రేవంత్ బాబు మధ్య సాన్నిహిత్యమే మరింత చిచ్చు రేపుతోందా?

“ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త ఉద్యమానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అంతేకాదు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటంలో బిజెపి ఘోరంగా విఫలమైందని దానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని కూడా పిలువు ఇచ్చారు. మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్లోనే కాకుండా అపరిష్కృత సమస్యలు సుదూరంలో పరిష్కారమయ్యే అవకాశాలు సన్నగిల్లాయి. దీనికి తోడు ఎన్టీఆర్ రోశయ్య యస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహాల కథాకమామీషు మరింత ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది . తెలంగాణ సెంట్ మెంట్ రగిలే అవకాశముంది. కెసిఆర్ ఆంధ్రోళ్ల వ్యతిరేక ఉద్యమం తీవ్రత పెంచే కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మేరకు కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పట్లో సాన్నిహిత్యం నెలకొనడం కనుచూపు మేర లేదు.”
తెలంగాణలో రేవంత్ రెడ్డి.. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులైన పూర్వ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలే కాకుండా ఇతర అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సానుకూలత ఏర్పడుతుందని ఆంధ్ర ప్రదేశ్ లో చాలామంది ఆశించారు. ఎందుకంటే కెసిఆర్ హయాంలో ఒకరికొకరు ఎదురు పడేవారు కాదు. ఏదైనా అనివార్యమైనా పలుకరించుకొనే వారు అంతకన్నా కాదు. కాని రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్య ఆ పరిస్థితి లేదు. ఏవైనా సభలు సమావేశాల సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు పలుకరించుకోవడమే కాకుండా కలుపుగోలు తనంగా వ్యవహరిస్తున్నారు. ఈ సాన్నిహిత్యమే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మరింత జఠిలం చేస్తున్నది.
    తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాలనను రేవంత్ రెడ్డి ప్రవేశ పెడుతున్నాడనే ప్రచారం బిఆర్ఎస్  పార్టీ విజయవంతంగా సాగిస్తోంది. పైగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిడిపి లో చంద్రబాబు నాయుడు కింద పని చేసి ఉండటం ఇందుకు అగ్నికి వాయువు తోడైనట్లవుతోంది. ఫలితంగా అప్పుడప్పుడు ఏదైన సభలు సమావేశాల సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకొన్నా రెండు రాష్ట్రాల మధ్య గల వివాదాల గురించి ప్రస్తావించే అవకాశం లేక పోగా రోజు రోజుకు మరింతగా బిగుసుకొంటోంది. ఆంధ్ర ప్రదేశ్ అనుకూల వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గైకొంటున్నాడని బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం పెంచే కొద్దీ మరింత కఠిన వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గైకొంటున్నాడు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో తాను రాజీ పడే ప్రశ్న లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బనకచర్ల అనుసంధాన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిలువరించ గలిగింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రెడిట్టే.
    వీటన్నింటికల్లా ముఖ్యమైన మరో పరిణామం సంభవించింది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో దిల్లీ లో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య గల జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేందుకు అంగీకరించారు. ఈ సమావేశం జరిగిన వెంటనే బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేయగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలు గడుస్తున్నా తెలంగాణ తరఫున ప్రతి నిధుల పేర్లు ఇచ్చేందుకు సిద్ధపడలేదు. ఈ సంఘటనతో రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులకు తెర పడింది. విషాదమేమంటే కెసిఆర్ హయాంలో ఉప్పు నిప్పుగా ఉండి  సామరస్యానికి అవకాశం లేక పోగా ఇప్పుడు ముఖ్యమంత్రుల మధ్య సాన్నిహిత్యం ఉన్నా  అంతిమంగా అదే అడ్డంకిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవంలో నదీ జలాలను బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించునట్లు ఆంధ్ర ప్రదేశ్ దోచుకున్న సందర్భం లేదు. ఈ రెండేళ్లు వరదలు వెల్లుతున్నాయి. వందల్లో కాదు వేల సంఖ్యలో టీఎంసీలు నీళ్లు సముద్రం పాలౌతున్నాయి. వరద నీటిని కొంత ఒడిసి పట్టుకొంటే వందలాది టీఎంసీలు నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ దోచుకున్నదనే ప్రచారం మాత్రం తెలంగాణ లో భేషుగ్గా జరిగింది. ఒక వేళ ఆ నీటిని ఆంధ్ర ప్రదేశ్ మళ్లించకున్నా సముద్రం పాలయ్యేటివి.
    తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల అనుసంధానం అడ్డుకోవడమే కాకుండా ప్రస్తుతం తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన పథకాన్ని వ్యతిరేకించింది. బనకచర్ల అనుసంధానానికి పోలవరం నల్లమల సాగర్ మారు రూపమని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకానికి అనుమతి ఇవ్వ వద్దని కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వాసం లోనికి తీసుకోకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టే సన్నాహాల్లో కూడా ఉంది . ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల స్థాయి లో ఇసుము తెరలు దించబడ్డాయి. ఇంత వరకు ఆంధ ప్రదేశ్ కు రేవంత్ రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్ నదీజలాలను దోచుకుంటున్నదని బిఆర్ఎస్ నేత హరీష్ రావు తో పాటు ఇతర నేతలు ప్రచారం చేసే వారు.
    ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త ఉద్యమానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అంతేకాదు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటంలో బిజెపి ఘోరంగా విఫలమైందని దానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉందని కూడా పిలువు ఇచ్చారు. బహుశా సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వైఫల్యం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు కెసిఆర్ ఈ వైఖరి తీసుకున్నారని భావించే అవకాశం ఉంది .కాని వాస్తవంలో నదీ జలాల అంశంలో బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం తీవ్రతరం చేసే అవకాశం ఉంది. గతంలోనే ఒకమారు కెసిఆర్ ఎన్నికల వరకు బనకచర్ల అనుసంధానం విషయం కొనసాగించాలని కోరిన సందర్భముంది. మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్లోనే కాకుండా అపరిష్కృత సమస్యలు సుదూరంలో పరిష్కారమయ్యే అవకాశాలు సన్నగిల్లాయి. దీనికి తోడు ఎన్టీఆర్ రోశయ్య యస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహాల కథాకమామీషు మరింత ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది . తెలంగాణ సెంట్ మెంట్ రగిలే అవకాశముంది. కెసిఆర్ ఆంధ్రోళ్ల వ్యతిరేక ఉద్యమం తీవ్రత పెంచే కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మేరకు కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పట్లో సాన్నిహిత్యం నెలకొనడం కనుచూపు మేర లేదు.
 -వి. శంకరయ్య 
విశ్రాంత పాత్రికేయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *