన, ఎన్నికల ఫలితాల్లో ఆ పొత్తు ప్రభావం చూపలేకపోయాడు కేసిఆర్. మరోవైపు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని నాడే రాజకీయ వ్యభిచారానికి తెరలేపి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలకు పూనుకుంది. అయిన ఇవ్వన్నీ కేసిఆర్ మొక్కవోని దీక్షను భగ్నం చేయలేకపోగా.. ఇంకా ఉధృత ఉద్యమానికి బలం చేకూర్చేకునే విధంగా కేసిఆర్ కు ఆయుధాలను అందించింది.
తర్వాతి క్రమంలో 2009 నవంబర్ 29 నుండి డిసెంబర్ 09 వరకు జరిగిన కేసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారణమైన ఘట్టమని మనందరికీ తెలిసిందే. కేసిఆర్ దీక్షతో రాష్ట్రం ప్రకటించి అనంతరం సీమాంధ్రుల కుట్రలకు తలొగ్గి తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవడం ఇలా అనేక ఆటుపోట్లు మన ఉద్యమాన్ని ప్రభావితం చేసిన అంతిమంగా ప్రజల అంతిమ లక్ష్యం, కేసిఆర్ మొక్కవోని దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేకపోయాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ఉద్యమంతో పాటు తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేవరకు కేసీఆర్ దిల్లీలో నిరంతరం లాబీయింగ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం, వివిధ పార్టీల అడ్డంకులు, పార్లమెంటులో ఘర్షణలను ఆయన వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చి, చివరకు 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టి తెలంగాణ ఒక భౌగోళిక స్వరూపాన్ని సృష్టించడం కోసం కేసిఆర్ ఎంచుకున్న మార్గం ఎప్పటికీ స్పూర్తిదాయకమే. కేసీఆర్ తన నాయకత్వంలో ఏర్పడ్డ రాష్ట్రానికి తానే ఒక సంక్షేమ సారథిగా రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధిలో అనేక రాష్ట్రాలు ఔరా తెలంగాణ అని ముక్కున వేలేసుకుని చూసే విధంగా అన్ని రంగాల్లో తనదైన సామాజిక, మానవీయ స్పృహతో మార్క్ పరిపాలన అందించి దేశానికి తన పదేండ్ల పాలనలో తెలంగాణను ఒక విప్లవాత్మకాభివృద్ధికి సూచికగా మార్చడంలో ఆయన చూపిన కృషి ఎంతో గొప్పది. ఉద్యమంలో తెలంగాణ మీద తనకున్న ఉద్వేగమే.. సాధించిన రాష్ట్రంలో ఒక ఉద్యమమై పదేండ్లలో రైతు బంధు, భరోసా, కేసిఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక ఉద్విగ్న భరితమైన పథకాలకు కేసిఆర్ ను సారధిని చేసిందని నేను బలంగా నమ్ముతాను.
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ గెలుపోటములు సహజం. 2001 నుండి సుదీర్ఘ అవిశ్రామ పోరాటంతో రాష్ట్ర కలను సాకారం చేసి.. పదేండ్ల పాటు ప్రభుత్వాధినేతగా విప్లవాత్మక పాలనను అందించిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది. 2023 ఎన్నికల్లో ప్రజల తీర్పుకు కట్టుబడి ప్రతిపక్ష నేతగా ఆయన తెలంగాణ కోసం స్ఫూర్తిదాయక ప్రయాణం కొనసాగిస్తున్నారు. రాష్ట్రం కోసం ఎత్తిన జెండాను సగర్వంగా సాధించిన రాష్ట్రంలో ఎగరేసిన కేసిఆర్ అంటే తెలంగాణ వాదాన్ని గుండెల్లో నింపుకున్న నాలాంటి ప్రతి యువకుడికి ఒక ఉద్వేగమే. అందుకే ఇదంతా.. ఆ మహా నాయకుడి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు





