కౌలుదార్ల సమస్య పట్టించుకోవడం సమాజ బాధ్యత!

“కాంగ్రెస్ చేసిన ఈ వాగ్దాన భంగాలను వివరంగా అర్థం చేసుకునే ముందు, అసలు కాంగ్రెస్ ఆ వాగ్దానాలు చేయవలసి వచ్చిన స్థితి గురించి కూడా చెప్పుకోవాలి. తెలంగాణ సమాజంలో, వ్యవసాయంలో కౌలు రైతుల పాత్ర అసాధారణమైనది. నిజాం కాలం నాటి భూస్వామ్య సమాజంలో వేలాది ఎకరాల భూస్వాములు ఉండడంవల్ల అనివార్యంగా తెలంగాణ గ్రామసీమల్లో కౌలురైతుల ప్రాధాన్యత పెరిగింది. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కౌలుదార్ల బేదఖల్ కు వ్యతిరేక పోరాటాలు గణనీయమైన భాగం వహించాయి. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కౌల్దార్ల రక్షణ చట్టాలు తేవడం రైతాంగ సాయుధ పోరాటానికి ఒక ప్రతిస్పందన. ఆ రక్షణ చట్టాల అమలు తీరు ఎలా ఉన్నా, కనీసం వ్యవసాయ భూరికార్డులలో, పహణీలలో భూమి పట్టాదారుల పేరుతో పాటు, వాస్తవంగా సాగుచేస్తున్న కౌలు రైతుల పేరు (కాస్తుదారు, సాగుదారు) కూడా నమోదు చేయడానికి ఒక ప్రత్యేకమైన కాలమ్ ఏర్పాటు ఉండేది.”

తెలంగాణ కౌలు రైతులలో గత పది సంవత్సరాలుగా రగులుతున్న అసంతృప్తి, ఆత్మహత్యల రూపంలో పెద్ద ఎత్తున వ్యక్తమైన నిస్సహాయత ఇప్పటికైనా గుర్తించి, తగిన పరిష్కారాలు అమలు చేయకపోతే ఆ ఆందోళన ఎటువైపు మళ్లుతుందో చెప్పలేం. చారిత్రకంగా తెలంగాణ కౌలు రైతులకు ఉన్న సమస్యలన్నీ అలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం 2018 ఎన్నికల నాటి నుంచీ చేస్తూ వస్తున్న వాగ్దానాలు నెరవేర్చకపోవడం కౌలు రైతుల అసంతృప్తి, ఆగ్రహం పేరుకోవడానికి కారణమవుతున్నాయి.

ప్రతిపక్షంగా ఉండిన కాంగ్రెస్ కౌలుదారులకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి గత శాసనసభలో చాలాసార్లు మాట్లాడింది. భారత్ జోడో యాత్రలో భాగగా రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలిసి, తమ ప్రభుత్వం రాగానే కౌలు రైతులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. రైతుభరోసా అనే కొత్త పథకాన్ని నిజమైన సాగుదారులకు వర్తింపజేస్తామని ఎన్నికల ప్రణాళికలో ఆరు గ్యారంటీలలో చేర్చారు. ఎన్నికల సందర్భంగా అప్పటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖలో అసలు 2011లో భూఅధీకృత సాగుదారుల చట్టం తెచ్చినది  తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు అధికారం లోకి రాగానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రెండున్నర సంవత్సరాల పాలన తర్వాత చూస్తే ఈ వాగ్దానాలన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.

కాంగ్రెస్ చేసిన ఈ వాగ్దాన భంగాలను వివరంగా అర్థం చేసుకునే ముందు, అసలు కాంగ్రెస్ ఆ వాగ్దానాలు చేయవలసి వచ్చిన స్థితి గురించి కూడా చెప్పుకోవాలి. తెలంగాణ సమాజంలో, వ్యవసాయంలో కౌలు రైతుల పాత్ర అసాధారణమైనది. నిజాం కాలం నాటి భూస్వామ్య సమాజంలో వేలాది ఎకరాల భూస్వాములు ఉండడంవల్ల అనివార్యంగా తెలంగాణ గ్రామసీమల్లో కౌలురైతుల ప్రాధాన్యత పెరిగింది. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కౌలుదార్ల బేదఖల్ కు వ్యతిరేక పోరాటాలు గణనీయమైన భాగం వహించాయి. నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కౌల్దార్ల రక్షణ చట్టాలు తేవడం రైతాంగ సాయుధ పోరాటానికి ఒక ప్రతిస్పందన. ఆ రక్షణ చట్టాల అమలు తీరు ఎలా ఉన్నా, కనీసం వ్యవసాయ భూరికార్డులలో, పహణీలలో భూమి పట్టాదారుల పేరుతో పాటు, వాస్తవంగా సాగుచేస్తున్న కౌలు రైతుల పేరు (కాస్తుదారు, సాగుదారు) కూడా నమోదు చేయడానికి ఒక ప్రత్యేకమైన కాలమ్ ఏర్పాటు ఉండేది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వం భూరికార్డులను క్రమబద్ధీకరించడం పేరుతో ధరణి అనే కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. చట్టబద్ధంగానే పహణీల నుంచి, పట్టా పాస్ పుస్తకాల నుంచి సాగుదారు పేరు రాసే అవకాశాన్నే రద్దు చేసింది. తమ ప్రభుత్వం భూయజమానులది మాత్రమేనని, తాము పట్టాదారులను మాత్రమే రైతులుగా గుర్తిస్తామని అప్పటి ముఖ్యమంత్రి స్పష్టంగానే ప్రకటించారు. ఆ తర్వాత వ్యవసాయ ప్రోత్సాహకం అనే పేరుతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని భూయజమానుల ప్రోత్సాహకంగా అమలు చేశారు. వ్యవసాయం చేసినందుకు కాక, భూయజమానిగా కాగితాల మీద పేరున్నందుకు ప్రభుత్వం నుంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టగల అవకాశం కల్పించారు. వారు వ్యవసాయం మీద ఆధారపడకపోయినా, ఇతర, ఇతోధిక ఆదాయమార్గాలున్నా, చివరికి విదేశాలలో ఉన్నా, కేవలం పట్టాదార్లుగా పేరున్నందుకు భూయజమానులు రైతు బంధు భోంచేశారు. వాస్తవంగా ఆ భూమి మీద సాగు చేస్తున్న కౌలుదార్లకు ఎక్కడా పేరు కూడా లేకుండా పోయింది. 2011 చట్టం ప్రకారం రావలసిన గుర్తింపు కార్డు రాలేదు. నిజమైన సాగుదార్లు వారే అయినప్పటికీ, కాగితాల మీద వారి పేరు లేకపోవడంతో బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు అందలేదు. అందువల్ల వారు మితిమీరిన వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేయవలసి వచ్చింది. వారి పేరు ఎక్కడా లేకపోవడంతో వారి పంటలకు బీమా సౌకర్యం దొరకలేదు. ఈ కారణాలు కౌలురైతుల ఆత్మహత్యలకు దారి తీశాయి. తెలంగాణలో జరిగిన మొత్తం రైతుల ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవే.

“2011 చట్టం ప్రకారం రావలసిన గుర్తింపు కార్డు రాలేదు. నిజమైన సాగుదార్లు వారే అయినప్పటికీ, కాగితాల మీద వారి పేరు లేకపోవడంతో బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు అందలేదు. అందువల్ల వారు మితిమీరిన వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేయవలసి వచ్చింది. వారి పేరు ఎక్కడా లేకపోవడంతో వారి పంటలకు బీమా సౌకర్యం దొరకలేదు. ఈ కారణాలు కౌలురైతుల ఆత్మహత్యలకు దారి తీశాయి. తెలంగాణలో జరిగిన మొత్తం రైతుల ఆత్మహత్యలలో 80 శాతం కౌలు రైతులవే.”

పహణీలలో, పాస్ పుస్తకాలలో మార్పు కేవలం సాంకేతిక సవరణ కాదు, అది వ్యవసాయ రాజకీయార్థిక నిర్మాణంలో ఒక మలుపు. ఆ మార్పు వల్ల యజమానికి లాభం చేకూరింది. నిజంగా వ్యవసాయోత్పత్తి చేసే వర్గం పక్కకు నెట్టబడింది. డబ్బు భూమి యజమానికి వెళ్తుంది, ఖర్చు, ప్రమాదం,  అనిశ్చితి అన్నీ కౌలు రైతు భుజాల మీద పడుతాయి.

అంటే కౌలు రైతుల సమస్య మూడు స్థాయిల్లో తీవ్రతరమైంది. మొదటిది, గుర్తింపు లేకపోవడం. చట్టబద్ధంగా, పరిపాలనా రికార్డుల్లో లేకపోవడం. రెండవది, ఆర్థిక నిర్బంధం. భూమి హక్కులు లేకపోవడంతో బ్యాంకు రుణాలు దొరకవు; వ్యక్తిగత అప్పులపై ఆధారపడాల్సి వస్తుంది. మూడవది, ప్రమాదం మొత్తాన్ని మోయడం. పంట విఫలమైతే, ధరలు పడిపోతే, ప్రకృతి వైపరీత్యం వచ్చినా, భూమి యజమానికి కనీసం స్థిర ఆదాయం (కౌలు) ఉంటుంది; కాని కౌలు రైతు పూర్తిగా నష్టపోతారు.

ఆ స్థితిని మార్చి, కౌలుదార్లకు, వాస్తవ సాగుదార్లకు చట్టప్రకారం తగిన గుర్తింపు కార్డు ఇస్తామని, బ్యాంకు రుణం, పంట బీమా, తదితర సౌకర్యాలు కల్పిస్తామని, రైతు భరోసా కూడా కౌలుదార్లకే ఇస్తామని చేసిన వాగ్దానాలన్నిటినీ ఇప్పుడు కాంగ్రెస్ తుంగలో తొక్కింది. ఇది రాజకీయ వంచన సమస్య మాత్రమే కాదు, తెలంగాణ గ్రామీణ, వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన ప్రజా సమూహపు జీవన్మరణ సమస్య.

తెలంగాణ వ్యవసాయంలో గణనీయమైన స్థాయిలో భూ యాజమాన్యం ఒకరిదిగా, వాస్తవంగా సాగు చేస్తున్నవారు మరొకరుగా ఉన్న స్థితి ఉంది. ఈ విరోధాభాసం కొత్తది కాదు గాని ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ విధానాలు, సామాజిక మార్పులు, వ్యవసాయ ఉత్పాదకత, వ్యవసాయ గిట్టుబాటు సమస్య, భూసంరక్షణ వ్యవస్థలో జరిగిన మార్పులు ఈ వైరుధ్యాన్ని మరింత తీవ్రంగా, స్పష్టంగా చూపుతున్నాయి. గ్రామసీమలలో గతంలో పెద్ద కమతాల భూయజమానులుగా ఉండిన కుటుంబాల నుంచి విద్య వల్ల, ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల, అభిరుచుల వల్ల అనేక మంది పట్టణాలకు, విదేశాలకు తరలివెళ్లారు, అక్కడే స్థిరపడ్డారు. వారిలో చాలామందికి వ్యవసాయంతో సంబంధమే లేదు. వారికి ఇతరేతరమైన ఆదాయవనరులు పెరిగినప్పటికీ, మన సమాజంలో భూయాజమాన్యానికి ఉన్న ప్రాధాన్యత వల్ల ఆ భూమిని అలాగే తమ పేరు మీదనే ఉంచుకోదలచుకున్నారు. కాని ఆ భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నవారి చేతుల్లో ఉంది. అలాగే, చిన్న కమతాల వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల, అనేక మంది చిన్న, సన్నకారు రైతులు తమ ఒకటి రెండు ఎకరాలకు తోడు, మరొకటి రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని చేయవలసి వస్తున్నది. అలా భూమి కౌలుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు, కౌలుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మన గ్ర్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్నారు. వీరికి తోడు, ఎక్కడో ఒకచోట ఏదో ఒకస్థాయిలో, భూమిలేని నిరుపేదలు కూడా కౌలుకు తీసుకుని వాస్తవ సాగుదారులుగా మారుతున్నారు.

