అల్లుడు వొస్తే ఇక అరుగుమీదనే ..!
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగులేకున్నా రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఆరునెలలుగా ఖాళీ గా ఉన్న చీఫ్ ఇంజనీరు పోస్టును ఎట్టకేలకు భర్తీ చేసారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కావాలని 80లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో వాటి అర్హతలను వెతికే ప్రయత్నం శరవేగంగా చేస్తున్నది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఏటా ఇండ్లు ఇస్తున్నప్పటికీ కేంద్రానికి గుర్తింపు ఇవ్వడంలో రాష్ట్రాలు స్వార్థంతో నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏంటో ఘనమైన చరిత్ర ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో చతికిల పడ్డా,పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఇందిరమ్మ ఇండ్లలో అసలైన పేదలకు అందితే లబ్ధిదారులు సంతోషంగా ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతి, రాజకీయ ప్రమేయం పార్టీని భ్రష్టు పట్టించిందని, అవినీతిలో కూరుకుపోయిన ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటు తర్వాత నయాన్నో,భయాన్నో బీఆర్ఎస్ పక్కన చేరక తప్పలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా గుర్తించే ప్రయత్నం చేయాలి. అందులో ఒక కుటుంబం యూనిట్ గా కాకుండా దివ్యంగులు,వితంతువులు, భూమి లేని నిరుపేదలను, ప్రభుత్వ ఉద్యోగం లేని వారిని చేరదీసి ప్రాధాన్యత కల్పిస్తే కొన్ని కాలాల పాటు ప్రభుత్వాన్ని మర్చిపోరు. అలాకాకుండా కార్యకర్తలకు,పైరవీకారులకు చేయూతను ఇస్తే వాటి ప్రభావం ఎన్నికల్లో ఖచ్చితంగా కన్పిస్తుంది.బీఆర్ఎస్ మునగడానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఒక కారణమే.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సార్లు ఉరిచ్చింది. 66 ఏండ్లుగా ఏ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వలేదు.. ఇచ్చినా ఇరుకైన ఇండ్లు ఇచ్చారు.నూతన రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి ,అల్లుడు,బిడ్డ వస్తే ఏడ పండుకోవాలి? గిదేం సంస్కృతి అంటూ డంబాచారం చేసారు. ఆరు నెలల్లో పూర్తీ చేస్తాను దావత్ ఇవ్వాలని 2015లోనే ఉత్తర పలుకులు పలికినారు. 2018లో ఎన్నికల మ్యేనిఫెస్టోలో 125 గజాల స్థలంలో 3లక్షల రూపాయల డబుల్ బెడ్ రూమ్ ల ప్రభావం బాగా పనిచేసింది.అందుకే 88సీట్లతో పట్టం కట్టారు. స్వంత స్థలం ఉంటె 5లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు.అయితే కార్యాచరణలో సాధ్యం కాలేదు. నాడు కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో 2లక్షల 91ఇండ్లను మంజూరు చేస్తే ఎక్కడ మోడీ పేరు రాకుండా జాగ్రత్త పడ్డారనే ప్రచారం జరిగింది. ఇటువంటి వాటితో కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రానికి సంబంధాలు పూర్తిగా చెడిపోయినాయి. అప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద గ్రామీణ, పట్టణాలలో ఇండ్లు పొందడానికి అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇదే అదనుగా బీజేపీ మేము తల్చుకుంటే 10లక్షల ఇండ్లు మంజూరు చేస్తుంటిమి అంటూ గప్పాలు కొట్టింది. 9ఏండ్లలో అఖిలపక్ష నేతలను తీసుకెళ్లి వాస్తవాలను చూపెట్టడంలో విఫలం అయ్యింది.ఒక గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట లో త్వరితగతిన పూర్తిచేశారు. 116 నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడంలో విఫలం అయ్యి, కట్టిన ఇండ్లు నాణ్యత కోల్పోయి శితిలావస్థకు చేరుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.ఓటమికి బలమైన కారణంగా నిలిచింది.
2014లో నిర్వహించిన సమగ్రకుటుంబ సర్వ్ ప్రకారం కేవలం 26.31 లక్షల మంది మాత్రమే ఇండ్లు లేని నిరుపేదలుగా దృవీకరించారు .
అటువంటిది రేవంత్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 80లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం వల్ల పారదర్శకత లోపిస్తే నిరుపేద నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం వచ్చే నాలుగు ఏండ్లలో 20లక్షలు పూర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.మొదటగా 3500ల చొప్పున ప్రతి నియోజక వర్గంలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు కంకణం కట్టుకుంది. సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం మంజూరు చేయడం ఎమ్మెల్యేల చేతిలో ఉండడం మూలాన అర్హులకు అందుతాయా? ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అక్రమాలు కొనసాగుతాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మైదాన ప్రాంతంలో నిర్మించే ఇండ్లకు 60:40 ఎంఓయూ ఉన్నది, కేంద్రంలో నిధులు రాబట్టాలంటే ఇందిరమ్మ పేరు కొనసాగుతుందనేది ప్రశ్నర్థకమే.కేంద్రం ఇచ్చిందా? రాష్ట్రం ఇస్తున్నదా? అనేది పక్కన పెట్టితే ,వచ్చిన చిక్కు అంతా 125 గజాల నుండి 40 గజాలకు తగ్గించడం విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ, స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ హయాంలో 10వేలు కేటాయిస్తే ఇప్పుడు పెరిగిన ధరలు, అవుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని రేవంత్ ప్రభుత్వం 5లక్షలు ప్రకటించడం ముదావహం. అయితే 125 గజాల నుండి 40 గజాలకు తగ్గించడం వల్ల డబుల్ బెడ్ రూమ్ ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. 40గజాలలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తే అల్లుడు అరుగుమీద పండే రోజులు ఎంతో దూరంలో లేవు. కులగణన ప్రాతిపదికన అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగేలా ఇందిరమ్మ ఇండ్లను అర్హులా ? కాదా? అనే విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోని ఆర్థిక స్థితిగతులను పరిశీలించాలి. పారదర్శకత లోపిస్తే నిరుపేదల నుండే తిరుగుబాటు తప్పదు.
-డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355