ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ బీసీల‌కు జ‌రిగేది అన్యాయ‌మే!

– జ్యోతిరావు ఫూలే ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం
– బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోస‌గించిన కాంగ్రెస్‌
– అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో అభాసుపాలు
– 42% ప‌ద‌వులు బీసీల‌కు ఇవ్వొచ్చుగా?
– అబ‌ద్ధాల‌తో నెట్టుకొస్తున్న రేవంత్‌
– రాజ్య‌స‌భ స‌భ్యులు డా.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌

మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త ప్రతినబూని ముందుకు సాగాలి. తెలం గాణలో బీసీల పట్ల ఎన్నో దశాబ్దాలుగా అన్యాయాలు, అక్రమాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వారికి న్యాయం జరిగేలా ఏ ముఖ్యమంత్రి కూడా కృషి చేయకపోవడం బాధాకర‌మ‌ని రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ అన్నారు. శుక్ర‌వారం  మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా  ఆయ‌న బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి బీసీల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అలవికాని హామీలు, 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసగించారన్నారు. బీసీలు మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల ప్రకారం సంఘటితమవుతున్నారనే విషయం గ్రహించిన కాంగ్రెస్ పార్టీ, గత ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు గుప్పించి, అధికారం చేపట్టిన తర్వాత మోసం చేసింద‌ని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో 42% కాంట్రాక్టులు బీసీలకు ఇస్తామని, బీసీ సబ్-ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని ప్రకటించారు. జనాభాకు అనుగుణంగా 136 కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి మాటలు చెప్పారు. కానీ చివరికి ఇవన్నీ మోసంగానే మిగిలిపో యాయన్నారు. “తెలంగాణ రోల్ మోడల్” అంటూ చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం -అశాస్త్రీయ సర్వేలు, తూతూ మంత్ర విధానాలు, కోరలు లేని డెడికేషన్ కమిషన్, ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో చేసిన అసంబద్ధ సర్వేలు… ఇవన్నీ చివరికి బీసీలను మోసం చేసే కుట్రగానే మారాయ‌న్నారు. కులగణన, సర్వేలు, కోటా నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోలు… ఇలా వెనుకబడిన వర్గాలను మభ్యపెట్టి, చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో కూడా అభాసుపాలయ్యారు. కోర్టు కేసులకు లక్షల రూపాయలు అడ్వకేట్లకు వెచ్చించారన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో బీసీ ఓట్ల కోసం తెలంగాణలో అశాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్ల పేరిట హడావుడిగా సర్వేలు జరిపారు. ఆ తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిన తీరుకు ప్రజలు చెంపపెట్టు తీర్పు ఇచ్చారు. అక్కడ కూడా కాంగ్రెస్ అభాసుపాలైంది. నెహ్రూ కుటుంబం నుండి రాహుల్ గాంధీ వరకు—కాంగ్రెస్ పార్టీ బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉంద‌న్నారు. కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ నివేదికలను పట్టించుకోకుండా అడ్డుకున్నది కాంగ్రెస్‌నే. బీహార్ ప్రజలు, బీసీలు, ఓబీసీలు కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఆడలేక మద్దెల వోడు అన్నట్లుగా—బిజెపిపై నిందలు వేస్తూ, “మోదీ అడ్డుకుంటున్నారు” అని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బీసీలకు 42% మంత్రి పదవులు ఇవ్వడానికైనా, బీసీ సబ్-ప్లాన్‌కు చట్టబద్ధత ఇవ్వడానికైనా ఎక్కడ కోర్టు అడ్డుపడిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల‌న్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు అప్పనంగా ప్రజాసొమ్ము కట్టబెడుతూ… ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% బీసీలకు ఇవ్వమన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్ర‌శ్నించారు. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గంలో పుట్టిన నరేంద్ర మోదీ అన్ని వర్గాల మద్దతుతో మూడోసారి ప్రధానమంత్రి అయ్యారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో 1988లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. ఇవాళ వాటిని కేవలం 17%కి తగ్గించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2026లో కులగణనతో కూడిన జనగణన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం—గత 55 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పని. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేలా జనగణనతో పాటు కులగణన చేపడుతున్న ప్ర‌ధాని అభినవ మహాత్మా జ్యోతిరావు ఫూలే అని అభివ‌ర్ణించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు. చేయగ‌లిగిందే చెబుతాం… చేస్తానన్నదే చేస్తుంది బీజేపీ అని స్ప‌ష్టం చేశారు.  బీసీ మేధావులు, యువత, విద్యార్థులు— నెహ్రూ కుటుంబం నుండి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరకు బీసీలపై కొనసాగుతున్న ద్వంద్వ నీతి, మోసపూరిత రాజకీయాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో బీసీ సమాజం మొత్తం కదలి— కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు తగిన గుణపాఠం చెప్పాల‌న్నారు. అంత‌కు ముందు ఆయ‌న జ్యోతీరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బీజేపీ కార్యకర్తలు పల్లెపల్లెకు, ఇంటింటికి వెళ్లి రేవంత్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న దగా, మోసాలను వివరించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్,  బి జయశ్రీ, ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి, వేముల అశోక్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ , బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *