ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్

“ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇది మరోసారి వోట్ల చోరీకి నిదర్శన మవుతుందని రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తిరస్కరిస్తూ భారత ఎన్నికల సంఘం ఐదు అంశాల ఖండనతో స్పందించింది. “రాహుల్ గాంధీ తప్పుగా భావించినట్లుగా” ఆన్‌లైన్‌లో ఏ వోట్లను తొలగించలేమని పోల్ ప్యానెల్ తెలిపింది. పోర్టల్‌లు మరియు యాప్‌లు దరఖాస్తులను దాఖలు చేయడానికి మాత్రమే అనుమతిస్తాయి, ఆపై అవి పరిశీలనకు గురవుతాయి. ఈ సమాధానం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డి కోసం అన్నట్టు ఉంది ఈసీ ధోరణి.”

శతకోటి దరిద్రులకు అనంతకోటి ఉపాయాలు. వడ్డించే వాడు మనోడైతే ఎక్కడ కూర్చుంటే ఏముంది ? కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ “ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన” వారిని రక్షించారని ఆరోపించారు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మద్దతుదారుల వోట్లను క్రమపద్ధతిలో తొలగించారని చెప్పడానికి కర్ణాటక అలంద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి డేటాను ఉదహరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో వోట్లను తొలగించడానికి జరిగిన ప్రయత్నాల వివరాలను రాహుల్ గాంధీ ఉదహరించారు. ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి మోసపూరితంగా వోటర్లను జోడించారని ఆయన మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గం ఉదాహరణను కూడా ఇచ్చారు.“అదే వ్యవస్థ ఇలా చేస్తోంది. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది అని తూర్పారబట్టారు.

వోటు చోరీ అంశంపై కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ వెనక్కి తగ్గటం లేదు. వోటర్ల పేర్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై పడిన అణుబాంబు అని ఆయన అన్నారు. వోటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించబడిన వ్యక్తులను ఆయన మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇది కేవలం వోట్ల జాబితా సమస్య కాదనీ, లక్షలాది మంది వోటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చింది, ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
భారతదేశంలో వోటర్ల తొలగింపు ప్రక్రియ ఏమిటి? రాహుల్ గాంధీ ఆరోపించినట్లుగా సాఫ్ట్‌వేర్ నిజంగా వోట్లను తొలగించగలదా? ఫారమ్ 7 దరఖాస్తులు, స్క్రూటినీ, బూత్ లెవెల్ అధికారుల గ్రౌండ్ వెరిఫికేషన్ మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తుది ఉత్తర్వు ద్వారా మాత్రమే పేర్లు తొలగించవచ్చు. ఏదైనా తొలగింపును ఆమోదించే ముందు వోటరు మరియు దరఖాస్తుదారు ఇద్దరికీ ఫిర్యాదు చేసే హక్కు ఉంది.
వివిధ రాష్ట్రాల్లో వోట్ల తొలగింపు ప్రక్రియ దశాబ్ద కాలం నుంచి పద్దతి ప్రకారం జరుగుతూ ఉన్నది.

కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, బీహార్‌ల్లో వోట్ల తొలగించారని ఆయన అన్నారు. ఒక్క కర్నాటకలోని ఆలంద్‌ నియోజకవర్గంలో 6,018 వోట్లను నకిలీ లాగిన్‌, ఫోన్‌ నెంబర్లను ఉపయోగించి తొలగించారని తెలిపారు. 14 నిమిషాల్లో 12 మంది వోటర్లను తొలగించారని ఆరోపించిన సూర్యకంత్‌ అనే వ్యక్తిని రాహుల్‌ గాంధీ ఉదహరించారు. ”తొలగించిన” వోటర్లలో ఒకరైన బాబిటా చౌదరిని వేదికపైకి తీసుకువచ్చారు. నాగరాజ్‌ అనే వ్యక్తి ఉదయం 4:07 వద్ద కేవలం 38 సెకన్లలో రెండు డిలెట్‌ అప్లికేషన్లు నింపాడని, ఇది ”మానవీయంగా అసాధ్యం” అని రాహుల్‌ గాంధీ అన్నారు. మహారాష్ట్రకు చెందిన రాజురా అసెంబ్లీలో నకిలీ వోటర్ల చేర్పులను వివరించారు, విచిత్రమైన ఎంట్రీలతో ఈ వోటర్ల చేర్పులు జరిగాయి.

అందులో ఒకటి వోటరు పేరు: ”వైయూహెచ్‌ యూక్యూజేజేడబ్ల్యూ”, చిరునామా : ”షష్టి, షష్టి” అని రాహుల్‌ గాంధీ ఉదహరించారు. ఈ ప్రక్రియలో దుండగులు సాఫ్ట్‌వేర్‌ను హైజాక్‌ చేశారని తెలిపారు. నకిలీ అప్లికేషన్‌లు, తప్పుడు ఫోన్‌ నంబర్లు ఉపయోగించి వోట్ల తొలగింపునకు అప్పీల్‌ చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించే అవకాశమున్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ వోట్ల తొలగింపు జరిగిందని రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ చర్యలు తమ పార్టీని బలహీనపరచడానికి జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ అలాంటి ప్రజాస్వామ్య విధ్వంసకులను రక్షిస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

వోట్ల మోసంపై వంద శాతం ఆధారాలున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కర్నాటకలో వోట్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కొన్ని ఆధారాలను రాహుల్‌ గాంధీ చూపించారు. కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ మోసం జరిగిందని, గోదాబారు పేరుతో ఫేక్‌ లాగిన్‌ ఉపయోగించి 12 వోట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. వోట్ల తొలగింపు కోసం ఆటోమేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఉపయోగించారని, ప్రతి బూత్‌లో మొదటి వోటరును దరఖాస్తుదారుగా చూపేలా చేశారని వెల్లడించారు. ఎక్కువ వోట్లు తొలగించిన టాప్‌ 10 బూత్‌లన్నీ కాంగ్రెస్‌ పార్టీ బలమైన ప్రాంతాల్లో ఉన్న చోటనే జరిగాయని రాహుల్‌ తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెద్దఎత్తున వోటర్లను జాబితా నుంచి తొలగించారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ తొలగింపులు వ్యక్తుల ద్వారా కాకుండా, ఓ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి జరిగిందన్నారు. ప్రతి బూత్‌లో మొదటి పేరును ఆ ఆటోమేటెడ్‌ ప్రోగ్రాం తీసుకుని తొలగించేలా రూపొందించారని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంతాల ఫోన్లు ఉపయోగించి ఓటీపీతో అప్లికేషన్ దాఖలు చేసినట్లు ఆయన ఆరోపించారు. వీటి గురించి కర్నాటకలో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఈసీకి తెలిపినా పట్టించుకోలేదన్నారు. వోట్ల తొలగింపునకు సంబంధించి 18 సార్లు ఈసీని కోరినప్పటికి శ్రద్ధ వహించలేదు.

ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇది మరోసారి వోట్ల చోరీకి నిదర్శనమవుతుందని రాహుల్‌ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను తిరస్కరిస్తూ భారత ఎన్నికల సంఘం ఐదు అంశాల ఖండనతో స్పందించింది. “రాహుల్ గాంధీ తప్పుగా భావించినట్లుగా” ఆన్‌లైన్‌లో ఏ వోట్లను తొలగించలేమని పోల్ ప్యానెల్ తెలిపింది. పోర్టల్‌లు మరియు యాప్‌లు దరఖాస్తులను దాఖలు చేయడానికి మాత్రమే అనుమతిస్తాయి, ఆపై అవి పరిశీలనకు గురవుతాయి. ఈ సమాధానం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డి కోసం అన్నట్టు ఉంది ఈసీ ధోరణి.

డా. యం. సురేష్ బాబు. 
 9989988912

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *