“పార్టీ నుంచి రాజీనామా ప్రకటించిన సమావేశంలో ఆమె, కెసిఆర్ ప్రాథమిక కుటుంబాన్ని, అనుబంధ కుటుంబాన్ని వేరుచేశారు.కెసిఆర్, తాను, కెటిఆర్ ఒకటి, వరుస బంధువులు అయిన హరీశ్, సంతోష్‌లు వేరు. అనుబంధ కుటుంబీకులైన హరీశ్, సంతోష్ లను నేరుగా, సూటిగా నిందించారు, అవినీతి ఆరోపణలు చేశారు. సంతోష్ విషయంలో అయితే, నిర్దిష్టంగా ఉదంతాలను చెప్పి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నట్టు సూచించారు. ఆంతరంగిక లేఖలోను, తరువాత అనేక మీడియా ఇంటర్వ్యూలలోను కవిత చెబుతూ వచ్చిన వివక్ష సంగతి పక్కన బెట్టి, బంధువుల మాయలో పడిన కుటుంబాన్ని రక్షించడానికి నడుంగట్టిన ఆడబిడ్డలాగా మాట్లాడారు. ఎక్కువగా కుటుంబ కలహంగా, తక్కువగా రాజకీయ కలహంగా కవిత వివాదం ధ్వనించింది. ఈ వైఖరి మార్పు సరిఅయినదేనా? ప్రజలు ఈ ఉదంతాన్ని ఎట్లా చూస్తారు?”

కల్వకుంట్ల కవితను బిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసిన మరునాడు ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఆ వార్తను ఆకర్షణీయమైన పతాకశీర్షికతో ప్రచురించింది. ‘పుట్టిల్లు పొమ్మంది’. సాంస్కృతిక, రాజకీయ అర్థఛాయలను దట్టించిన ఆ శీర్షిక కవిత కేంద్రంగా సాగుతున్న పరిణామాలను పూర్తిగా వ్యక్తం చేస్తుందని చెప్పలేము, కానీ, ఆ నాటికి అది ఒక భావస్ఫోరకమైన, మర్యాదైన శీర్షిక. చమత్కారం కోసం సంస్కారం విషయంలో రాజీపడడం ప్రధానమీడియాలో కూడా తరచు చూస్తుంటాం. అప్పటెప్పడిదో ఒక వెకిలి ఎన్టీయార్ సినిమాలో ఉన్న మకిలి పాట చరణం ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ అన్న శీర్షిక పెట్టకుండా నిగ్రహించుకున్నందుకు పాత్రికేయులను ఈ సందర్భంగా అభినందించవచ్చు.
పార్టీ సస్పెన్షన్, రాజీనామాల తరువాత, బిఆర్ఎస్ రాజకీయ సైన్యంలోను, సోషల్ మీడియా కామెంటర్లు ట్రోలర్లలోను కనిపిస్తున్న తెగింపు, రాజకీయంగా మోహరించిన యూట్యూబర్ జర్నలిస్టుల విపరీత చర్చలు- చూసినప్పుడు ఈ పతనానికి అంతం లేదా అని బాధకలుగుతుంది. రాజకీయ ఘర్షణల్లో ఒక పక్షం మహిళ అయితే చాలు, దానికి సంబంధించిన సంవాదంలో లైంగిక భాషా దాడి, వ్యక్తిగత ప్రతిష్ఠ హననం తప్పనిసరిగా కనిపిస్తుంది. ‘పెద్ద పెద్ద’ నాయకుల కుటుంబస్త్రీలకు కూడా ఇప్పుడు మినహాయింపు ఉండడం లేదు. రాజకీయ వాదులు మాత్రమే కాదు, మొత్తంగా సమాజంలోనే స్త్రీలను రాజకీయాలలో సీరియస్ పాత్రధారులుగా పరిగణించే అలవాటు రావడం లేదు. ఏకైక వారసురాలిగా ఉంటే ఆ ప్రతిపత్తి వేరు, మగవారసుడితో పోటీపడే వారసురాలు అయితే, అప్పుడు చూసే పద్ధతి వేరు!
కవిత ఒక పార్టీలో పనిచేశారు, ఆ పార్టీలో కొన్ని అంశాలు నచ్చక విమర్శిస్తూవస్తున్నారు, ఆమెను ఆ పార్టీ నాయకుడు సస్పెండ్ చేశారు, ఇది కదా కనిపించవలసిన వాస్తవ దృశ్యం! కానీ, కవిత కేసిఆర్ కూతురు. ఆయన ఇల్లు ఆమెకు పుట్టిల్లు. కెసిఆర్ పార్టీ ఆమెకు రాజకీయ పుట్టిల్లు. అంతే. పుట్టింటి పెద్దరికం చేస్తున్నవారి మీద ఆమె ఫిర్యాదులు చేస్తోంది. అప్పుడు తండ్రి ఆమెను గెటవుట్ అన్నారు – ఇటువంటి కౌటుంబిక అర్థాన్నే సమాజం గ్రహించింది. ఆమెకు అది పుట్టిల్లు మాత్రమే అనుకోవడంలో, ఆమె వారసత్వ హక్కులు పరిమితమే అని భావించమూ ఉంది! వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆమెకు కెసిఆర్ కుటుంబం లేదా పార్టీ ఎందుకు పుట్టిల్లు అయిందంటే, కెసిఆర్ పార్టీలో ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు…. అంతా ప్రధాన కుటుంబ సభ్యులో, అనుబంధ కుటుంబసభ్యులో! కుటుంబం నుంచి తనకు న్యాయమైన వాటా దక్కడం లేదని ఆవేదన చెందినా, పార్టీలో తగిన స్థానం ఇవ్వడం లేదని బాధపడినా, అందుకు ఆమె భావిస్తున్న కారకులు అక్కడా ఇక్కడా ఒకరే! కుటుంబమే పార్టీ అయినప్పుడు ఏర్పడే సన్నివేశం ఇది!
“కెసిఆర్ తన మీద వివక్ష చూపడం వెనుక పితృస్వామిక భావజాలం ఉందని ఆమె అనేక సందర్భాలలో ధ్వనించారు. బహుశా, ఆ బాధిత భావన నుంచి ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకుని, ముఖ్యమంత్రి పదవిని మాత్రం తానెందుకు ఆశించకూడదు?అన్న ప్రశ్నవేసుకున్నారు. పది పదిహేను సంవత్సరాల గడవు పెట్టుకుని, తెలంగాణ రాజకీయాలలో ప్రధాన పాత్ర నిర్వహించాలని, తద్వారా తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకు, లాంచింగ్ ప్యాడ్ తాను ఇప్పటిదాకా ఉంటున్న పార్టీయే కాబట్టి, దాని మీద విమర్శలతో కలకలం సృష్టించారు. కెసిఆర్‌ను గౌరవిస్తూ, చుట్టూ ఉన్నవారి మీద విరుచుకు పడ్డారు. వారెవరో తరువాత నిర్దిష్టంగా వెల్లడి చేశారు. పార్టీని రక్షించుకొమ్మని తండ్రికి, అన్నకు విజ్ఞప్తి చేస్తూ తాను పార్టీ నుంచి వెళ్లిపోయారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న బిఆర్‌ఎస్, కవితను పంపించినప్పటికీ, ఆ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుందా? సంతోష్ మీద ఇప్పటికే ఫిర్యాదులున్న పార్టీ శ్రేణులు అధినేత ముందు మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకుంటారా? కెటిఆర్, హరీశ్ మధ్య ప్రచ్ఛన్నంగా సాగుతున్న అధికారయుద్ధం బహిరంగం, ఉధృతం అవుతుందా?”
