( మండువ రవీందర్‌రావు )
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నది. చాలాకాలంగా ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం వున్నట్లుగా భావిస్తున్నది. మరింత ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోగా దీనిపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల రాష్ట్రమంత్రులు ఒకరితర్వాత ఒకరు దీనిపై ప్రకటనలు చేస్తున్నతీరును బట్టి చూస్తే చాలా తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తున్నది.
దాదాపు పదహారు నెలలుగా పెండింగ్ లో ఉన్న మంత్రి వర్గాన్ని విస్తరించడం ఒకటైతే, మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారికి మంత్రులకు సమానహోదా కల్పించే పదవులు ఇచ్చే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. అలాగే సంస్థాగత పదవులనుకూడా త్వరలో భర్తీచేసే ఆలోచనలోఉంది. ఈ ప్రక్రియ అంతా స్థానిక ఎన్నికలకు ఉపకరిస్తుందని ప్రభుత్వ ఆలోచన. కార్యకర్తలను అలర్ట్ చేసేందుకే మంత్రులు తమ ప్రకటనలద్వారా సంకేతాలు పంపిస్తున్నట్లుగా భావిస్తున్నారు. తాజాగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, పంచాయితీరాజ్, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
బహుశా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ రావచ్చని పేర్కొన్న శ్రీనివాసరెడ్డి, ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, కార్యకర్తలు తమ విభేదాలను విడనాడి కాంగ్రెస్‌ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపిచ్చారు. వాస్తవానికి ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని గత కేబినెట్ సమావేశం నిర్ణయించినప్పటికీ అనివార్య పరిస్థితులదృష్ట్యా అది సాధ్యంకాలేదు. అయితే ఇప్పుడు సమయం తక్కువగా ఉండటంవల్ల ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలచేస్తే, వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మొదటిదశలో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను నిర్వహించి, ఆతర్వాత పంచాయితీ ఎన్నికలు జరుపాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. చివరగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారు.
అయితే బిసీల రిజర్వేషన్ వ్యవహారం తేల్చకుండానే స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని బిఆర్‌ఎస్ ప్రశ్నిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన కులగణన అమలు విషయం ఎటూ తేలకుండా ఈ ఎన్నికల్లో జరిగే ప్రయోజనం శూన్యమని అంటోంది. దీనిపై ఆ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ తీవ్రంగా స్పందించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఎటూ తేలకుండానే మంత్రులు స్థానిక ఎన్నికలపై వరుస ప్రకటనలు చేయడాన్ని ఆయన తీవ్రంగా విభేదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉందంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదన్నారు. కేంద్రం ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే తేల్చేపరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితిలో రాష్ట్రం స్ధానిక ఎన్నికలకు ఎలా వెళ్తుందంటున్నారు.
42శాతం బీసీ రిజర్వేషన్‌లు అమలవుతే అనేక మంది బీసీలు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం లభింస్తుందనుకున్నారు. ఈ ఎన్నికలపై ఆశలు పెంచుకున్నారు. గత సంవత్సరం జనవరి నెలలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసినప్పటినుండి వివిధ పార్టీల్లో ఉన్న బీసీ వర్గాలు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనేఉన్నారు. ఈసారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అందుకు ముందస్తుగానే తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్ల జాబితాతోపాటు ఇతర ఏర్పాట్లను ఇప్పటికే సిద్దంచేసి పెట్టింది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యం. అయితే ఈలోగానే రిజర్వేషన్ల అంశం తేలిపోతుందనుకున్నారు. ఇదిలాఉంటే సోమవారం సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. తేదీలనుకూడా ప్రకటించే అవకాశముంది. అయితే మంత్రివర్గ సమావేశానికన్నా ముందే మంత్రులు ఎన్నికల విషయంలో ప్రకటన చేయడాన్ని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రులు తమ శాఖలో తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోరాదని పేర్కొనడం గమనార్హం.





