భారతదేశం తాజాగా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా మారింది. ఇది ఒక పెద్ద ఘనతగా కనిపిస్తున్నప్పటికీ, బియ్యం ఉత్పత్తిలో వొచ్చిన ఈ విపుల వృద్ధి పప్పుదినుసులు , నూనెగింజల సాగును తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రెండింటి పై భారత్ దిగుమతులు ఆధారపడి ఉంటాయి . 2024–25లో భారతదేశం 149 మిలియన్ టన్నులు (మి. ట.) బియ్యం ఉత్పత్తి చేసింది.. ఇది 2019–20తో పోల్చితే 25 శాతం వృద్ధి. ఈ గణాంకాలను మే 30న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మూడవ అంచనా నివేదికలో పేర్కొన్నారు. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, చైనా బియ్యం ఉత్పత్తి 145 మి. టన్నులుగా అంచనా వేయబడింది. అయినప్పటికీ, యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఏ ఓ ) గణాంకాల ప్రకారం, చైనాలో హెక్టేరు దిగుబడి 7.1 టన్నులు, భారత్‌లో అది కేవలం 4.3 టన్నులు మాత్రమే.
ప్రస్తుతం భారతదేశం ప్రపంచ బియ్యం ఎగుమతులలో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ 1.05 లక్షల కోట్లు విలువైన 20 మి. టన్నుల బియ్యం ఎగుమతి చేసింది, ఇది గత ఏడాదితో పోల్చితే 23 శాతం ఎక్కువ. ఇంత ఎక్కువ బియ్యం సాగు చేయడంలో సమస్యలు రెండు.. మద్దతు ధర లభించడం వల్ల రైతులు ఎక్కువగా బియ్యాన్ని సాగుచేస్తున్నారు. పప్పుదినుసులు, నూనెగింజలు వర్షపాతం ఆధారంగా ఉండగా, బియ్యం సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర తో ప్రభుత్వం కొనుగోలు హామీ ఇస్తోంది. పైగా, రైతులకు నీటి సౌకర్యం లభించిన తర్వాత వారు వెంటనే పప్పులు, నూనెగింజల నుంచి బియ్యానికి మారుతున్నారు. ఎందుకంటే వీటికి ఎమ్‌ఎస్‌పీ తక్కువగా ఉంటుంది..బియ్యం సాగుకు నీటి అవసరం ఎక్కువ.. పప్పుదినుసులు, నూనెగింజలతో పోల్చితే 4–5 రెట్లు ఎక్కువ నీరు వినియోగిస్తుంది. నీటి కొరత ఉన్న మన దేశం బియ్యం ఎగుమతుల రూపంలో నీరే ఎగుమతి చేస్తోంది. హర్యానా, పంజాబ్‌ల వంటి రాష్ట్రాల్లో 62–76శాతం భూగర్భ జల ప్రాంతాలు అధిక వినియోగానికి గురయ్యాయి, ఇది దీర్ఘకాలికంగా సాగును అసాధ్యంగా మార్చుతుంది.
2024–25లో, భారత్ రూ.46,428 కోట్లు విలువైన పప్పులను దిగుమతి చేసుకుంది ఇది 49 శాతం ఎక్కువ . అదే సమయంలో వంట నూనెల దిగుమతులు సుమారు రూ 1.5 లక్షల కోట్లు ఈ రెండింటినీ కలిపితే 1.9 లక్షల కోట్ల రూపాయల వ్యయం జరిగింది, ఇది భారత వ్యవసాయ దిగుమతుల మొత్తపు ఖర్చులో 65 శాతం . ఈ మొత్తం భారత్ బియ్యం ఎగుమతుల ద్వారా పొందిన ఆదాయానికి దాదాపు రెట్టింపు..! ఈ వ్యత్యాసం పోషకాహారం పరంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశం తక్కువ ధరతో ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ధాన్యాలపై ఆధారపడటంతో ఆకలి సమస్యను తగ్గించగలిగింది. కానీ దీని వల్ల మన దేశంలో తక్కువ నాణ్యత గల ఆహారపు అలవాట్లు ఏర్పడ్డాయి. ధాన్యాలు భారతీయులలో 50–70 శాతం శక్తి అవసరాలను తీరుస్తున్నాయి. కానీ పప్పులు, ప్రోటీన్లు కేవలం 6–9శాతం మాత్రమే – న్యూట్రిషన్ నిబంధనల ప్రకారం ఇది కనీసం 14% ఉండాలి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, మన ఆహారం 8 ప్రధాన ఆహార పదార్థాల నుంచి సమతుల్యం కావాలి — తాజా కూరగాయలు, పండ్లు, గింజలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు. కానీ నూకలు మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వంటి వ్యాధులు పెరుగుతున్నాయి.