తీవ్ర రూపం దాల్చుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. అత్యంత కచ్చితత్వంతో మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అంతేకాకుండా గ్లిలాట్‌లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్‌పైనా క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటే.. దానికి కారణం కచ్చితంగా మొస్సాద్ సంస్థే.. ఇరాన్‌లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి.. కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయెల్‌కు చేరవేసింది. అంతేకాకుండా ముందుగానే ఇరాన్‌కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుకా ఈ సంస్థ హస్తముంది. ఈ నేపథ్యంలోనే మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణి ప్రయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాలకు సమాచారం ఇచ్చిన ఇరాన్.. దాడులు మాత్రం ఆపడం లేదు. ఇరుదేశాల మధ్య మొదలైన ఈ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కెనడాలో జరుగుతున్న జీ-7 సదస్సుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మధ్యలోనే తన పర్యటన ముగించుకొని ఆగమేఘాల మీద అమెరికా పయనమయ్యారు. ఇరాన్ చేపడుతున్న అణుకార్యక్రమానికి నిజమైన ముగింపు ఉండాలని ఆయన చెప్పడం.. యుద్ధం తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఇస్తోంది.