పాత వ్యవస్థలో ఉన్న లోపాలు వేరే విషయం. కాని కనీసం భూమిని ఎవరు సాగు చేస్తున్నారు అనే ప్రశ్నకు ఒక పరిపాలనా గుర్తింపు ఉండేది. అది సంపూర్ణ రక్షణ ఇవ్వకపోయినా, బ్యాంకు రుణాలు, పంట బీమా, పంట నష్టపరిహారం, కొంతమేర ప్రభుత్వ సహాయం వంటి విషయాల్లో ఒక ఆధారం అందేది. ఆ కాలమ్ తొలగించబడిన తర్వాత, భూమి యజమాని మాత్రమే ప్రభుత్వ కళ్లలో “రైతులు”గా మిగిలారు. సాగు చేసే కౌలు రైతు— ఎంత విస్తారమైన భూమి సాగు చేసినా, ఎన్ని ఏళ్లుగా సాగుచేసినా — అదృశ్యమైపోయారు. అందువల్లనే కచ్చితమైన గణాంకాలు ఎవరి దగ్గరా అందుబాటులో లేవు గాని, మన సమాజంలో వ్యవసాయం మీద ఆధారపడిన జనాభాలో 30-40 శాతం కౌలుదార్లే అని ఒక అంచనా ఉంది. ఆ లెక్కన ఇరవై ఐదు లక్షల కుటుంబాలు కౌలుదార్లుగా ఉన్నారని ఒక ఉజ్జాయింపు లెక్క. అంటే మన రాష్ట్ర జనాభాలో నాలుగో వంతు, మన గ్రామీణ జనాభాలో మూడో వంతు ప్రజానీకపు సమస్య ఇది. ఇంత పెద్ద సమస్య అయినా ఇది ఎవరికీ పట్టని సమస్య అయిపోయింది.

“చట్టపరమైన సంక్లిష్టతను కారణంగా చూపుతూ సమస్యను వాయిదా వేయడం, సమస్యను మరింత జటిలం చేయడమే అవుతుంది. వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడేటప్పుడు, రైతుల ఆత్మహత్యలు, అప్పులు, మార్కెట్ అస్థిరత గురించి చర్చ జరుగుతుంది. కాని ఆ వ్యవసాయ సంక్షోభంలో మూడో వంతును భరిస్తున్న కౌలు రైతుల గురించి మాట్లాడరు. అత్యంత రక్షణలేని స్థితిలో ఉన్న కౌలు రైతు గురించి మాట్లాడరు. అలా మాట్లాడకపోవడానికి ఒక ప్రధాన కారణం పరిపాలనా గుర్తింపు లేకపోవడం కూడా. కనుక 2011 భూఅధీకృత సాగుదారుల చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని గట్టిగా అడగవలసి ఉంది. కౌలు రైతులు అడుగుతూనే ఉన్నారు. సమాజం తన గొంతు కలపవలసి ఉంది.”

ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల సమయంలో కౌలు రైతుల గుర్తింపును పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన హామీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భూ రికార్డుల్లో “సాగుదారు” కాలమ్‌ను తిరిగి తీసుకురావడం, నిజంగా భూమిని సాగు చేస్తున్న వారిని గుర్తించడం, వారికి నేరుగా సంక్షేమం అందించడం—ఇవి కేవలం పరిపాలనా మార్పులు కాదు; ఇవి వ్యవసాయ న్యాయానికి సంబంధించిన ప్రశ్నలు. వ్యవసాయంలో సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్నలు. రెండున్నర సంవత్సరాల్లో కొత్త చట్టప్రతిపాదనలు వినిపించాయి, డేటా సేకరణ కార్యక్రమాలు మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. కాని జరగవలసిన మార్పులేవీ జరగలేదు.

ఎందుకు ఈ ఆలస్యం? స్పష్టంగా కనిపించే కారణాలు ఏమంటే, పాలకులకు భూస్వాముల, భూయజమానుల ప్రయోజనాల మీద ఉన్న శ్రద్ధ నిజమైన సాగుదార్ల మీద లేదు. ఒకసారి కౌలు రైతులకు అధికారిక గుర్తింపు ఇస్తే, వారి హక్కుల గురించి, రక్షణ గురించి, సంక్షేమ భాగస్వామ్యం గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది ప్రస్తుత భూయాజమాన్య ఆధారిత వ్యవస్థకు సవాల్ అవుతుంది. భూస్వామ్యం రద్దయిపోయిందని చాలా మంది అంటుంటారు గాని, కౌలుదారుల గుర్తింపును అడ్డుకోవడంలో పనిచేస్తున్న శక్తులేవో గుర్తిస్తే భూస్వామ్యం ఉందో లేదో అర్థమవుతుంది.

చట్టపరమైన సంక్లిష్టతను కారణంగా చూపుతూ సమస్యను వాయిదా వేయడం, సమస్యను మరింత జటిలం చేయడమే అవుతుంది. వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడేటప్పుడు, రైతుల ఆత్మహత్యలు, అప్పులు, మార్కెట్ అస్థిరత గురించి చర్చ జరుగుతుంది. కాని ఆ వ్యవసాయ సంక్షోభంలో మూడో వంతును భరిస్తున్న కౌలు రైతుల గురించి మాట్లాడరు. అత్యంత రక్షణలేని స్థితిలో ఉన్న కౌలు రైతు గురించి మాట్లాడరు. అలా మాట్లాడకపోవడానికి ఒక ప్రధాన కారణం పరిపాలనా గుర్తింపు లేకపోవడం కూడా. కనుక 2011 భూఅధీకృత సాగుదారుల చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని గట్టిగా అడగవలసి ఉంది. కౌలు రైతులు అడుగుతూనే ఉన్నారు. సమాజం తన గొంతు కలపవలసి ఉంది.

కౌలు రైతుల ప్రశ్నను మళ్లీ చర్చనీయాంశం చేయవలసి ఉంది. భూ రికార్డుల్లో సాగుదారును నమోదు చేయడం, కౌలు ఒప్పందాలకు కనీస చట్టబద్ధత ఇవ్వడం, బ్యాంకు రుణాలకు, బీమాకు అవకాశం కల్పించడం, సంక్షేమ పథకాలను సాగుదారుకు అనుసంధానం చేయడం—ఇవి తక్షణ చర్యలుగా చూడాలి. ఇది కేవలం ఒక వర్గానికి న్యాయం చేయడం మాత్రమే కాదు; ఇది మొత్తం వ్యవసాయ వ్యవస్థను వాస్తవానికి దగ్గర చేయడం.

చివరగా, మౌలికమైన ప్రశ్న: రైతు అంటే ఎవరు? భూమి యజమానా, లేక భూమిని సాగుచేసే వారా? ఈ ప్రశ్నకు సమాధానం మన విధానాలను నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు కాగితం మీది పేరును గుర్తిస్తున్నారు. నేల మీద చెమట చిందించిన మనిషిని ఏం చేస్తారు? ఈ అంతరాన్ని పూడ్చకుండా, తెలంగాణ వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం, పరిష్కరించడం కూడా సాధ్యం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *