అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్

  • గవర్నర్ సందేశాన్ని సావధానంగా విన్న బిఆర్ ఎస్ అధినేత
  • హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే గూడెం వ్యవహారం..

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
అసెంబ్లీ ప్రారంభం రోజున ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.  కెసిఆర్‌ అసెంబ్లీ రాక, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కెసిఆర్‌ను కలుసుకోవడం వంటి సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. కెసిఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న అంశంపై గత శాసనసభ సమావేశాలు ముగిసినప్పటి నుంచి చర్చనీయాంశమైంది. గత సమావేశాల్లో కేవలం ప్రారంభం రోజున మాత్రమే హాజరై, తర్వాత రోజుల్లో అసెంబ్లీకి రాకపోవడంపై అధికార కాంగ్రెస్‌తోపాటు, ఇతర పక్షాలు కూడా విమర్శిస్తూ వొచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలను ప్రారంభించింది. ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా, మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరుపై కొంతకాలంగా జరుగుతున్న చర్చకు తెరపడింది. అందరి అనుమానాలకు జవాబుగా కెసిఆర్‌ ‌గవర్నర్‌ ‌ప్రసంగం పూర్తయ్యేవరకు సభలో సావధానంగా కూర్చున్నారు.  కెసిఆర్‌ అసెంబ్లీ హాల్‌లోకి అడుగుపెట్టగానే అంతా ఆయన ముఖకవళికలను గమనించే పనిలో పడ్డారు.

ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన స్థానంలో కూర్చున్న కెసిఆర్‌ ‌తనముందున్న గవర్నర్‌ ‌ప్రసంగం పేపర్లను తిరగవేస్తూ, గంభీరంగా కనిపించారు. సమావేశం ప్రారంభానికి గంట ముందే అసెంబ్లీకి వొచ్చిన కెసిఆర్‌ ‌స్వీయపార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పలువురు స్వాగతించగా తనకు కేటాయించి చాంబర్‌కు చేరుకున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకులకు కేటాయించిన ఛాంబర్‌కు బదులుగా చిన్న గదిని మాత్రమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. అక్కడే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి హుటాహుటిన వొచ్చి కెసిఆర్‌ను కలుసుకోవడం పలువురిని ఆశ్చర్యపర్చింది. ఆయన కొంతసేపు కెసిఆర్‌తో మాట్లాడడాన్ని పలువురు పలువిధాలుగా అన్వయించుకుంటుండడంతో ఇదిప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గూడెంతోపాటు మరో తొమ్మిది మంది బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. చేరిన ఈ పది మందిలో గూడెంతోపాటు దానం నాగేందర్‌ ‌తిరిగి బిఆర్‌ఎస్‌ ‌గూటికి చేరుతారన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

వీరిద్దరు కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యవహార శైలిపై తరుచు కామెంట్‌ ‌చేస్తుండడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ ‌నుంచి వెళ్లిన మరికొందరు ఎమ్మెల్యేలుకూడా వీళ్లలాగా బయటపడకపోయినా కాంగ్రెస్‌లో ఇముడలేకపోతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. దానికితోడు పార్టీ ఫిరాయింపుపై బిఆర్‌ఎస్‌ ‌సుప్రీంకోర్టులో వేసిన కేసు తీర్పు తుది దశలో ఉండడం, అది వీరికి వ్యతిరేకంగా వొస్తుందన్న భయం కూడా వారిని వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది .అందుకే ఘర్‌ ‌వాపసీకి వీరు సన్నద్దమవుతున్నట్లు వినికిడి. గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీ మారినప్పటి నుంచీ తన స్వంత నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదురవుతూ రావడం ఒక కారణంగా మారింది.

పటాన్‌చెరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కాటా శ్రీనివాసగౌడ్‌ ‌పొమ్మనలేక పొగపెట్టడంతో అక్కడ గూడెం తట్టుకోలేకపోతున్నారు. దానికి తగినట్లు కాంగ్రెస్‌ అధినాయకత్వం కూడా నియోజకవర్గంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కాటాకే అధికారాన్నివ్వడంకూడా మహిపాల్ రెడ్డికి నియోజకవర్గంపై పట్టులేకుండా పోయింది. అలాగే తన ఎమ్మెల్యే అధికార కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోకు బదులుగా కెసిఆర్‌ ‌ఫొటో పెట్టుకోవడం, కాంగ్రెస్‌ ‌పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది. ఈ పరిణామాలతో ఆయన ఎప్పుడైనా తిరిగి బిఆర్‌ఎస్‌లోకి వెళ్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ వొచ్చాయి. దానికి తగినట్లుగా ఆయన బుధవారం కెసిఆర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిసి మాట్లాడడం వెనుక ఘర్‌ ‌వాపసీకి దారి ఏర్పరుచుకుంటున్నారన్న ప్రచారానికి బలమిచ్చినట్లైంది.

అయితే తన తమ్ముడి కుమారుడి వివాహ శుభపత్రికను అందజేసేందుకే కెసిఆర్‌ను గూడెం కలిశాడంటూ మరికొందరు అన్వయిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా ఆయన కెసిఆర్‌తో తాను కాంగ్రెస్‌లో ఉండలేనని, పార్టీలోకి తిరిగి వొస్తానని చెప్పినట్లు సోషల్‌ ‌మీడియాల్లో వొస్తున్న వార్తల్లో ఎంత నిజముందో గానీ.. గూడెంతోపాటు, దానం కూడా తిరిగి బిఆర్‌ఎస్‌లోకి  వెళ్తారన్న వార్తలు మాత్రం ప్రభలంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు పార్టీ ఫిరాయించిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా అదేబాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వోట్లను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌, ‌మిత్రపక్షమైన సిపిఐతో కలిపి నాలుగు ఎంఎల్సీ స్థానాలకు అభ్యర్ధులను నిలిపింది. తమ 68 మంది ఎంఎల్‌ఏలకు అదనంగా బిఆర్‌ఎస్‌నుంచి వొచ్చిన పది మంది వోట్లు తమకే పడుతాయన్న ధీమాతో ఇంతకాలముంది. కాని, నేడు గూడెం ఎపిసోడ్‌, ‌రానున్న సుప్రీంకోర్టు తీర్పుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల అయోమయం ఇప్పుడు కాంగ్రెస్‌ను సందిగ్ధంలో పడేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *