పారదర్శకంగా ఇందిర‌మ్మ‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

  • రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇళ్ల‌ మంజూరు 
  • ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 144 ఇండ్లు మంజూరు అయ్యాయని, మ‌రో రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తామ‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ (Monister Ponnnam Prabhakar)  అన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం లో పట్టణానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ పట్టాలు పంపిణీ చేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు. ఎవరికైనా అర్హత లేకుండా ఇల్లు వ‌స్తే అది ర‌ద్ద‌వుతుంద‌ని తెలిపారు.

నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం మంజూరయ్యాయని, మరో రెండు నెలల్లో రెండవ విడత ఇళ్లు వొస్తాయ‌న్నారు. వేగంగా ఇండ్లు కట్టుకొని గృహప్రవేశాలు జరగాల‌ని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలని, మొదటి విడత లక్ష రూపాయలు వస్తాయని ఇంకా డబ్బులు లేకపోతే మహిళా సంఘాల నుంచి రూ.లక్ష లోన్ వొస్తుందన్నారు. 10 ఏళ్ల తర్వాత పేద‌ల‌కు ఇండ్లు వ‌స్తున్నాయ‌ని, గత 10 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో 1420 ఇండ్లు మంజూరైతే కేవ‌లం 240 ఇండ్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. హుస్నాబాద్ లోనే 120 ఇళ్లు ఇచ్చారన్నారు. తాము పేద‌ల‌కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 ల‌కు గ్యాస్ అందిస్తున్నాం. రోడ్లు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామ‌న్నారు.

నియోజవర్గంలో ఏ సమస్య ఉన్న పరిష్కారం చేస్తానని తెలిపారు. త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల‌ని, 9వ తేదీలోపు అందరూ ముగ్గులు పోయాల‌ని, హౌసింగ్ ,రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉంటుంద‌ని అన్నారు. హుస్నాబాద్ లో ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదు.. హనుమంతుని గుడి లేని ఊరు లేదు అనే విధంగా ఉండేద‌ని గుర్తుచేశారు. ఇల్లు రాని వారి పరిశీలిస్తున్నాం.. వొచ్చే విడతలో ఇస్తున్నామ‌ని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామ‌ని, అందరూ సొంతింటి కల నిజం చేసుకోవాల‌ని కోరారు. ఇప్పటి వరకు 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశామిన‌, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, బస్ స్టేషన్ ల అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. హుస్నాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ది జరుగుతుంద‌ని, 150 పడకల ద‌వాఖాన నిర్మాణం జరుగుతుంద‌ని తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేశామ‌ని, కోహెడ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో నిర్మిస్తున్నామ‌ని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *