కశ్మీర్‌పై మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
న్యూదిల్లీ : న్యూఢల్లీి: జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి వారు లేఖ రాశారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను మంజూరు చేస్తూ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతున్నాం. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని అయిదేళ్లుగా అక్కడి ప్రజలు కోరుతున్నారని తెలిపారు. దీంతోపాటు లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని, ఈ రెండు డిమాండ్లు చట్టబద్ధమైనవని, అవి రాజ్యాంగపరంగా, ప్రజాసామ్యపరంగా ప్రజలకున్న హక్కులని వారు పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర పతిపత్తి కల్పించిన ఉదాహరణలు గతంలో ఉన్నాయని, అయితే జమ్మూకశ్మీర్ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగిందని, పూర్తిస్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతానికి తగ్గించి విభజించడం మొదటిసారిగా జరిగిందని ఖర్గే, రాహుల్ పేర్కొన్నారు. ‘రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యక్తిగతంగా మీరు పలుమార్లు చెప్పారు. 2024 మే 19న భువనేశ్వర్ ఇంటర్వ్యూలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని మీరు చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పార్లమెంటులో చెప్పినట్టు కూడా శ్రీనగర్‌లో 2024 సెప్టెంబర్ 19న జరిగిన ర్యాలీలో మీరు పునరుద్ఘాటించారు’ అని కాంగ్రెస్ అగ్రనేతలిరువురు ప్రధానికి గుర్తుచేశారు.


