’ఆపరేషన్ సిందూర్‘పై పాక్‌కు స్పష్టం చేసిన రాజ్‌నాథ్‌సింగ్
బీజింగ్, జూన్ 26: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం తమ హక్కు అని పాకిస్థాన్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తేల్చిచెప్పారు. చైనాలో గురువారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) సమావేశంలో సభ్య దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు పాల్గొనగా ఈ సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలకు ఊతం ఇచ్చేలా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. ఈ సదస్సు 27వ తేదీతో ముగియనుంది. పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఆయన ఖండిరచారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయన్నారు. అందులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తరహా విధానాలకు స్థానం లేదంటూ ఎస్‌సీవో సభ్య దేశాలకు ఆయన స్పష్టం చేశారు. అలాంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకుండా ఖండిరచాలని ఆయా సభ్య దేశాలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్ చర్యలు చేపట్టిందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము ఎంత మాత్రం వెనకాడబోమన్నారు. మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది.. ఆ దాడుల లక్ష్యం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా సభ్య దేశాలకు వివరించారు. యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించేందుకు భారత్ సానుకూల చర్యలు చేపట్టిందన్నారు. భారతదేశం అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై మండలి సంయుక్త ప్రకటన విడుదల చేయడం ఈ సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.