“ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది ఉద్యోగులు, సదుపాయాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలను మించిన సామాజిక సమస్య. తోటి మనుషుల పట్ల మన స్పందనలు మానవీయంగా, సానుభూతితో, దయతో ఉంటున్నాయా లేదా అనే సమస్య.”
హైకోర్టు ఎన్నో మొట్టికాయలు వేసి, చిట్టచివరి గడువు విధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు న్యాయంగా అందవలసిన విరమణ ఫలాలను ఇవ్వడానికి పూనుకుంటున్నది. గత రెండు సంవత్సరాలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏప్రిల్ 9 లోపు అందజేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు మార్చ్ 23న ఇచ్చిన ఆదేశం నిన్నా ఇవాళా అమలవుతున్నదని వార్తలు వస్తున్నాయి. తమ సమస్యను హైకోర్టుకు ఫిర్యాదు చేసిన వేలాది మంది ఉద్యోగులలో కొన్ని వందల మందికి ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది సి ఆర్ సుకుమార్ తన కక్షిదారులలో కొందరికి ప్రభుత్వం నుంచి ఆ బెనిఫిట్స్ అందాయని బుధవారం ప్రకటించారు.
అయితే ప్రభుత్వోద్యోగులకు రిటైరైన వెంటనే అందవలసిన సదుపాయాలకు రెండు సంవత్సరాలు వేచిచూడవలసి రావడం, ఆ సదుపాయాలు ఇప్పించమని న్యాయస్థానానికి వెళ్లడం, ఇవ్వవలసిందే అని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడడం, మళ్లీ ఆ ఫిర్యాదులను విన్న హైకోర్టు చివరికి తుది గడువు విధించడం, ఆ గడువు లోపల కూడా ప్రభుత్వం అందరికీ కాక, న్యాయస్థానానికి వెళ్లినవారికి మాత్రమే చెల్లిస్తుండడం – అసలు మన వ్యవస్థ సక్రమంగా సరే, మానవీయంగా, నాగరికంగా నడుస్తున్నదా అని అనుమానించవలసి వస్తున్నది.
ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది ఉద్యోగులు, సదుపాయాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలను మించిన సామాజిక సమస్య. తోటి మనుషుల పట్ల మన స్పందనలు మానవీయంగా, సానుభూతితో, దయతో ఉంటున్నాయా లేదా అనే సమస్య.
“ఇలా నెలలూ సంవత్సరాలూ గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందనివారిలో 3,600 మంది తమకు న్యాయంగా, చట్టబద్ధంగా దక్కవలసిన సదుపాయాల కోసం కోర్టుకు వెళ్లారు. వారి తరఫున కొన్ని వందల రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వారికి రావలసిన బెనిఫిట్స్ అన్నీ ఆరు నుంచి ఎనిమిది వారాలలోపు చెల్లించాలని ఏడాది కింద హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఆ ఆదేశాన్ని పట్టించుకోలేదు. దాని మీద ప్రభుత్వం కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతున్నదని ఆరువందలకు పైగా పిటిషన్లు కోర్టుకు దాఖలయ్యాయి. ప్రభుత్వానికి తెలిసిన ఏకైక విద్య తాత్సారం గనుక, ఆ పిటిషన్ల మీద వాయిదాల మీద వాయిదాలు తీసుకుని ఆరేడు నెలలు గడిపారు. చివరికి మార్చ్ 23న న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి బోనెక్కవలసిందేనన్నారు.”
వృద్ధాప్యం ఎవరికైనా ఒక శాపం. ప్రతి మనిషి జీవితంలోనూ అది ఒక తప్పనిసరి అంకమే అయినప్పటికీ కొనసాగుతున్న సామాజిక విలువల ప్రకారం వర్తమాన తరం మనుషులు వృద్ధులను గతంగా చూసి చిన్నచూపు చూస్తూ, ఈసడిస్తూ ఉంటారు. వృద్ధులను వయసు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు తమ పట్ల ఇతరుల నిరాదరణ, విస్మరణ ప్రతిక్షణం ఇబ్బంది పెడుతుంటాయి. ఒకప్పుడు కుటుంబ పెద్దగా సమర్థమైన ఆర్థిక, సామాజిక నిర్వహణ చేసినవారే ఇప్పుడు ప్రతిదానికీ ఇతరుల ముందర చెయ్యి చాపవలసిన వనరుల కొరతకు గురవుతుంటారు. అయినవాళ్లూ, ఇంతకాలమూ తమ రెక్కల కష్టం మీదనే పెరిగి పెద్దయినవాళ్లూ నాలుగు మెతుకులు విదల్చడానికి, ఒక మంచి మాట మాట్లాడడానికి కూడా చీదరించుకుంటుంటారు. బైటికి వెళితే సరైన ప్రయాణ సౌకర్యాలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, ఆదరణ ఉండదు. లిఫ్టులు లేని భవనాలు, ఎక్కలేని మెట్లు, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు లేని స్థలాలు వంటి అనేక సమస్యల వలయంలో చిక్కుకుని బతుకు వెళ్లదీస్తుంటారు. జీవితమంతా కుటుంబాలకూ, బంధుమిత్రులకూ, సమాజానికీ చేసిన సేవలకు తగిన ప్రతిఫలం అటుంచి కనీస మానవీయ స్పర్శ కూడా దక్కని వాళ్లు నూటికి తొంబై మందికి పైనే అంటే అతిశయోక్తి కాదు.
మొత్తంగా సమాజంలో వృద్ధుల పట్ల నిరాదరణ అలా ఉండగా, జీవిత కాలంలో ఏదో ఒక ప్రభుత్వోద్యోగం చేసి, పదవీ విరమణ చేసిన వృద్ధుల సమస్యలు మరొక రకం. రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, కమ్యుటేషన్, ఎరన్డ్ లీవ్, సరెండర్డ్ లీవ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రియింబర్స్ మెంట్ వంటి అనేక విరమణ ఫలాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, విరమణానంతర జీవితంలో నెలనెలా పెన్షన్ పొందే వృద్ధుల స్థితి ఆర్థికంగా కొంత మెరుగే కావచ్చు గాని, ఇతర రకాలుగా అది మరింత దయనీయమైనది. వారికి దొరికే కొద్దిపాటి ఆదరణ కేవలం వారి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. వారి సంతానం ఎంత పెద్దదైతే అంత ఎక్కువ ఆదరణ దొరకకపోగా, అంత ఎక్కువగా వారి ఆదాయం మీద ఒత్తిడి ఉంటుంది.
అసలే ఇటువంటి ఎన్నెన్నో సమస్యలు ఉన్న వృద్ధులకు, అందులోనూ ప్రత్యేకంగా ప్రభుత్వోద్యోగం చేసి, పదవీ విరమణ పొందిన వృద్ధులకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమయానికి అందకపోవడం, పెన్షన్ నిర్ధారణ త్వరగా జరగకపోవడం, పెన్షన్ సరిగా అందకపోవడం, ఆ పనుల కోసం ఆఫీసుల చుట్టూ, ట్రెజరీ చుట్టూ తిరగవలసి రావడం మరిన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. ఇన్ని సమస్యలలో చిక్కుకుని ఉన్న సీనియర్ సిటిజెన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టదలచుకున్నట్టున్నది.
తెలంగాణలో డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పటి నుంచీ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంఖ్య ఎంత అనేదే అధికారిక లెక్క ఏమీ లేదు. మొత్తంగా రిటైరైనవారు 15,000 ఉంటారని ఒక అంచనా ఎక్కువగా వినబడుతున్నది. నిజానికి ఈ రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో రిటైరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఇరవై నుంచి ఇరవై రెండు వేల వరకు ఉండవచ్చు. ఒక్క 2024 సంవత్సరంలోనే 7,995 మంది రిటైరయ్యారని లెక్కలున్నాయి. తర్వాతి సంవత్సరంలో దాదాపు పది వేల మంది రిటైరయ్యారు. ప్రతి నెలా 800-1000 మంది రిటైరవుతుంటారని ఒక ఉజ్జాయింపు లెక్క ఉంది. అప్పటి ప్రభుత్వం 2021లో రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలకు పెంచడంతో 2021-23 మధ్య రిటైర్ అయినవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. మళ్లీ 2024 నుంచి క్రమంగా అది పెరగడం మొదలయింది. ఈ వేరు వేరు లెక్కలన్నీ కలిపి పరిశీలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇరవై వేల మందికి పైగానే రిటైరయి ఉంటారని చెప్పవచ్చు.
అందులో 30 శాతం మందికి మాత్రమే ఒకటి రెండు నెలల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాయని, 60-80 శాతం మందికి నెలలూ సంవత్సరాలూ గడిచినా అతీగతీ లేదని, మిగిలిన కేసులు న్యాయస్థానాల వివాదాల్లో చిక్కుకుని ఉన్నాయని అంటున్నారు. రిటైరైన తర్వాత బెనిఫిట్స్ లెక్కల కోసం, వాయిదాల పద్ధతిలో ఒక్కొక్కటీ పొందడం కోసం ఎన్ని నెలలు, సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిరగవలసి వస్తున్నదో మాజీ ఉద్యోగులు చెపుతున్నారు. అయితే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమయానికి అందకపోవడం అనే జబ్బు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కాదని, గత ప్రభుత్వంలో కూడా ఉండిందని, 2017లో రిటైరై, ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య మరింత విస్తృతంగా, మరింత జటిలంగా మారింది.
ఇలా నెలలూ సంవత్సరాలూ గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందనివారిలో 3,600 మంది తమకు న్యాయంగా, చట్టబద్ధంగా దక్కవలసిన సదుపాయాల కోసం కోర్టుకు వెళ్లారు. వారి తరఫున కొన్ని వందల రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వారికి రావలసిన బెనిఫిట్స్ అన్నీ ఆరు నుంచి ఎనిమిది వారాలలోపు చెల్లించాలని ఏడాది కింద హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఆ ఆదేశాన్ని పట్టించుకోలేదు. దాని మీద ప్రభుత్వం కోర్టు ధిక్కార నేరానికి పాల్పడుతున్నదని ఆరువందలకు పైగా పిటిషన్లు కోర్టుకు దాఖలయ్యాయి. ప్రభుత్వానికి తెలిసిన ఏకైక విద్య తాత్సారం గనుక, ఆ పిటిషన్ల మీద వాయిదాల మీద వాయిదాలు తీసుకుని ఆరేడు నెలలు గడిపారు. చివరికి మార్చ్ 23న న్యాయమూర్తి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి బోనెక్కవలసిందేనన్నారు.
ఆరోజున రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టు ముందు సమర్పించిన వాంగ్మూలంలో 3,656 మంది బకాయిలు చెల్లించవలసి ఉందని, వారిలో 1,056 మందికి చెల్లించామని, ఇంకా 2,600 మందికి చెల్లించాలని అన్నారు. అయితే ఈ అంకెల విషయంలో “ఆ అధికారి కార్యాలయ ఉద్యోగులు ఇచ్చిన నివేదికల ప్రకారం” అని హైకోర్టు ఉత్తర్వులలో ఉంది. అంటే అది వాస్తవికమైన అంకె అవునో కాదో చెప్పడం కాదు, న్యాయస్థానం ముందుకు వచ్చిన అధికారి తన కింది ఉద్యోగులు ఇచ్చిన అంకెను యథాతథంగా చెప్పారు అని ఒక అంకె ఇవ్వడం. మొత్తానికి బాధ్యతను ఆ “కింది ఉద్యోగుల” మీదికి నెట్టేశారన్నమాట. ఇది కచ్చితంగా కాకిలెక్క. మొత్తంగా రిటైరైన వారి సంఖ్య 3,656 కాదు. అది మొత్తం రిటైరైనవారిలో నాలుగో వంతు కూడా కాదు. అది బహుశా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేసిన ఉద్యోగుల సంఖ్య అయి ఉంటుంది. మరి ఫిర్యాదు చెయ్యనివారి గతి ఏమిటి?
పద్ధతి ప్రకారం ఏ ఉద్యోగికైనా వారి పదవీకాలం చివరిరోజున గాని, మూడు నాలుగు వారాల్లో గాని వారికి రావలసినదంతా లెక్క తేల్చి ముట్టజెప్పడం ప్రభుత్వ బాధ్యత, మర్యాద. కాని ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల అండదండలున్నవారికి తప్ప మరెవరికీ ఆ మర్యాద దక్కడం లేదు. అలా నెలకు 800-1000 మండి రిటైరైతే కొన్ని వందల మందికి కూడా అది జరగడంలేదు. పదవీ విరమణ పొందినవారికి రావలసిన సదుపాయాలన్నీ, రిటైర్మెంట్ బెనిఫిట్సన్నీ ఆరు నెలలలోగా అందాలని ఒకప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఏ ప్రభుత్వమూ పాటించడం లేదు. అసలు లెక్కలు తేల్చడానికే విపరీతమైన ఆలస్యం, ఒక పద్దు డబ్బు విడుదల అయితే మరొక పద్దు విడుదల కాకపోవడం వంటి సమస్యలతో రిటైర్ అయిన ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఈ రెండు సంవత్సరాల్లో కనీసం 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకుండానే మరణించారని ఒక అంచనా.
ఆర్థిక ఇబ్బందులు, తగినన్ని నిధులు లేకపోవడం, వరుస క్రమంలో చెల్లించే ఏర్పాటు చేయడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ భారం విపరీతంగా పెరిగిపోవడం అని ప్రభుత్వం అనేక కారణాలు చెపుతున్నది గాని వాటిలో ఏ ఒక్కటీ పూర్తి సత్యం కాదు. పైగా ఆ భారం తగ్గించుకోవడానికే గత రెండు దశాబ్దాలలో కొత్త పెన్షన్ స్కీమ్ తెచ్చిన ఘనత పాలకులది. ఎలా చూసినా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో చెల్లించవలసిన మొత్తం రు. 10,000 కోట్లు దాటకపోవచ్చు. అంటే బడ్జెట్ లో దాదాపు మూడు శాతం. అది సమకూర్చడం ప్రభుత్వానికి అంత కష్టం కాగూడదు.
వీపు మీద కొట్టు గాని పొట్ట మీద కొట్టకు అని ఒక పాత తెలుగు వివేకాన్ని నింపుకున్న నుడికారం. వీపు మీద కొట్టకుండా ఉండడం రాజ్యానికి ఎప్పుడూ కలలోనైనా ఊహించని విషయం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత కూడా ఉంది. మహా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం ఎట్లాగూ రాష్ట్రంలో ఎందరి వీపుల మీదనో నిరంతరం బాదుతూనే ఉంది. పొట్ట మీద కూడా కొట్టదలచుకున్నట్టుంది. కాని, మరీ కనికరం లేకుండా వృద్ధుల మీద కూడానా?