ఆశ్చర్యకరంగా, కవిత కూడా కుటుంబానికి పార్టీకి అభేదం పాటిస్తూ మాట్లాడారు! పార్టీ నాయకుడిని ‘నాన్న’ అని తప్ప మరో విధంగా సంబోధించలేదు, ‘కెసిఆర్ కూతురు’ గానే ఆమె మాట్లాడారు! తన నాన్నకు, అన్నకు వ్యతిరేకంగా మేనత్త కొడుకు, చిన్నమ్మ కొడుకు కుట్రలు చేస్తున్నారు, అంతే ఆమె తాజా నెరేటివ్! పార్టీ రజతోత్సవాల ప్రారంభ సభల తరువాత రాసిన ఆంతరంగిక లేఖ దగ్గర నుంచి, తన రాజీనామాను ప్రకటించిన విలేఖరుల సమావేశం దాకా, అంతస్సూత్రం ఒకటే కావచ్చును కానీ, కవిత ప్రయాణంలో తడబాటు, సర్దుబాటు ఉన్నాయి. పార్టీ రాజకీయ వైఖరి మీద విమర్శతో మొదలుపెట్టి, కెసిఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్న ఆరోపణ దాకా కవిత తన ఆవేదనను ఆంతరంగిక లేఖలో చెప్పారు. దెయ్యాలలో కెసిఆర్ కు సర్వసహాయకుడు, మాజీ ఎంపీ సంతోష్ స్పష్టంగా ఉన్నారు. కెటిఆర్ మీద ధ్వనిమాత్రమైన విమర్శ ఉంది. హరీశ్ మీద పెద్దగా గురి కనిపించలేదు. పార్టీ నుంచి రాజీనామా ప్రకటించిన సమావేశంలో ఆమె, కెసిఆర్ ప్రాథమిక కుటుంబాన్ని, అనుబంధ కుటుంబాన్ని వేరుచేశారు.కెసిఆర్, తాను, కెటిఆర్ ఒకటి, వరుస బంధువులు అయిన హరీశ్, సంతోష్‌లు వేరు. అనుబంధ కుటుంబీకులైన హరీశ్, సంతోష్ లను నేరుగా, సూటిగా నిందించారు, అవినీతి ఆరోపణలు చేశారు. సంతోష్ విషయంలో అయితే, నిర్దిష్టంగా ఉదంతాలను చెప్పి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నట్టు సూచించారు. ఆంతరంగిక లేఖలోను, తరువాత అనేక మీడియా ఇంటర్వ్యూలలోను కవిత చెబుతూ వచ్చిన వివక్ష సంగతి పక్కన బెట్టి, బంధువుల మాయలో పడిన కుటుంబాన్ని రక్షించడానికి నడుంగట్టిన ఆడబిడ్డలాగా మాట్లాడారు. ఎక్కువగా కుటుంబ కలహంగా, తక్కువగా రాజకీయ కలహంగా కవిత వివాదం ధ్వనించింది. ఈ వైఖరి మార్పు సరిఅయినదేనా? ప్రజలు ఈ ఉదంతాన్ని ఎట్లా చూస్తారు?
ప్రజల దృష్టిలో స్త్రీ రాజకీయ ప్రారంభమే కొన్ని మైనస్ పాయింట్లతో మొదలవుతుంది. ఏ వారసత్వమో లేకుండా రాజకీయాల్లో ఒక అడుగు వేయడం కూడా దాదాపు అసాధ్యం. అయితే, వారసత్వం ఉన్నా కూడా పురుషవారసుల కంటె అదనపు సామర్థ్యాలు ఉండాలి. ఏ వివాదమూ లేనప్పుడు కూడా కల్వకుంట్ల కవిత గురించిన జనాభిప్రాయం ఏమంత సానుకూలంగా లేదు. ఆరోవేలు లాంటిదని, ఆమె ఉనికి టిఆర్‌ఎస్‌కి ఉన్న కుటుంబపార్టీ ముద్రను మరింత పెంచుతుందని ఒక అభిప్రాయం. ఆమె వ్యవహారసరళి గురించో, ఆర్థికాంశాల గురించో విన్నప్పుడు, వాటిని మరీ హీనంగా పరిగణించడం, అవే పనులు మగవారసుల గురించి విన్నప్పుడు వాటిని తేలికగా తీసుకోవడమో, సహజమే అనుకోవడమో చూస్తాము. అట్లాగే, సానుకూల గుణాల విషయంలోనూ సమానంగా చూడడం ఉండదు.
సమాన అవకాశమే ఇవ్వనప్పుడు, సమాన ఫలితాలు ఎట్లా వస్తాయి? సహాయక లేదా అప్రధాన పాత్రలకు మాత్రమే కవిత పనికివస్తుంది అన్న అభిప్రాయం ఏర్పడడానికి కెసిఆర్ అనుసరించిన వైఖరి కూడా కారణం. ఆయన తన పార్టీని కుటుంబ పార్టీ చేయడానికి వ్యతిరేకి కాదు. కానీ, అందులో స్త్రీలకు ప్రవేశం లేదు. ఆయన దృష్టిలో కుమార్తెలు ‘పావురమో’, గారాబమో చూపవలసినవారు మాత్రమే తప్ప, పట్టాభిషేకాలకు అర్హులు కారు. అందువల్ల, కెటిఆర్ రావడం రావడమే ప్రధాన రాజకీయాలలోకి ప్రవేశించగా, కవిత సాంస్కృతికరంగాన్ని ఎంచుకొని బతకమ్మ నినాదం మీద, ఆ తరువాత తనకు కేటాయించిన సింగరేణి కార్మికసంఘాల రంగంలోను పనిచేయవలసి వచ్చింది. ఢిల్లీ అవకాశాన్ని ఆమె సరిగా వినియోగించుకోలేకపోయారని, లోకసభ పోటీలో రెండో సారి ఓటమి ఎదురవడానికి నిజామాబాద్ జిల్లాలో ఆమె వ్యవహారసరళి కారణమని ఒక అంచనా ఉంది. లేదు, కెసిఆర్, పార్టీ తగిన మద్దతు ఇచ్చి ఉంటే ఆమె ఓడిపోయేవారు కాదన్న అభిప్రాయమూ ఉంది.
తనను తక్కువ చూస్తున్నారన్నఅభిప్రాయం కవితకు మొదటి నుంచి ఎంతో కొంత ఉన్నట్టు అనుకోవచ్చు. తనకు నాలుగో స్థానం ఇచ్చినా సంతృప్తిపడదామని అనుకుని ఉండవచ్చు, సంతోష్ కుమార్ ప్రాధాన్యంతో, మరింత అడుగుకు తన స్థానం చేరడంతో ఆమెకు అసంతృప్తి తీవ్రమైంది. కెసిఆర్ తన మీద వివక్ష చూపడం వెనుక పితృస్వామిక భావజాలం ఉందని ఆమె అనేక సందర్భాలలో ధ్వనించారు. బహుశా, ఆ బాధిత భావన నుంచి ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకుని, ముఖ్యమంత్రి పదవిని మాత్రం తానెందుకు ఆశించకూడదు?అన్న ప్రశ్నవేసుకున్నారు. పది పదిహేను సంవత్సరాల గడవు పెట్టుకుని, తెలంగాణ రాజకీయాలలో ప్రధాన పాత్ర నిర్వహించాలని, తద్వారా తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. అందుకు, లాంచింగ్ ప్యాడ్ తాను ఇప్పటిదాకా ఉంటున్న పార్టీయే కాబట్టి, దాని మీద విమర్శలతో కలకలం సృష్టించారు. కెసిఆర్‌ను గౌరవిస్తూ, చుట్టూ ఉన్నవారి మీద విరుచుకు పడ్డారు. వారెవరో తరువాత నిర్దిష్టంగా వెల్లడి చేశారు. పార్టీని రక్షించుకొమ్మని తండ్రికి, అన్నకు విజ్ఞప్తి చేస్తూ తాను పార్టీ నుంచి వెళ్లిపోయారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న బిఆర్‌ఎస్, కవితను పంపించినప్పటికీ, ఆ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటుందా? సంతోష్ మీద ఇప్పటికే ఫిర్యాదులున్న పార్టీ శ్రేణులు అధినేత ముందు మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకుంటారా? కెటిఆర్, హరీశ్ మధ్య ప్రచ్ఛన్నంగా సాగుతున్న అధికారయుద్ధం బహిరంగం, ఉధృతం అవుతుందా?
“పార్టీలో, పాలనలో సమ్మిశ్రిత భాగస్వామ్యం ఉండాలన్నది ప్రజాస్వామికవాదులు టిఆర్ఎస్ నుంచి ఆశించారు. కుటుంబంలోనే సమన్యాయం జరగలేదని కవిత ఉదంతం చెబుతోంది. తెలంగాణ సమాజానికి మాత్రం మెరుగైన ప్రజాస్వామికత కలిగిన మరో తెలంగాణ వాద ప్రాంతీయ పార్టీ అవసరం. అది తెలంగాణ ఉద్యమాశయాలను, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో, ప్రజాభాగస్వామ్య పరిపాలనతో ఉండాలి. అటువంటి కర్తవ్యాన్ని ఎవరైనా తలకెత్తుకుంటే, పోనీ, కనీసం తలకెత్తుకున్నట్టు నటిస్తే, ప్రజలు వారిని ఆదరిస్తారు. అదొక్కటి తప్ప రాజకీయంగా తెలంగాణాలో ఖాళీస్థానం అంటూ ప్రస్తుతానికి ఏదీ లేదు. ”
పార్టీలో సరే, కవిత ప్రభావం బయట ఏ మాత్రం ఉంటుంది? ఆమె బలాన్ని కూడగట్టుకోగలరా? సొంత పార్టీ పెడితే ఆమె విధానాలేముంటాయి? ఏ సమీకరణాల మధ్య తన ఉనికి, ఎదుగుదలను ఆమె చూస్తున్నారు? అన్నవి ప్రశ్నలు. ఆమెకు అంత దృశ్యము లేదని, అనామకంగా మిగలిపోతారని ఖాయంగా చెబుతున్నవారున్నారు. న్యూసెన్స్ వేల్యూ తప్ప ఆమె చర్యలకు మరే విలువా లేదని విమర్శిస్తున్నవారున్నారు. ఆమెను ఒక ప్రధాన రాజకీయ నేతగా పరిగణించడానికి సిద్ధపడేవారు అతి తక్కువ మంది. ఈ అంచనా వేస్తున్నవారిలో ఆమె మీద చిన్నచూపుతో మాట్లాడుతున్నవారున్నారు, ఇప్పటి దాకా ఆమె రాజకీయ ప్రవర్తనను, నాయకత్వ శక్తిని దృష్టిలో పెట్టుకుని జోస్యం చెబుతున్నవారున్నారు, తమ పార్టీకి ఇంత హాని చేసిన వ్యక్తి మట్టికొట్టుకుపోవడం ఖాయమని ఆగ్రహంతో చెబుతున్న బిఆర్‌ఎస్ వారున్నారు. మరోపక్క, వీరెవరూ కవిత ఉదంతం ఏదైనా గణనీయమైన ప్రభావం వేయగలశక్తి కలదని అంగీకరించరు, కానీ, ఆమె ఇట్లా చేసినందుకు మాత్రం మర్యాదాసూత్రాలు దాటి మరీ ట్రోల్ చేస్తున్నారు.
ఇప్పటివరకు, కవిత చెబుతున్నటువంటి 20 సంవత్సరాల పార్టీ- ప్రజా జీవితాలను నిష్పాక్షికంగా అంచనా వేస్తే, ఆమె కొన్ని రంగాలలో మంచి ఆర్గనైజర్‌గాను, ప్రభావశాలిగాను ఉన్నారు. తండ్రి, అన్న మాదిరిగానే మూడు భాషల్లో ధారాళమైన, మంచి వక్త. కానీ, ఆమె నాయకురాలిగా ప్రధానరాజకీయ వేదిక మీద ఎంత వరకు నిలబడతారో తెలియదు. కొన్ని అంశాల్లో ఆమె చెడ్డపేరు సంపాదించుకున్నారు, లిక్కర్ స్కామ్ తో తనకు, పార్టీకి కూడా హానిచేశారన్న అభిప్రాయం కల్పించుకున్నారు. తన ఇమేజ్ ను దిద్దుబాటు చేసుకోవడం ఆమె ముందున్న ప్రథమ కర్తవ్యం. ఇప్పుడున్న ఇమేజ్ ఆధారంగా ఆమె ఏ మాత్రం ముందుకు వెళ్లలేరు. ఆమె తన కార్యక్రమాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత దూరదృష్టితో రూపొందించుకుంటారు, ఎటువంటి తొందరపాట్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా దాన్ని ఎంత నిగ్రహంగా నిర్వహిస్తారు అన్న అంశాలు ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అవే కాదు, బాహ్య రాజకీయ పరిస్థితుల మధ్య తన స్థలాన్ని, అవకాశాలను గుర్తించగలిగే సామర్థ్యం కూడా అవసరం. తన ‘పుట్టింటి’ పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత కొనసాగుతుంది, బయటి శక్తులు తన ఎదుగుదలను ఏ మేరకు అనుమతిస్తారో పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ చిత్రపటంలో ఎవరికి అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా ఎప్పుడెప్పుడు ఎట్లా వైఖరులు నిర్ణయించుకోవాలి అన్న చాకచక్యాన్ని బట్టి, సొంతంగా అనుచరగణాన్ని కూడగట్టుకునే శక్తిని బట్టి ఆమె భవిష్యత్ చిత్రపటం రూపుదిద్దుకుంటుంది.
ఆమెకు భవిష్యత్తు ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ఆమెకు మాత్రమే సంబంధించిన విషయం. కానీ, తెలంగాణ రాజకీయాలలో ఎదగాలనుకోవడానికి, అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడానికి, పార్టీ పెట్టడానికైనా వేరే పార్టీలో చేరడానికైనా ఆమెకు నూటిని నూరుపాళ్లు హక్కు ఉంది. ప్రజాప్రాధాన్యం లేని అంశమైనప్పటికీ, కేసిఆర్ కుటుంబం నుంచి తనకూ సమానవాటా కావాలని కోరడానికీ ఆమెకు హక్కు ఉంది. ఆమెకు ఆ అర్హత లేదు, యోగ్యత లేదు అని వాదించేవారు చెప్పే సవాలక్షకారణాలేవీ చెల్లవు.
బిఆర్‌ఎస్ పార్టీతో తన తగవు అంతా తన ఫ్యామిలీకి, కజిన్స్ కు మధ్య పోరాటమని కవిత చెప్పకనే చెప్పారు. అదంతా పంపకాల కొట్లాట అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంవాదం అంతా అటువంటి అభిప్రాయాన్నే బలంగా కలిగిస్తోంది. ఈ తగాదా అంతటి మీదా సాధారణప్రజలకు వినోదాసక్తే తప్ప రాజకీయాసక్తి ఉండదు. ఎక్కడో ఒక చోట ప్రజా ప్రయోజనాలను కూడా తన ప్రయోజనాలలో భాగం చేసి, ప్రజల మద్దతు కోరాలి. తెలంగాణ ఉద్యమసమాజం తన లాగే కవితను కూడా కెసిఆర్ బాధితురాలిగా పరిగణించి, కలుపుకుంటే, కలిసి పోరాడవచ్చు.
పార్టీలో, పాలనలో సమ్మిశ్రిత భాగస్వామ్యం ఉండాలన్నది ప్రజాస్వామికవాదులు టిఆర్ఎస్ నుంచి ఆశించారు. కుటుంబంలోనే సమన్యాయం జరగలేదని కవిత ఉదంతం చెబుతోంది. తెలంగాణ సమాజానికి మాత్రం మెరుగైన ప్రజాస్వామికత కలిగిన మరో తెలంగాణ వాద ప్రాంతీయ పార్టీ అవసరం. అది తెలంగాణ ఉద్యమాశయాలను, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో, ప్రజాభాగస్వామ్య విలువలతో ఉండాలి. అటువంటి కర్తవ్యాన్ని ఎవరైనా తలకెత్తుకుంటే, పోనీ, కనీసం తలకెత్తుకున్నట్టు నటిస్తే, ప్రజలు వారిని ఆదరిస్తారు. అదొక్కటి తప్ప రాజకీయంగా తెలంగాణాలో ఖాళీస్థానం అంటూ ప్రస్తుతానికి ఏదీ లేదు.