– దెబ్బతిన్న పంటల పరిశీలన
– శ్రీవర్షిత తల్లిదండ్రులకు పరామర్శ
– ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలి
– కల్వల ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి
– జాగృతి వ్యవస్థాపకురాలు కవిత
కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 31: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలోని గురువారం కురిసిన వర్షానికి నుస్తులాపూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అలాగే మక్తపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం సందర్శించి తాసి ముద్దయి ఆరబెడుతున్న వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం శంకరపట్నం మండలంలోని కల్వల గ్రామంలోని 0.25 టీఎంసీ సామర్థ్యం గల గండిపడ్డ ప్రాజెక్టుని పరిశీలించారు. మార్గమధ్యలో కాచాపూర్ గ్రామంలో ఆగి నేలకొరిగిన వరి పంటలను చూశారు. అనంతరం హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఇటీవల వంగర గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత తల్లిదండ్రులను కలిసి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశాలలో మాట్లాడారు. తిమ్మాపూర్ మండలం, మక్తపల్లి గ్రామంలో తుఫానుకు వరి పంటలు నేలకొరిగి, నీట మునిగి అన్నదాతలు ఆగమై, తీవ్రంగా నష్టపోయారు. మిల్లర్లు పెట్టే కండిషన్లకు విక్రయించడం సాధ్యపడదు. అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఎకరాకు రూ. 50వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. శంకరపట్నం మండలం, కల్వల గ్రామంలో 0.25 టిఎంసి సామర్థ్యం గల ప్రాజెక్టుకి గండిపడి మూడు సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వం ఇంకా మరమ్మత్తులు చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ. 70 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. తరువాత ప్రభుత్వం మారడంతో పనులు జరగడం లేదు. మానకొండూరు నియోజకవర్గం లో ప్రాజెక్టు ఉంటే హుజురాబాద్ నియోజకవర్గం లోని ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నీరు పారుతుంది. దీంతో ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో ఎవరు చేస్తే ఎవరికీ పేరు వస్తుందేమోనని సందిగ్ధం ఏర్పడిందని ఆరోపించారు. వీరిద్దరి మధ్య మత్స్యకారులు అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా 6వేల ఎకరాల ఆయకట్టు రైతుల, 180 కుటుంబాల మత్సకారులతోపాటు ఈ ప్రాంత భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని ఇరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు హితవు పలికారు. అదే విధంగా కల్వల ప్రాజెక్టు పునరుద్ధరణతో మత్తడి నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజురాబాద్ మండలం, రాంపూర్ గ్రామంలో పర్యటించిన ఆమె ఇటీవల హన్మకొండ జిల్లా, వంగర గ్రామంలోని బీసీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతూ, ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత తల్లిదండ్రులను వారి స్వగ్రామం రాంపూర్ లో పరామర్శించారు. శ్రీ వర్షిత చిత్రపటానికి నివాళులర్పించారు. ఇంతవరకు పోలీసు, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ఎవరు మృతురాలు శ్రీ వర్షిత తల్లిదండ్రులను పరామర్శించడం, విచారించడమో చేయలేదని ఆరోపించారు. ఈ సంఘటన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం పరిధిలోనే జరిగిందని, దీనికి సంబంధించి అంతా తానే చూసుకుంటానని స్టేట్మెంట్ ఇవ్వడం తమకు తెలుసని, ఇంతవరకు ఈ విషయంలో ఆయన కన్నెత్తి చూడడమే లేదని ఆరోపించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యేక బృందాన్ని నియమించి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీ వర్షిత తల్లిదండ్రులకు తెలంగాణ జన జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


